- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోహెడ శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య..
రంగారెడ్డి జిల్లా కోహెడలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి దేవేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దిశ, తుర్కయంజాల్: రంగారెడ్డి జిల్లా కోహెడలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి దేవేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. హన్మకొండకు చెందిన దేవేందర్ రెడ్డి (16) నాలుగు రోజుల క్రితమే తన నివాసం నుంచి కళాశాల హాస్టల్‌కు వచ్చినట్లు సమాచారం. కళాశాల హాస్టల్‌లో గురువారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో తనకు కేటాయించిన గది కాకుండా మరో గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని దేవేందర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. చదువులో చురుకుగా ఉండే తమ కుమారుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ..
ఘటన జరిగిన వెంటనే తమకు సమాచారం ఇవ్వకుండా రాత్రి 10 గంటల సమయంలో మాత్రమే ఫోన్ చేసి చెప్పారని, ఇది కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని తల్లిదండ్రులు ఆరోపించారు. అంతేకాకుండా, తాము కళాశాలకు చేరుకునేలోపే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించడంపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఘటన అనంతరం కళాశాల యాజమాన్యం ఇతర విద్యార్థులను వారి ఇళ్లకు పంపిస్తున్నట్లు సమాచారం. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి మృతిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థి మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.






