రెండో విడతలో పై ‘చేయి’ ఎవరిదో!

by velandi.Saikiran |   (  Updated:2025-12-13 22:45:48  IST  )

మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఊహించినట్టు ఫలితాలు రాలేదు. క్లీన్‌ స్వీప్‌ చేస్తామని

రెండో విడతలో పై ‘చేయి’ ఎవరిదో!
X

రెండో విడతలో పై ‘చేయి’ ఎవరిదో!

- అన్ని పార్టీలకు ‘రెబెల్స్’ బెడద

- మొదటి విడతలో కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్

- పల్లెల్లో అంతగా ప్రభావం చూపని బీజేపీ

- రెండు, మూడు విడతల్లో విజయాలపై అన్ని పార్టీల దృష్టి

- గత తప్పిదాలను సరిదిద్దుకుని.. వ్యూహాలు, ప్రతి వ్యూహాలలో నిమగ్నం

దిశ, రంగారెడ్డి బ్యూరో : మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఊహించినట్టు ఫలితాలు రాలేదు. క్లీన్‌ స్వీప్‌ చేస్తామని కాంగ్రెస్..ప్రభుత్వ వ్యతిరేకతతో అనుకూల ఫలితాలు వస్తాయని బీఆర్‌ఎస్ పార్టీలు ధీమా వ్యక్తం చేశాయి. అయితే మెజార్టీ స్థానాలను దక్కించుకుని కాంగ్రెస్ పల్లెల్లో పట్టును సాధించుకుంది. అలాగే... బీఆర్‌ఎస్ సైతం కాంగ్రెస్ కు గట్టిపోటీని ఇచ్చి ఈ ఎన్నికల్లో ఉనికిని చాటుకుంది. వర్గపోరుకు తోడు చాలా చోట్ల రెబెల్స్​ పోటీలో ఉండటంతో రెండు పార్టీలకు విజయానికి కళ్లెం పడింది. ముఖ్యంగా రెబెల్స్​ కారణంగా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ నష్టం వాటిల్లింది. మొదటి విడత ఫలితాలను బేరీజు వేసుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలు సరికొత్త వ్యూహ ప్రతీ వ్యూహాలతో రెండు, మూడు విడతల్లో విజయం సాధించడంపై దృష్టి పెట్టాయి. ఆయా పార్టీల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది వేచి చూడాలి.

కాంగ్రెస్ కు కొంతమేరనే సంతృప్తి..

మొదటి విడత ఎన్నికలు షాద్‌ నగర్‌ నియోజకవర్గంలోని మండలాలతో పాటు శంషాబాద్‌ మండలాల్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు దక్కిన సర్పంచు స్థానాల పట్ల నేతలు కొంతమేరనే సంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ మద్దతు దారులు సర్పంచుగా 75 మంది గెలిస్తే.. బీఆర్‌ఎస్ పార్టీ సైతం 70 వరకు స్థానాలను గెలుచుకుని పల్లెల్లో పట్టును నిలుపుకుంది. అధికార పార్టీ నుంచి పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో టికెట్‌ దక్కని వారు రెబల్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అయితే పోటీ నుంచి తప్పించేందుకు ముఖ్య నాయకులు పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. ఒకే పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు రంగంలో ఉండటంతో ఓట్లలో చీలిక వచ్చి కాంగ్రెస్ మద్దతుతో నిలబడ్డ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగింది. దీనికి తోడు వర్గ పోరు కూడా అభ్యర్థుల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఇక బీఆర్‌ఎస్ మద్దతుదారులు సైతం కాంగ్రెస్ కు ధీటుగా పోటీనిచ్చారు. కొన్నిచోట్ల స్వల్ప మెజార్టీతో బీఆర్‌ఎస్ మద్దతుదారులు ఓటమి పాలయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ సొంత మండలం అయిన నందిగామతో పాటు ఆయన సొంతూరులోనూ బీఆర్‌ఎస్ సత్తా చాటింది. 19 స్థానాలకు గాను 13 సర్పంచులను గెలుచుకుంది. బీఆర్‌ఎస్ లోనూ వర్గపోరు కొనసాగి.. ముఖ్య నేతలిద్దరూ తమ అనుయాయులను బరిలో ఉంచారు. వర్గపోరు లేకుంటే మరింత మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవన్న చర్చ ఆ పార్టీ నేతల్లో జరుగుతోంది. ఇక బీజేపీతో పాటు ఇతర పార్టీలు మొదటి విడతలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.

రెండో విడతలో కాంగ్రెస్ ఆధిపత్యం ఉండేనా!

ఆదివారం రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. కందుకూరు, చేవెళ్ల రెవెన్యూ డివిజన్లలోని మండలాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 165 సర్పంచ్ స్థానాలకు 499 మంది, 1,306 వార్డులకు 3,508 మంది పోటీ పడుతున్నారు. సాయంత్రం నాటికి ఫలితాలు తేలనున్నాయి. రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో రెండో విడతలో అధికార పార్టీ కాంగ్రెస్ హవా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. మొదటి విడత ఎన్నికల్లో మాదిరిగా బీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇస్తే.. కనుక రెండో విడతలోనూ ఊహించని ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొదటి విడతలో తమ పార్టీ మద్దతు దారులకు అనుకూలంగా వచ్చిన ఫలితాలతో పాటు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి గెలుపునకు దోహదపడిన అంశాలపైననూ సమీక్ష చేసుకుంటున్నారు. రెండు, మూడు విడతల్లోనూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా రెండు పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలను పన్నుతున్నాయి. త్వరలోనే జరిగే ప్రాదేశిక, పురపాలక ఎన్నికలపై సర్పంచు స్థానాల గెలుపు కొండంత బలాన్నిస్తుందన్న భావనతో రెండు పార్టీలు ఉండి విజయం కోసం ఇరుపార్టీల నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Next Story