చెరువు పూడ్చివేత!

by velandi.Saikiran |

నార్సింగి మున్సిపల్ పరిధిలోని జనవాడ గ్రామానికి సమీపంలో ఉన్న జనవాడ చెరువు సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ సంవత్సరం వర్షాలు విస్తారంగా కురవడంతో పరివాహక ప్రాంతం నుంచి భారీగా వర్షపు నీరు వచ్చి చెరువులో చేరింది.

చెరువు పూడ్చివేత!
X

చెరువు పూడ్చివేత!

- కొన్ని రోజులుగా దర్జాగా పూడ్చివేత పనులు

- జనవాడలో కనుమరుగవుతున్న వైనం

- నిబంధనలకు మంగళం

- పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు

- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు

- కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

దిశ, గండిపేట : చెరువును పూడ్చివేస్తున్నారు. మట్టి, రాళ్లు, ఇతర నిర్మాణ వ్యర్థాలతో నింపేస్తున్నారు. నీళ్లు నిలువాల్సిన చోటును తమ సొంత అవసరాల కోసం వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నా.. పట్టించుకునే నాథుడు కరువయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఇరిగేషన్ నిబంధనల ప్రకారం పట్టా పొలం అయినా సరే దానిని ఏమాత్రం పూడ్చకూడదు. ఎండాకాలంలో నీళ్లు ఎండిపోతే సాగు పనులు చేసుకోవచ్చు. అంతే గాని దానిని నిబంధనలకు విరుద్ధంగా మట్టి, రాళ్లు ఇతర నిర్మాణ వ్యర్థాలతో ఏమాత్రం పూడ్చి వేయవద్దు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కఠిన చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది.

దర్జాగా పూడ్చివేత

నార్సింగి మున్సిపల్ పరిధిలోని జనవాడ గ్రామానికి సమీపంలో ఉన్న జనవాడ చెరువు సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ సంవత్సరం వర్షాలు విస్తారంగా కురవడంతో పరివాహక ప్రాంతం నుంచి భారీగా వర్షపు నీరు వచ్చి చెరువులో చేరింది. చెరువులో కొందరి రైతుల పట్టా భూములు కూడా ఉన్నాయి. సాగుకు అనువుగా ఉన్న సమయంలో పంటలు పండించుకోవచ్చు. అయితే కొందరు వ్యవసాయతర పనుల కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఫామ్ హౌస్ లు కూడా నిర్మించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జనవాడ గ్రామ చెరువు తూర్పు భాగంలో సుమారు పది ఎకరాల స్థలంలో చెరువును మట్టి, బండ రాళ్లు ఇతర నిర్మాణ వ్యర్థాలతో నింపేస్తున్నారు. ఈ పనులు సుమారు నెలరోజులుగా జరుగుతున్నట్లు జనవాడ గ్రామస్తులు తెలియజేశారు. వ్యవసాయ ఇతర పనుల కోసం చెరువును మట్టితో నింపుతున్నట్లు స్పష్టంగా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ఈ వ్యవహారం పైన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవలసిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 10 ఎకరాలకు పైగా చెరువును ఏమాత్రం భయం లేకుండా దర్జాగా నింపేశారు. చెరువులో నీళ్లు ఉన్నప్పుడే ఈ పనులు జరగటం గమనార్హం.

చర్యలు తీసుకోవాలని డిమాండ్

గండిపేట చెరువును ఆనుకొని ఉన్న జనవాడ చెరువు పరిరక్షణకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. చెరువును కొన్ని రోజులుగా పూడ్చుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం పైన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సత్వరమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.

Next Story