రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా... పైగా లీజుకిస్తూ నెలకు రూ. లక్షల్లో సంపాదన!

by Dishanational1 |
రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా... పైగా లీజుకిస్తూ నెలకు రూ. లక్షల్లో సంపాదన!
X

దిశ, కంది: అది గతంలో నిరుపేద రైతులకు సాగు కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి. అప్పట్లో ఆ ఏరియాలో సదరు భూమికి అంతగా డిమాండ్ లేదు. కానీ ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతుండడంతో కొందరు లీడర్ల కన్ను ఆ భూమిపై పడింది. ఇంకేముంది పక్క ప్లాన్ తో రూ. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఏకంగా తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సాగు కోసం వచ్చిన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు అధికారులకు ముడుపులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవడంపైగా అదే భూమిలో కొన్ని డబ్బాలు ఇతర పరిశ్రమకు భూమి లీజుకి ఇచ్చి నెలకు రూ. లక్షల్లో సంపాదిస్తూ వస్తున్నారు. ఇది ఈ మధ్యకాలంలో జరిగిన విషయం కాదు. గత నాలుగు ఐదు ఏళ్లుగా ప్రభుత్వ భూమి కబ్జాకి గురైన కూడా ఏ ఒక్క అధికారి కనీసం దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవంటే గమనార్హం. బడా నేతల అండదండలతో ప్రధాన రహదారి కంది - శంకర్ పల్లి పక్కనే ఉన్న ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాపై దిశ ప్రత్యేక కథనం.

బడా లీడర్ల మాయాజాలం...

సంగారెడ్డి జిల్లా కూతవేటు పరిధిలోని కంది మండల కేంద్రం చుట్టూ ప్రస్తుతం భూముల విలువ రూ. కోట్లల్లో పలుకుతుంది. రోడ్డుకు ఆనుకొని మొదటి, రెండో బిట్లు భూములు 2 నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఎకరా మార్కెట్ విలువ నడుస్తున్నది. అయితే గతంలో కొన్ని సంవత్సరాల క్రితం కంది లోని సర్వే నెంబర్ 615 లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పటి ప్రభుత్వం స్థానిక రైతులకు సాగు కోసం కేటాయించింది. పంటలు సరిగా పండకపోవడంతో రైతులు సాగు చేయకుండా కొంతమంది వదిలేశారు. అప్పుడప్పుడే ఆ భూముల విలువ పెరుగుతుండడంతో అప్పటి కాంగ్రెస్ హయాంలోని స్థానిక ఓ నాయకుడు ఈ భూమిపై కన్నేశాడు. రైతులకు కేటాయించిన భూమిని మాజీ సర్వీస్ మెన్ పేరిట మొత్తం ఐదు ఎకరాల భూమిని తన వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ భూమిలో ప్రైవేటు డబ్బాలతోపాటు ఆరేళ్ల క్రితం ఓ కాంక్రీట్ మిక్సర్ ఫ్యాక్టరీకి స్థలాన్ని లీజుకు ఇచ్చి నెలకు రూ. 4 నుంచి 5 లక్షల వరకు కిరాయి ద్వారా డబ్బులు దండుకుంటున్నాడు. గతంలో కూడా ఈ విషయమై అప్పటి స్థానికులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా కూడా ఏ ఒక్క అధికారి సదరు కబ్జాదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం.

ప్రభుత్వ భూమిని కాపాడరా...?

కంది కేంద్ర పరిధిలోని 615 సర్వే నెంబర్ లోని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కబ్జాకు గురైన 5 ఎకరాల భూమిని అధికారులు కాపాడతారా అంటూ స్థానికులు ఇతర ప్రజాప్రతినిధుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భూమికి సంబంధించిన వివరాలు కూడా ప్రస్తుతం ధరణిలోని ప్రోహబిషన్ ల్యాండ్ జాబితాలో ఉన్నది. ఈ విషయమై కొందరు కోర్టును ఆశ్రయించగా అందుకు సంబంధించిన కేసు కూడా ఇంకా కోర్టులోనే నడుస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలోనే కబ్జాకు గురైన ఐదు ఎకరాల భూమిలో సదరు వ్యక్తులు భూమిని లీజుకి ఇస్తామంటూ బాహాటంగానే బోర్డులు పెట్టి దందా చేస్తుండడం శోచనీయం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారులు స్పందించి కబ్జాకు గురైన కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీన పరుచుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి జంప్..

కందిలో వివాదాస్పదమైన 615 సర్వే నెంబర్ లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు అప్పటి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కంది గ్రామానికి చెందిన ఓ స్థానిక నాయకుడు ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సదరు నాయకుడి స్వాహా వ్యవహారం జీర్ణించుకోలేక అప్పటి అధికార బీఆర్ఎస్ నాయకులు అతడిపై కక్ష కట్టారు. అప్పటి అధికారుల సహాయంతో చర్యలకు ఊతమిచ్చారు. చేసేది లేక సదరు నాయకుడు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని పార్టీ మారాడు. ఆ తర్వాత స్థానిక అధికార పార్టీకి చెందిన బడా నేతల అండదండలు ఉండడంతో ప్రస్తుతం రూ. కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనా ఏ ఒక్క అధికారి కూడా అటువైపు తిరిగి చూడడం లేదు. ఈ వ్యవహారం అంతా బడా నేతలతోపాటు ఉన్నతాధికారులకు తెలిసినా కూడా చర్యలు తీసుకోకపోవడంతో స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు భూములను కాపాడాల్సిన అధికారులే కబ్జాదారులకు సపోర్టుగా నిలవడం ఏమిటా అని ఇతర పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.


Next Story