- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ రైతులకు అలర్ట్...భూ పరిపాలనలో నూతన శకం
బీఆర్‌ఎస్ హయాంలో అమలైన ‘ధరణి’తో రైతులకు ఏ మాత్రం ప్రయోజనం కలగక పోగా..సరికొత్తగా భూ సమస్యలు పుట్టుకొచ్చాయి.

భూ సమస్యలకు చెక్!
భూ పరిపాలనలో నూతన శకం
అందుబాటులోకి సమీకృత భూ భారతి పోర్టల్
ఈ నెల 2 నుంచి ప్రయోగాత్మకంగా అమలు
పైలెట్ ప్రాజెక్టు కింద ఆమన్ గల్ మండలం ఎంపిక
అన్నదాతల చెంతకు రెవిన్యూ అధికారులు
నిశితంగా భూ సమస్యల పరిశీలన
రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సర్వే శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు
ఒక్క క్లిక్ తో సమస్త సమాచారం అందుబాటులోకి
ప్రతి సర్వే నంబరుకు భూధార్ నంబరు కేటాయింపు
రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ జత చేయడం తప్పని సరి
పైలెట్ ప్రాజెక్టు ఫలితాలను బట్టి జిల్లా వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం చర్యలు
దిశ, రంగారెడ్డి బ్యూరో : బీఆర్‌ఎస్ హయాంలో అమలైన ‘ధరణి’తో రైతులకు ఏ మాత్రం ప్రయోజనం కలగక పోగా..సరికొత్తగా భూ సమస్యలు పుట్టుకొచ్చాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ‘ధరణి’కి చరమగీతం పాడి ‘భూ భారతి’కి బీజం వేసింది. సమగ్ర అధ్యయనం తర్వాత భూ భారతి పోర్టల్‌కు రూపకల్పన చేశారు. ఈ పోర్టల్ ద్వారా భూ సమస్యలకు చెక్ పెట్టాలని సంకల్పించి తొలుత రాష్టవ్యాప్తంగా ఐదు జిల్లాల్లోని ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా భూ భారతి పోర్టల్ ను అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పైలెట్ ప్రాజెక్టులో రంగారెడ్డి జిల్లా ఆమన్ గల్ మండలం ఉండగా.. ఏప్రిల్ 2 నుంచి ఈ మండలంలో పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించి పూర్తి ఫలితాలను రాబట్టాక రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగానూ పోర్టల్ ను అమలులోకి తేనున్నారు. ‘ధరణి’ స్థానంలో తెచ్చిన ‘భూ భారతి’ పోర్టల్ భూ పరిపాలనలో నూతన శకంగా ప్రభుత్వం చెబుతోంది.
కార్యాలయాల చుట్టూ తప్పని ప్రదక్షిణలు..
గత ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరిస్తామంటూ భూ రికార్డుల ప్రక్షాళనను చేపట్టింది. ఆ సయమంలో రెవిన్యూ ఉద్యోగులకు సరైన సమయం ఇవ్వకపోవడంతో రికార్డుల ప్రకాక్షళన మొక్కుబడిగా సాగింది. రకరకాల సాకుతో వేలాది ఎకరాల భూములను పార్ట్-బి కింద పెట్టారు. వీరికి గతంలో పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నప్పటికీ కొత్త పుస్తకాలను జారీ చేయలేదు. చివరకు ఈ భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు కూడా చేయలేదు. దీంతో జిల్లాలో అనేక మంది రైతులు ఉన్న హక్కులను కోల్పోయారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలోనే పరిష్కారం కావాల్సిన భూ సమస్యలు హైదరాబాద్‌లోని సీసీఎల్ వరకు వెళ్లినా పరిష్కారం కాని పరిస్థితి ఏర్పడింది. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేకంగా ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని చేయకపోగా, జిల్లా స్థాయిలోనే మమ అనిపించి ఏఒక్కరికీ న్యాయం చేయకుండానే సివిల్ కోర్టులను ఆశ్రయించాలని సెలవిచ్చారు. భూ సమస్యలు ఉంటే ధరణి పోర్టల్‌కు దరఖాస్తు చేసుకుంటే పరిష్కారం చేస్తామని చెప్పడంతో వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి అనేకమార్లు రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. మాడ్యూల్స్పేరుతో నాలుగేళ్లుగా ఊరిస్తూ రావడంతో నేటికీ రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఆమన్‌గల్‌లో చిక్కు ముడులెన్నో..!..
రంగారెడ్డి జిల్లాలో భూ సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. గత యేడాది ఆగస్టు మాసం నాటికి 4,500 వరకు దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. ఏకంగా కొన్ని సర్వే నెంబర్లే మిస్ అయ్యాయి. కొన్నిచోట్ల సర్వే నెంబర్లు, ఇంటి పేరు, భూ యజమాని పేరు తప్పుగా ఉండడం.. విస్తీర్ణం తక్కువగా నమోదవడం, నిషేధిత భూముల జాబితాలో పట్టా భూమి సర్వే నెంబర్లు రావడం, సాదాబైనామా, మ్యుటేషన్, అసైన్డ్ ల్యాండ్ పట్టా, వారసత్వ పట్టా వంటి వివిధ కేటగిరీల్లో దరఖాస్తులు పెద్ద ఎత్తున అధికారుల వద్ద పేరుకుపోయాయి. ప్రత్యేక సభలు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాక కొన్ని పరిష్కారం అయినప్పటికీ ఇంకా.. 2వేల వరకు రైతుల దరఖాస్తులు పెండింగులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక అయిన ఆమన్ గల్ మండలంలోని 9 రెవిన్యూ గ్రామాల పరిధిలో ఇంకా వందకు పైగా భూ సంబంధిత దరఖాస్తులు పెండింగులో ఉన్నట్లు తెలిసింది. సర్వేయర్ లేకపోవడం, మాడ్గుల మండల సర్వేయర్ ఇంఛార్జీగా ఉండడంతో సమస్యల పరిష్కారంలో జాప్యం నెలకొంది. ఈ మండలంలో 1600 వరకు సర్వే నంబర్లు ఉండగా..వీటిలో 300 సర్వే నంబర్లకు మ్యాపింగ్ లేదు. ప్రస్తుతం ఈ మండలం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ఇక్కడి రైతాంగం ఉంది. ధరణి పోర్టల్ లో 36 మాడ్యుళ్లు ఉంటే.. భూ భారతిలో ఒకే చాప్టర్ కింద తీసుకొచ్చారు.
పైలెట్ ప్రాజెక్టులో ఏం చేస్తారంటే..
- రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి పోర్టల్ ను అమలులోకి తేనున్నారు.
- మండలంలో నక్షాలేని గ్రామాల్లో రీ సర్వే నిర్వహించి ప్రతి సర్వే నెంబరుకు భూధార్ కార్డును కేటాయించనున్నారు.
- ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబరుతో లాగిన్ అయితే దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి దశలో సంబంధిత వివరాలు సంక్షిప్త సందేశం ద్వారా మొబైల్ కు రానున్నాయి.
- ఒక్క క్లిక్ తో సర్వేకు సంబంధించిన వివరాలు, సవరణలు, అప్పీళ్లు, రిజిస్ట్రేషన్ వివరాలు తదితర సేవలను తెలుసుకోవచ్చు. అలాగే సిటిజన్ డ్యాష్ బోర్డుకు సంబంధించి మై ల్యాండ్ పోర్ట్ పోలియో, నాలా ఆర్డర్స్, రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్ వివరాలు, ఫీడ్ బ్యాక్ వ్యవస్థ, సంబంధిత అధికారుల వివరాలు, ఆర్వోఆర్, భూధార్ నంబర్లు, దరఖాస్తుదారు వివరాలు, మ్యుటేషన్, ఈసీ, మార్కెట్ విలువలు, విలేజ్ మ్యాప్, సర్వే నంబర్ల వారీ మ్యాప్ లు పోర్టల్ లో లభించనున్నాయి.
- వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ ను జత పరిచే నిబంధనను ఆమన్ గల్ మండలంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.






