ధీమా ఇవ్వని బీమా.. ఆందోళనలో గొర్రెలు, మేకల పెంపకందారులు

by Yella Dhawani Reddy |

గొర్రెలు, మేకల పెంపకందారుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెడుతున్నా.. అవి లబ్ధిదారులకు చేరడం లేదు.

ధీమా ఇవ్వని బీమా.. ఆందోళనలో  గొర్రెలు, మేకల పెంపకందారులు
X

దిశ, కేశంపేట : గొర్రెలు, మేకల పెంపకందారుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెడుతున్నా.. అవి లబ్ధిదారులకు చేరడం లేదు. మరికొన్ని పథకాల్లో ప్రభుత్వం కండీషన్స్ పెట్టడంతో అవి చాలా మంది రైతులకు ఉపయోగం లేకుండా పోతున్నాయి. బీమా పథకాన్ని నిర్వీర్యం చేయడంతో గొర్రెలు, మేకల పెంపకందారులలో ధీమా తగ్గుతోంది. ఇప్పటికే పలు చోట్ల సిబ్బంది, సరైన మందులు లేక పశువైద్యం పడకేయగా.. ప్రభుత్వం ఏటా అందించే బీమా పథకంపై గత కొన్నేళ్లుగా స్పష్టత లేకపోవడంతో గొర్రెలు, మేకల పెంపకందారుల పరిస్థితి డోలాయమానంలో పడింది. విపత్తుల కారణంగా వందల సంఖ్యలో గొర్రెలు, మేకలు మరణిస్తున్నా.. ప్రభుత్వం వైపు నుంచి సాయం అందక అల్లాడుతున్నారు. మన ప్రాంతంలో వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమ రెండో అతి పెద్దరంగంగా వర్ధిల్లుతోంది. చాలామంది గొర్రెలు, మేకలను పెంచుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. బీమా సౌకర్యమే లేకపోవడంతో సాయం ఎండమావిగా మారింది. కేశంపేట మండలంలో 1,661 గేదెలు, 13,618 ఆవులు, 21,284 గొర్రెలు, 4,800 మేకలు, 433 పందులను, అధిక సంఖ్యలో కోళ్లను పెంచుతున్నారు.

వేధిస్తున్న మందుల కొరత

కేశంపేట మండలంలో 2 ప్రాథమిక పశు వైద్య కేంద్రాలు, 4 సబ్ సెంటర్లు ఉన్నాయి. ప్రస్తుతం కొత్తగా సిబ్బంది వచ్చారు. 4 సబ్ సెంటర్లలో ఓఎస్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. మందుల కొరత మాత్రం తీవ్రంగా ఉండటంతో ప్రైవేట్ పైనే జీవాల పెంపకందారులు అధికంగా ఆధారపడాల్సి వస్తుంది. ఏటా వ్యాధులు విజృంభించడం, విపత్తులు వస్తుండటంతో పశువులు, గొర్రెలు, మేకలు వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో బీమా ధీమానివ్వాల్సి ఉండగా ఆ ఊసే లేదు.

సొంత జీవాలకు బీమా ఉండేది

గతంలో సొంత గొర్రెలు, మేకలకు, పాడి గేదెలకు బీమా సౌకర్యం ఉండేది. కాలక్రమేణ ప్రభుత్వం ఇచ్చే రాయితీ జీవాలకు మాత్రమే బీమా వర్తింపజేస్తున్నారు. గతంలో ఒక్కో గొర్రెకు కనీసం రూ.45 బీమా ప్రీమియంగా చెల్లించేవారు. జీవాలు మృ‌త్యువాత పడిన సమయంలో రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు నష్ట పరిహారం వచ్చేది. అయితే బీమా ప్రకటన లేకపోవడంతో గొర్రెలు, మేకలను కోల్పోయినవారికి భరోసా కరువైంది.

పాడి పరిస్థితి అంతే..

పాడి పశువులు విద్యుత్ షాక్, పిడుగు పాటు, పాము కాటు, ప్రకృతి వైపరీత్యాలతో మరణిస్తే బీమా వర్తిస్తుంది. ఇది కూడా ప్రభుత్వం ఇచ్చే రాయితీ పాడిగేదెలకు మాత్రమే వర్తిస్తోంది. రైతులు చెల్లించే ప్రీమియంలో ప్రభుత్వం 45 శాతం వరకు రాయితీ అందిస్తుంది. కానీ సంవత్సర బీమా లేకపోగా మూడేళ్ల బీమా కొనసాగుతోంది. ప్రభుత్వమిచ్చిన రాయితీ గేదెలకు మూడేళ్ల వరకు బీమా ఉంటుండగా తరువాత ఆ సౌకర్యం ఉండదు. సొంతంగా రైతు కొనుగోలు చేసిన పాడి గేదెలకు అసలే వర్తించదు.

విపత్తు సాయం అందని ద్రాక్షే..

పిడుగు పాటు, పాము కాటు, వరదలతో గొర్రెలు, మేకలు, పాడి గేదెలు మరణించినప్పుడు సంబంధిత పశు వైద్యుడు నివేదిక తయారుచేసి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారికి, తహసీల్దార్‌కు వివరాలు పంపిస్తారు. తరువాత కలెక్టరేట్ నుంచి విపత్తు విభాగానికి నివేదిస్తే.. అక్కడి నుంచి సాయం అందిస్తుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా విపత్తుసాయం లేకపోగా పడిగాపులే ఎదురవుతున్నాయి. నేటికీ సౌకర్యం లేదని, పాడి రైతులకు ఇదే వర్తిస్తుందని పశుసంవర్ధక శాఖ అధికారులు అంటున్నారు.

బీమాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి

గతంలో సొంత జీవాలకు ప్రభుత్వ బీమా ఉండేది. చాలా ఏళ్ల నుంచి ప్రభుత్వం ఆ సదుపాయాన్ని కల్పించడం లేదు. ప్రభుత్వం ఇచ్చే రాయితీ జీవాలకు మాత్రం బీమా వర్తింపజేస్తున్నారు. ప్రభుత్వం పథకాల కింద లబ్దిదారులు పొందిన పశువులకు మాత్రమే యూనిట్‌ విలువ నుంచి బీమా కల్పించారు. గతంలో రైతు వాటాతో పాటు ప్రభుత్వం కొంత మొత్తం చెల్లించి పశువులకు బీమా సౌకర్యం కల్పించేది. శాఖాపరంగా రైతుల అభిప్రాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళుతున్నాం. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి.

- నివేదిత, మండల వెటర్నరీ అధికారి

వృత్తికి జీవం పోయండి

ప్రస్తుత కాలంలో గొర్రెలు, మేకలను పెంచడం సవాల్‌గా మారింది. వాటిని మేపేందుకు అసలే మేత కరువవగా బీమా లేకపోవడంతో పెంపకానికి కూడా చాలా మంది విముఖత చూపుతున్నారు. బీమా సౌకర్యం కల్పిస్తేనే పెంపకందారులకు నష్టం జరిగితే దానిని కొంత మేర పూడ్చుకునే అవకాశముంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాలి. వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి జీవించేది పాడి పరిశ్రమ పైనే అందుకే ప్రభుత్వం బీమాపై ఆలోచించాలి.

- గొరిగె నారాయణ, గొర్రెల పెంపకందారుడు

Next Story