ఇసుక మాఫియాకి అడ్డుకట్టేది..?

by Ajay Maddhiboyina |

తాండూరు మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. కాగ్నానది, వాగులు, వంకల నుంచి పరీవాహక ప్రాంతాల వరకు ఇసుకను తోడేస్తున్నారు. ఎలాంటి అనుమతులూ లేకుండా యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు.

ఇసుక మాఫియాకి అడ్డుకట్టేది..?
X

దిశ, తాండూరు: తాండూరు మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. కాగ్నానది, వాగులు, వంకల నుంచి పరీవాహక ప్రాంతాల వరకు ఇసుకను తోడేస్తున్నారు. ఎలాంటి అనుమతులూ లేకుండా యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ అక్రమ దందా వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ రోడ్డు మార్గంలోని వైష్ణవి మోటార్స్ వెనకాల, చైతన్య టెక్నో స్కూల్ శివారులోని ప్రైవేట్ వెంచర్లో 25 నుంచి 30ట్రాక్టర్ల ఇసుకను డంప్ చేశారు. అసలే అంతంత మాత్రంగా భూగర్భ జలాలు ఉండగా ఇసుక అక్రమ రవాణా కారణంగా భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్యులు ఇళ్ల నిర్మాణాలకు ఇసుక అవసరం వస్తే సవాలక్ష నిబంధనలు చెప్పే అధికారులు ఇసుక అక్రమ రవాణా దారుల విషయంలో నోరు మెదపకుండా చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, యంత్రాంగం వీటిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

పట్టణం చుట్టూ ఇసుక డంపులు...!

తాండూరు, కోకట్, ఖాజాపూర్ కాగ్నా నది నుంచి భారీ ఎత్తున ఇసుకను తాండూరు మున్సిపల్ పరిధిలో పలు ప్రాంతాలకు తరలిస్తూ నిల్వ చేస్తున్నారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలోని వైష్ణవి మోటార్స్ వెనకాల, చైతన్య టెక్నో స్కూల్ శివారులో, ప్రైవేట్ వెంచర్లో, భారీ మొత్తంలో ఇసుక డంపు దర్శనమిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ఇసుక దందాకు పూర్తి మద్దతు ఇస్తుండడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ చట్టాలను, ఆదేశాలను అమలు చేయాల్సిన అధికారులలో కొందరు అక్రమార్కులతో చేతులు కలపడంతో ఇక ఇసుకమాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, తద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించి అమాయకుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

అనుమతి పేరుతో అక్రమాలు..!

ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్న ప్రాంతాల్లో చాలా మంది ఇసుక వ్యాపారులు వివిధ అభివృద్ధి పనుల పేరుతో అనుమతి తీసుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దందా కొనసాగిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని మామూళ్ల మత్తులో ముంచుతూ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. వివిధ అభివృద్ధి పనులు, కొందరికి వ్యక్తిగత అవసరాల కోసం అనుమతులు ఇస్తున్నామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. రాత్రి వేళలో ఇసుక తరలింపును పూర్తిగా అడ్డుకుంటున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని పోలీసుశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం యంత్రాంగం నిర్లిప్తతతో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది.

మామూళ్ల మత్తులో అధికారులు..?

అక్రమ ఇసుక రవాణాలో కిందిస్థాయి నుండి పైస్థాయి అధికారుల వరకు ముడుపులు అందుతున్న కారణంగానే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూరుతుంది. రాత్రి వేళల్లో తరలించే అక్రమ ఇసుక రవాణా సంబంధిత అధికారులందరికీ తెలుసని పలువురు ఆరోపిస్తున్నారు.

Next Story