- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాండూరులో మున్సిపల్ ఎన్నికలపై పుకార్ల షికార్లు
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుందన్న వార్త రాగానే తాండూరులో మాత్రం పుకార్ల షికార్లు సోషల్ మీడియాలో ఇటు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

మున్సిపల్ ఎన్నికలు..
పొలిటికల్ హీట్!
తాండూరులో మున్సిపల్ ఎన్నికలపై పుకార్ల షికార్లు
36 వార్డులకు అన్ని పార్టీల్లో 150-200 ఆశావహులు
రిజర్వేషన్ల ముందే ప్రచారాలతో హడావుడి
‘షరా మామూలే’ అంటున్న రాజకీయ విశ్లేషకులు
దిశ, తాండూరు : రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుందన్న వార్త రాగానే తాండూరులో మాత్రం పుకార్ల షికార్లు సోషల్ మీడియాలో ఇటు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతాయని ప్రకటన వెలుపడిన వెంటనే అన్ని రాజకీయ పార్టీల్లో అటు చైర్మన్ల పేరు, ఇటు కౌన్సిలర్ అభ్యర్థుల పేర్లు అమాంతం ఒక స్థాయిలో వినిపిస్తున్నాయి. తాండూరు మున్సిపల్ కౌన్సిల్లో ఉన్న 36 వార్డులకు గాను అన్ని పార్టీల్లో సుమారు 150 నుంచి 200 వరకు పేర్లు వినిపిస్తున్నాయి. ఎలాంటి రిజర్వేషన్లు ప్రకటించలేని పరిస్థితుల్లో అధికారులు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాని సందర్భంలో తలామునకులవుతుంటే అభ్యర్థులు మాత్రం పోటీలో ఉన్నామంటూ సోషల్ మీడియాలో అభిమానులతో పోస్టులు పెట్టిస్తూ జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ముఖ్యంగా వేటు ఎస్ఎంఎస్ లాంటి సోషల్ మీడియా వేదికల మీద తమ ఫొటోలతో పాటు తమకే అధిష్టానం టికెట్ కేటాయిస్తుందని, పోటీలో తానే ఉన్నామంటూ చేస్తున్న ప్రచారం ఒకవైపు సామాన్య ప్రజల్లో ప్రచారం కల్పిస్తున్నప్పటికీ కొంతమంది దృష్టిలో అపహస్యం అయ్యే పరిస్థితికి అభ్యర్థులు గురవుతున్నారు.
మళ్లీ సేమ్ రిపీటా..?
మొన్నటికి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం ఎంతమంది ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లింది అనే అంశం అందరికీ తెలిసిందే. ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ పదవిపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు గ్రామంలో చేసిన సేవా కార్యక్రమాలు, విందు, వినోదాలకు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేసుకున్నారు.తీరా రిజర్వేషన్లు ప్రకటించగానే 70 శాతం మందికి రిజర్వేషన్ల దెబ్బ బలంగా తాకింది. చాలామంది అభ్యర్థుల ఆశలు అడియాశలు అయ్యాయి. కొంతమంది మానసికంగా ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తుంది. తాండూర్ మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తామే అభ్యర్థులం అంటూ పరోక్షంగా ప్రకటనలు గుప్పిస్తూ మానసికంగా సంతోషపడుతున్న అభ్యర్థులు రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోతే తీవ్ర మనస్తాపానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆయా రాజకీయ పక్షాల్లో కూడా చైర్మన్ అభ్యర్థుల పేర్లు రోజు రోజుకు మారుతున్నాయి. గంట గంటకో పేరు తెరమీదికి వస్తుంది. దాంతో సంక్రాంతి సెలవుల్లో భోగిమంటల కన్నా ఎక్కువ వేడితో తాండూరు మున్సిపాలిటీ పరిధిలో చర్చలు జరుగుతున్నాయి.
ఆశిస్తుంది ఎందరో.. అదృష్టం ఎవరికో..?
అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే వస్తున్న అభ్యర్థుల పేర్లు జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి గౌడ్, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవి గౌడ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు రావుఫ్, పట్లోళ్ల నర్సింహులు, నీరజ బాల్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డి తదితరుల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవకాశం వస్తే తాను జిల్లా పరిషత్ చైర్మన్ కు పోటీలో ఉంటానని, మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఎక్కువ ఆసక్తి లేదని మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి గౌడ్ చెబుతున్నట్టు తెలుస్తున్నది. అయితే పార్టీ ఆదేశిస్తే కనుక పోటీలో ఉండేందుకు కూడా సిద్ధమని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్తున్నట్టు సమాచారం. డీసీసీబీ మాజీ చైర్మన్ రవి గౌడ్ సైతం ఆరోగ్య కారణాల రీత్యా పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు బహిరంగంగా చెబుతున్నప్పటికీ లోలోన ముమ్మర ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రావుఫ్ అభ్యర్థిత్వంపై పార్టీలో కొంత భిన్న అభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన పోటీలో ఉంటే బీజేపీ బలపడొచ్చు అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. 36 వార్డులకు గాను అన్ని పార్టీల్లో సుమారు 150 నుంచి 200 వరకు పేర్లు వినిపిస్తున్నాయి.
రిజర్వేషన్లు కలిసొస్తే..!
ఇక మాజీ కౌన్సిలర్లు చైర్మన్ పోటీలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నా ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. ఏదిఏమైనా జనరల్ స్థానం రిజర్వేషన్లలో కనుక ఆర్బీఎల్ సీఈవో శ్రీనివాస్ రెడ్డి భార్య సరళరెడ్డిని పోటీలో నిలిపేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రజల్లో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి జనరల్ బీసీ రిజర్వేషన్ అనుకూలంగా వస్తే మాజీ వైస్ చైర్మన్ దీపా నరసింహులు చైర్మన్ అభ్యర్థిగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఇంకొక పేరు కూడా బీఆర్ఎస్ లో వినిపించకపోవడం చూస్తుంటే రిజర్వేషన్లు అనుకూలంగా రాని పక్షంలో పరిస్థితి ఏంటన్నది ఎవరికీ అంతు పట్టడం లేదు. కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు కూడా ఎక్కువమంది అభ్యర్థులు ఉత్సాహం చూపించడం లేదని తెలుస్తోంది.
చీకటి ఒప్పందమా..?
కేంద్రంలో ఉన్న అధికారం పార్టీ భారతీయ జనతా పార్టీ పోటీ మున్సిపల్ ఎన్నికల్లో నామమాత్రంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 8 సీట్లు సాధించిన బీజేపీకి ఎప్పుడు మూడు లేదా నాలుగు సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత వారం రోజులుగా బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులతో రహస్య వందనాలు జరుపుతున్నారని, బీఆర్ఎస్ బలంగా ఉన్న వార్డుల్లో బలహీనమైన బీజేపీ అభ్యర్థులను పోటీలో నిలిపి వీలైతే బీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటింగ్ చేయించాలని బీజేపీ నియోజకవర్గ స్థాయి నాయకులు చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్నది. ఇదిలా ఉండగా రిజర్వేషన్ల ఖరారుకు ముందే చైర్మన్ అభ్యర్థులు, కౌన్సిలర్ అభ్యర్థులు ప్రచారమాధ్యమాల్లో ప్రచారం చేసుకోవడాన్ని ప్రజలు నవ్వుకుంటున్నారు.






