- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాసవీ మోసాలు.. ఫ్లాట్ల అప్పగింతలో తీవ్ర జాప్యం! రెరా సీరియస్..
ఫిర్యాదుదారుల వాదనలను, వాసవి సంస్థ వాదనలను రెరా రికార్డు చేసింది. రెరా అమ్మకపు ఒప్పందంలోని వివాద పరిష్కార నిబంధన ఉన్నప్పటికీ, ఫిర్యాదు చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుగోలుకు ముందు అనేక హామీలు ఇస్తున్నాయి. అడ్వాన్స్ చెల్లించి ఫ్లాట్ బుకింగ్ చేసుకునే వరకు తియ్యని మాటలతో ఆకట్టుకుంటున్నారు. ఫ్లాట్లు అమ్ముడుపోతే చాలునన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఆ తర్వాత మూడు, నాలుగేండ్లల్లో అప్పగిస్తామన్న ఇండ్లను ఐదేండ్లయినా పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారు. సొంతింటి కలలను కనే వారి నోట మట్టి కొడుతున్నారు. ప్రధానంగా వాసవి వంటి సంస్థలపైనా ఫిర్యాదుల పరంపర కొనసాగుతుంది. జాతీయ స్థాయి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయంటూ ప్రచారం చేసుకునే ఈ సంస్థ కూడా వినియోగదారులకు చెప్పిన సమయానికి ఫ్లాట్లు అప్పగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. ఈ క్రమంలోనే వాసవి సంస్థపై రెరా మండిపడింది. పెద్ద ఎత్తున జరిమానా విధించడం గమనార్హం.
ఫ్లాట్లు అప్పగించడం లేదు
హాఫీజ్‌పేట్‌లోని వాసవి లేక్ సిటీ ప్రాజెక్టులోని ఫ్లాట్ కొనుగోలుదారులకు చెప్పిన సమయానికి ఇండ్లు అప్పగించడంలో విఫలమైంది. అందుకు గాను వారికి 10.70 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. వాసవి లేక్ సిటీ ప్రాజెక్టులో కొనుగోలు చేసిన 30 మందికిపైగా కస్టమర్లు తెలంగాణ రెరాకు ఫిర్యాదు చేశారు. వీరిలో కొందరికి 2023 ఆగస్టులో, మరి కొందరికి 2024లో ఫ్లాట్లను అప్పగిస్తామని వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ అగ్రిమెంట్ చేసింది. 2025లోనూ తమకు ఫ్లాట్లను అప్పగించడం లేదని వారంతా ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణలో ఒకే ప్రాజెక్టు మీద 34 కేసుల్లో పెనాల్టీ విధించడం ఇదే మొదటి సారి. అన్ని ఆర్డర్లు గత నెల 30వ తేదీన జారీ చేయడం గమనార్హం. ఎవరైనా ఫ్లాట్లు కొనుగోలు చేసే వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే డెవలపర్ హిస్టరీని కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు.
ఎలాంటి హామీ లేదు
వాసవి లేక్ సిటీ ప్రాజెక్టులో కొనుగోలు చేసిన 34 మంది వాసవి సంస్థపై ఫిర్యాదు చేశారు. ఒప్పందం ప్రకారం గడువు ముగిసినా ఫ్లాట్లు అప్పగించ లేదు. ఫిర్యాదుదారులు పదేపదే అభ్యర్థనలు చేసినా ఫ్లాట్ అప్పగింత విషయంలో డెవలపర్ నుంచి ఎలాంటి హామీ రాలేదు. దీంతో వీరంతా కలిసి టీజీ రెరాను ఆశ్రయించారు. ప్రాజెక్టులో వాగ్దానం చేసిన సౌకర్యాల నిర్మాణం కూడా చేపట్టలేదని, గదుల పరిమాణంలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ జాప్యం వల్ల తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో పెట్టుబడిగా పెట్టి భారీ ఈఎంఐలతో ఇబ్బందులు పడుతున్నామని, మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులకు కారణమైందని ఆరోపించారు.
తమకు తమ ఫ్లాట్లను తక్షణం అప్పగించేలా ఆదేశాలివ్వడంతో పాటు గడువు ముగిసిన కాలానికి జరిమానాతో వడ్డీ చెల్లించేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. ఒప్పందం ప్రకారం తమకు ఇండ్లు నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే ఫిర్యాదుదారులు చట్ట ప్రకారంగానీ, వాస్తవాల ప్రకారంగానీ ఇది విచారణకు అర్హమైనది కాదని, దీనిని కొట్టివేయాలని వాసవి సంస్థ వాదించింది. ఫిర్యాదును దాఖలు చేయడానికి ముందు ఎటువంటి ముందస్తు చట్టపరమైన నోటీసు జారీ చేయలేదని పేర్కొన్నది. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు చేపట్టామని నివేదించింది. ఒప్పందంలోని క్లాజ్ 7 ప్రకారం ఫోర్స్ మేజర్ పరిస్థితుల వల్ల కలిగే ఆలస్యం మేరకు పూర్తి చేసే కాలం పొడిగింపు అవుతుందని వాదించారు. ఈ కాలంలో కేటాయింపుదారుడు పరిహారం క్లెయిమ్ చేయడానికి అర్హులు కారని వాదనలు వినిపించింది.
వడ్డీతో చెల్లించాల్సిందే
ఫిర్యాదుదారులు, వాసవి సంస్థ వాదనలను రెరా రికార్డు చేసింది. అయితే డెవలపర్ అభ్యంతరాలను రిజెక్ట్ చేయడం గమనార్హం. రెరా అమ్మకపు ఒప్పందంలోని వివాద పరిష్కార నిబంధన ఉన్నప్పటికీ, ఫిర్యాదు చెల్లుబాటు అవుతుందని పేర్కొంటూ డెవలపర్ ప్రాథమిక అభ్యంతరాన్ని తిరస్కరించింది. కరోనా తగ్గిన తర్వాత ఒప్పందం కుదిరినందున కొవిడ్-19 మహమ్మారిని ఫోర్స్ మేజర్ (అనివార్య కారణం)గా డెవలపర్ పేర్కొనడం సరైంది కాదన్నది. ప్రకటించిన తేదీ 2024 జూన్ 26 నాటికి ఫ్లాట్లను అప్పగించడంలో విఫలమైందని, అందుకు వాసవిదే బాధ్యత అని రెరా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కస్టమర్లు చెల్లించిన అసలు మొత్తాలపై 2024 జూన్ 27 నుంచి ఫ్లాట్లను అప్పగించే వరకు ఏడాదికి 10.70% వడ్డీకి అర్హులని రెరా తెలిపింది. ఈ ఉత్తర్వు తేదీ వరకు పేరుకుపోయిన బకాయిలను రెండు నెలల్లోపు ఫిర్యాదుదారులకు చెల్లించాలని వాసవి రియల్టర్స్ ను ఆదేశించింది. ఆ తర్వాత ఫ్లాట్ స్వాధీనం చేసే వరకు తదుపరి నెల 10వ తేదీన లేదా అంతకు ముందు నెలవారీ ప్రాతిపదికన పేరుకుపోయే వడ్డీని చెల్లించాలని సూచించింది.
అలాగే ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి ఫిర్యాదుదారులకు అప్పగించాలని స్పష్టం చేసింది. కస్టమర్లు అంగీకరించిన చెల్లింపు షెడ్యూల్ ప్రకారం బ్యాలెన్స్ మొత్తాన్ని ఖచ్చితంగా చెల్లించాలని పేర్కొంది. ఒకవేళ అటువంటి షెడ్యూల్‌కు కట్టుబడి ఉండటంలో ఏదైనా డిఫాల్ట్ జరిగితే, తెలంగాణ రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి) నియమాలు, 2017లోని నియమం 15 ప్రకారం ఆలస్యమైన మొత్తాలపై వడ్డీని క్లెయిమ్ చేయడానికి స్వేచ్ఛ ఉంటుందని ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పదేపదే ఉల్లంఘనలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇకపై జాగ్రత్తగా ఉండాలని వాసవి రియల్టర్స్‌ను టీజీ రెరా హెచ్చరించింది.
కర్ణాటకలో రూ.1.08 కోట్ల జరిమానా
రియల్ ఎస్టేట్ రంగంలో చాలా కంపెనీలు కస్టమర్ల నమ్మకాన్ని కోల్పోతున్నాయి. బెంగళూరులో ఆకాశ హార్మ్యాన్ని నిర్మించేందుకు ఓ కంపెనీ ముందుకొచ్చింది. ఎన్నో హామీలు ఇచ్చి ఫ్లాట్లను అమ్మేసింది. కానీ అనుకున్న సమయానికి ఫ్లాట్లను అందించలేదు. దాంతో ఆ సంస్థపై పలువురు కస్టమర్లు ఫిర్యాదు చేయడంతో కర్నాటక రెరా ఆగ్రహం వ్యక్తం చేసింది. కంపెనీకి ఏకంగా రూ.1.08 కోట్ల పెనాల్టీ విధించింది. కొనుగోలుదారుడికి రూ.1.08 కోట్ల జరిమానాగా చెల్లించాలని బిల్డర్‌ను ఆదేశించింది.
బెంగళూరు యశ్వంత్‌పూర్‌లోని 50 అంతస్తుల ప్రెసిడెన్షియల్ టవర్‌లో ఓ కొనుగోలుదారుడు రూ.2 కోట్లకు ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేయడానికి 2014 నవంబర్ 29న గోల్డెన్ గేట్స్ ప్రాపర్టీస్ లిమిటెడ్ ఒప్పందం చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం రూ.కోటిన్నర చెల్లించారు. డెవలపర్ నవంబర్ 1, 2017 నాటికి నాలుగు నెలల గ్రేస్ పీరియడ్‌తో ఫ్లాట్ అప్పగిస్తామని హమీ ఇచ్చారు. అయితే ఒప్పందం ప్రకారం నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. ఫ్లాట్లను అప్పగించడంలో ఆ సంస్థ విఫలమైంది. ఆ ప్రాజెక్టు చాలా సంవత్సరాలు ఆలస్యం కావడంతో కొనుగోలుదారుడు రెరాకు మొరపెట్టుకున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కర్నాటక రెరా 2017 నుంచి 2024 వరకు రూ.1.08 కోట్ల వడ్డీని చెల్లించాలని డెవలపర్‌ను ఆదేశించింది. 2024 నుంచి ఫ్లాట్ స్వాధీనం చేసేవరకు ఉన్న కాలానికి కూడా వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది.






