- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీసీసీ పీఠం ఎవరికో..?
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పీఠం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠతగా మారింది. డీసీసీ పగ్గాల కోసం నేతల మధ్య

దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పీఠం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠతగా మారింది. డీసీసీ పగ్గాల కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎంపికపై పార్టీ ఆధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నది. గతంలో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డ వారు సైతం డీసీసీ బరిలో ఉన్నారు. అయితే ఎంపిక కోసం పరిశీలకులను నియమించగా.. కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపిస్తుంది? అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఈసారి కొత్త వారినే డీసీసీ పీఠంపై కూర్చోబెట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.
పార్టీ విధేయులకే అవకాశం..
సుధీర్ఘ కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2003 తర్వాత జిల్లాలో పుంజుకుంది. ప్రస్తుతం పార్టీ బలం, ఓట్ల శాతం పెరగడంతో పార్టీ బలోపేతానికి కృషిచేసిన విధేయులకే డీసీసీ పదవి ఇవ్వాలన్న సంకల్పంలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ రంగారెడ్డి జిల్లాకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, కోమటిరెడ్డి వినయ్ రెడ్డి, ఒదేబుల్ల కొత్వాల్, విజయారెడ్డిని పరిశీలకులుగా నియమించారు. అయితే డీసీసీ ఎంపికలో పార్టీలో సీనియారిటీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో పనితీరు, సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా ఎన్నికల్లో సత్తా చాటేలా.. బాధ్యతతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వారినే ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. నేతలను సమన్వయం చేసే సమర్థత ఉందా? వంటి అంశాలను కూడా పరిశీలన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే సామాజిక వర్గంతోపాటు నేతల ఆర్థిక బలాబలాలు తదితర విషయాలను సైతం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది.
పగ్గాల కోసం పోటాపోటీ..
రాష్ట్ర రాజకీయాల్లోనే రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ నగరంలో భాగంగా ఉన్న రంగారెడ్డి జిల్లాకు డీసీసీగా ఉంటే రెండు జిల్లాల్లోనూ చక్రం తిప్పే అవకాశం ఉండడంతో రంగారెడ్డి జిల్లా డీసీసీ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. అయితే నూతనంగా పార్టీలో చేరిన వారి కంటే మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వారికే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ మొదటి నుంచీ చెబుతూ వస్తుండడంతో డీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్న కొంతమంది నేతల ఆశలు సన్నగిల్లాయి. ఇక బరిలో నిలిచిన వారు స్థానిక ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలతో ఎవరికి వారుగా తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆర్సీపురానికి చెందిన సీనియర్ నేత దేప భాస్కర్ రెడ్డి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మారెడ్డి డీసీసీ పగ్గాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి భీం భరత్‌తోపాటు, ఎల్బీనగర్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ భర్త ముద్దగోని రాంమోహన్ గౌడ్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. షాద్ నగర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కూడా డీసీసీ బరిలో ఉన్నారన్న ప్రచారం సైతం జరుగుతున్నది. గత ప్రభుత్వ హయాంలో బీఆర్‌ఎస్ పార్టీ ఒత్తిళ్లు, వేధింపులు తట్టుకుని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశామని, పార్టీ లైన్ కు కట్టుబడి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేశామని ఎవరికి వారుగా అధిష్టానం వద్ద తమ వాదనలు విన్పిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు ఆశావహులు పరిశీలకులకు దరఖాస్తులను సమర్పించారు.
కొత్తవారికే అవకాశం!
ఈ సారి రంగారెడ్డి జిల్లా డీసీసీ మార్పు తప్పదని, కొత్తవారికే అవకాశం ఉంటుందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతున్నది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా చల్లా నర్సింహ్మా రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఈయనను టీయూఎఫ్‌ఐడీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది. చల్లా నర్సింహ్మారెడ్డి వరుసగా రెండోసారి డీసీసీగా కొనసాగుతున్నారు. జిల్లాపై ఈయన పెద్దగా దృష్టి పెట్టడంలేదన్న టాక్ ఉండడంతోపాటు ఎలాగూ.. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదివిలో కొనసాగుతుండడంతో డీసీసీ మార్పు అనివార్యం అన్న ప్రచారం జరుగుతున్నది. కొత్త వారికే డీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా.. వికారాబాద్ జిల్లా డీసీసీగా రామ్మోహన్ రెడ్డి కొనసాగుతున్నారు. రెండు పర్యాయాలుగా ఆయన ఈ పదవిలో కొనసాగుతుండగా.. ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగానూ ఉన్నారు. ఇక్కడ కూడా డీసీసీ మార్పు ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నది. అయితే డీసీసీ పీఠం పగ్గాలు అప్పగించేందుకు చెప్పుకోదగ్గ స్థాయి నేతలు లేకపోవడంతో రామ్మోహన్ రెడ్డినే తిరిగి కొనసాగించే అవకాశాలు ఉన్నాయన్న మరో ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో నడుస్తోంది.






