- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫార్మా కంపెనీల కోసమే ఔటర్ టూ ‘రీజినల్ రింగు’కు రేడియల్ రోడ్డు!
హైదరాబాద్ మహానగరాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది.

దిశ, రంగారెడ్డి బ్యూరో : హైదరాబాద్ మహానగరాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. నగరానికి అతి సమీపంలోనున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ధృడసంకల్పంతో ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం కూడా ఇదే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భావించింది. ఫార్మాసిటీ పేరుతో వందల ఎకరాల భూమిని సేకరించింది. అయితే స్థానిక ప్రజలు ఫార్మాసిటీతో ఈ ప్రాంతమంతా విషతుల్యమవుతుందని వ్యతిరేకించడంతో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాంతంలో కొంతమేర ఫార్మాసిటీ ఏర్పాటు చేయడంతో పాటు కాలుష్యం వెదజల్లే కంపెనీలు రాకుండా ఇతర పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్టు ప్రభుత్వ పెద్దలు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వాలపై స్థానికులకు నమ్మకం లేకపోవడంతో ఇప్పటికి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నిరసనలో భాగంగానే ఔటర్ నుంచి రీజినల్ వరకు రేడియల్ రోడ్డు వేయాలనే ప్రతిపాదనను రైతులు తిరస్కరిస్తున్నారు. ఈ రహదారి వేయడంతో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు మార్గం సుగుమం అవుతుందని రైతులు భావిస్తున్నట్టు సమాచారం. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు భూ సేకరణలో నిమగ్నమయ్యారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కేంద్రంగా అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ఫోర్త్ సిటీని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది.
330 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి వెయ్యి ఎకరాలు..
రంగారెడ్డి జిల్లాలో అంతర్భాగమైన ‘ఔటర్ రింగ్’ నుంచి త్వరలో నిర్మాణం చేసే రీజినల్ రింగ్ రోడ్డు వరకు వెడల్పైన రేడియల్ రోడ్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. భవిష్యత్తులో నిర్మించే ఫోర్త్ సిటీ ప్రాంతానికి ప్రయాణం సుగుమం చేసేలా చర్యలు తీసుకుంటుంది. మీర్ ఖాన్‌పేట్ ప్రాంతాన్ని మధ్యస్థం చేసుకుని ఇరువైపుల ప్రాంతాలని రెండుగా విడగొట్టి ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. రెండు విడుతల్లో చేపట్టే భూ సేకరణలో మొత్తం విస్తీర్ణం వెయ్యి ఎకరాలు. ఫేజ్–1లో 447 ఎకరాలు మహేశ్వరం మండలం కొంగరకుర్థు రెవెన్యూ పరిధిలోని ఔటర్ రింగు రోడ్డు వండర్ లా నుంచి మీర్ఖాన్‌పేట్ వరకు భూసేకరణ జరుగుతుంది. ఈ మొదటి విడుతల్లో మహేశ్వరం మండలం కొంగరకుర్థు, ఇబ్రహీంపట్నం మండలం పిరోజ్‌గూడ, కొంగర్ కలాన్, కందుకూర్ మండలం లేముర్, తిమ్మాపూర్, రాచులూర్, గుమ్మడవెల్లి, పంజాగూడ, మీర్ఖాన్‌పేట్ గ్రామాల పరిదిలోని రెవెన్యూ భూములను ప్రభుత్వం తీసుకోనుంది. అదేవిధంగా ఫేజ్–2లో 554 ఎకరాలు మహేశ్వరం మండలం కొంగరకుర్ధు, కందుకూర్మండలం రాచూలూర్, మీర్ఖాన్‌పేట్, కుర్మిద్దే, కడ్తాల్, ముద్విన్, అమన్‌గల్లు మండలం ఆకుతోటపల్లి, అమన్‌గల్లు, చెన్నంపల్లి రెవెన్యూ పరిధిలోని భూములను సేకరించనున్నారు. ఫోర్త్ సిటీ ప్రాంతానికి ఇరువైపుల రోడ్లను అభివృద్ధి చేసి పెట్టుబడులను ప్రోత్సహించే అవకాశం ఉంది. దీంతో ఔటర్ రింగు రోడ్డు వండర్ లా నుంచి అమన్‌గల్లు మండలం చెన్నంపల్లి గ్రామం వరకు 43 కీ.మీ పోడవు 330 ఫీట్ల వెడల్పు రోడ్డు నిర్మాణానికి వెయ్యి ఎకరాల భూమిని రెండు విడుతల్లో జిల్లా రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు.
పలుచోట్ల అడ్డంకులు..
ఔటర్ టూ చెన్నంపల్లి వరకు 43 కీ.మీ పోడవుతో నిర్మించే రేడియల్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో అడ్డంకులు వస్తున్నాయి. ఈ భూసేకరణలో కొంత ప్రభుత్వ, అసైన్డ్, పట్టా భూములు ఉన్నాయి. అయితే పట్టా భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. ఫార్మాసిటీ అభివృద్ధి కోసమే రహదారులు వేస్తున్నారనే అనుమానంతో తమ పంటలన్ని విషతుల్యమవుతాయాని రైతులు భావిస్తున్నారు. తిమ్మాపూర్, ఆకుతోటపల్లి, ముద్విన్ రైతులు భూసేకరణ కోసం వెళ్లిన అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం కూడా సరియైన పద్దతిలో లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని బహిరంగా మార్కెట్‌కు విరుద్దంగా ధరలు నిర్ణయించడంపై రైతులు భగ్గుమంటున్నారు.






