- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వర్గసీమలో అనుమతుల మిస్టరీ.. నోటీసులు ఓకే.. చర్యలేవీ?
రియల్ ఎస్టేట్ లో రారాజుగా చెప్పుకుంటున్న ‘స్వర్గసీమ’ యాజమాన్యం అనుమతుల విషయంలో దాగుడు మూతలాడుతున్నది.

దిశ, రంగారెడ్డి బ్యూరో/షాద్ నగర్ : రియల్ ఎస్టేట్ లో రారాజుగా చెప్పుకుంటున్న ‘స్వర్గసీమ’ యాజమాన్యం అనుమతుల విషయంలో దాగుడు మూతలాడుతున్నది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని చెరుకుపల్లి గ్రామపంచాయతీలో ‘సుకేతన’ పేరుతో చేపడుతున్న వెంచర్ చుట్టూ భారీ ప్రహరీ నిర్మించింది. మధ్యలో సువిశాలమైన ప్రదేశంలో క్లబ్ హౌస్ పేరుతో పెద్దభవంతిని నిర్మించింది. కానీ..వీటికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. గ్రామపంచాయతీ నుంచి నోటీసులను సైతం ఇచ్చారు. అదిగో.. ఇదిగో! పర్మిషన్లు వచ్చేస్తున్నాయని కాలయాపన చేయడమే తప్ప సంబంధిత పత్రాలను మాత్రం సమర్పించడం లేదు. పేదలపై ప్రతాపం.. పెద్దలపై మౌనం అన్నట్టుగా ‘సుకేతన’ వెంచర్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించడంలో అధికారులు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అవన్నీ అక్రమ నిర్మాణాలే..
స్వర్గసీమ సాండల్ ఉడ్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 238/పీ, 263/పీ, 238/పీ, 239/పీ, 242/పీ, 243/పీ, 244/పీ, 245/పీ, 246/పీ, 249/పీ, 250/పీలోని సుమారు 40.22 ఎకరాల విస్తీర్ణంలో భారీ లే అవుట్ ను అభివృద్ధి చేస్తున్నది. అయితే గ్రామపంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ మాదిరిగా చుట్టూ భారీ ప్రహరీ నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే క్లబ్ హౌస్ సైతం నిర్మించారు. ఈ నేపథ్యంలో క్లబ్ హౌస్ నిర్మాణానికి పంచాయతీ కార్యదర్శి తొలి నోటీసును ఈ ఏడాది ఫిబ్రవరి 17న స్వర్గసీమ వెంచర్ నిర్వాహకులకు అందజేశారు. దీనికి ఎలాంటి స్పందన రాకపోవడంతో రెండోసారి గతమార్చి 2న ప్రహరీ నిర్మాణం, క్లబ్ హౌస్ లకు వేర్వేరుగా నోటీసులు ఇచ్చారు. గేటెడ్ కమ్యూనిటీ లే అవుట్ దరఖాస్తు లేకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టకూడదని, గ్రామపంచాయతీ అనుమతి లేకుండా తాత్కాలిక కార్యాలయ(క్లబ్ హౌస్) నిర్మాణం చేపట్టవద్దని అందులో పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 114 ప్రకారం.. ఈ నోటీసు అందుకున్న వెంటనే ఆయా నిర్మాణాలను తొలగించుకోవాలని నోటీసులో సూచించారు. అనుమతులకు సంబంధించి ఏమైనా పత్రాలు ఉంటే ఏడురోజుల లోపు సమర్పించాలని సూచించారు. లేనిపక్షంలో పీఆర్ యాక్ట్ 14(1) (8), సెక్షన్ 113 ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు.
నోటీసులకు బేఖాతర్
రెండు విడతలుగా జారీచేసిన నోటీసులను బేఖాతర్ చేస్తూ స్వర్గసీమ వెంచర్ యాజమాన్యం ప్రహరీ, క్లబ్ హౌస్ ల నిర్మాణ పనులను పూర్తిచేసింది. అంతా పూర్తయ్యాక గత మార్చి 16న స్వర్గసీమ సాండల్ ఉడ్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ప్రతినిధి ఒకరు చెరుకుపల్లి పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నోటీసుకు సంజాయిషీ ఇచ్చారు. ప్లాట్స్క్రయవిక్రయాల కోసం తాత్కాలికంగా ఆఫీసును నిర్మించుకున్నామని, ఆ స్థలాన్ని సర్వే చేయించి అనుమతుల కోసం అప్లయ్ చేసినట్టు అందులో పేర్కొన్నారు. అనుమతులకు సంబంధించిన సర్టిఫికెట్ రావడానికి 45 రోజుల సమయం పడుతుందని, అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈ సందర్భంగా కోరారు. అయితే ప్రహరీ నిర్మాణానికి సంబంధించి మాత్రం ఎలాంటి సంజాయిషీ ఇవ్వలేదు. స్వర్గసీమ సుకేతన యాజమాన్యం కోరిన గడువు సైతం ముగిసింది. కానీ.. ఇప్పటివరకు సదరు యాజమాన్యం పంచాయతీకి ఎలాంటి పత్రాలను సమర్పించలేదు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు వెనుకంజ చేస్తున్నారన్న విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
ఉన్నతాధికారులకు నివేదిస్తా..
చెరుకుపల్లి గ్రామంలో ‘స్వర్గసీమ’ శాండిల్ ఉడ్ వర్క్ఆధ్వర్యంలో నడుస్తున్న సుకేతన వెంచర్ లో ప్రహరీ గోడ, క్లబ్ హౌస్ ల నిర్మాణాలకు అనుమతులు లేకపోవడంతో నోటీసులు ఇచ్చాం. వారు కోరిన గడువు తర్వాత కూడా అనుమతి పత్రాలు సమర్పించలేదు. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ ప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం.
- అశోక్, పంచాయతీ కార్యదర్శి, చెరుకుపల్లి, కొందుర్గు మండలం






