సీఎం సభలో నిరసన సెగ!

by Taduka Kalyani |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆరుట్లలో నిర్వహించిన బహిరంగ సభలో తీవ్ర కలకలం రేగింది.

సీఎం సభలో నిరసన సెగ!
X

దిశ, మంచాల: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆరుట్లలో నిర్వహించిన బహిరంగ సభలో తీవ్ర కలకలం రేగింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ట్రైబల్ వెల్ఫేర్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ ఇటీవలే బలవన్మరణానికి పాల్పడిన శ్రీధర్ బాబు కుటుంబ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. శ్రీధర్ బాబు ఫొటోలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ, తమకు న్యాయం చేయాలంటూ వారు సభామధ్యలో నిరసన వ్యక్తం చేశారు. సీఎం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించిన బాధితులను భద్రతా సిబ్బంది, పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.

అధికారుల ఒత్తిడే కారణం: భార్య ఆవేదన

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు భార్య మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల తీవ్ర వేధింపులు, ఒత్తిడి తట్టుకోలేకనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని కన్నీరుమున్నీరయ్యారు. ఒక నిజాయితీ గల ఉద్యోగిని మానసికంగా వేధించి ప్రాణాలు తీసుకునేలా చేసిన అధికారులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. "నా భర్త మరణానికి కారణమైన అధికారులను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించి, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, దిక్కుతోచని స్థితిలో ఉన్న మా కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలి." అని ఆమె వేడుకున్నారు.

Next Story