సీఎం సభను అడ్డుకుంటామనే నెపంతో ముందస్తు అరెస్టులు..

by Kodari Anjali |

కోహెడ భూ బాధితులకు అండగా నిలిచినందుకే కాంగ్రెస్ నాయకులు అరెస్టులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

సీఎం సభను అడ్డుకుంటామనే నెపంతో ముందస్తు అరెస్టులు..
X

దిశ, తుర్కయంజాల్: కోహెడ భూ బాధిత రైతులకు మద్దతుగా నిలిచినందుకు తమపై పోలీసులు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు కంబాలపల్లి ధనరాజ్, బండారు బాలప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కోహెడలో అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్ కు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి విచ్చేస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియా గ్రూపులలో షేర్ చేయడం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోహెడ గ్రామానికి చెందిన మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులమని చూడకుండా రైతులకు మద్దతు ఇచ్చామని విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఒత్తిడితో తమను అరెస్ట్ చేయించారని ఆరోపించారు.

భయభ్రాంతులకు గురిచేసి ఉద్యమాన్ని అణచివేయాలనే..

రైతుల హక్కుల కోసం, భూ బాధితులకు న్యాయం జరగాలని కోరుతూ శాంతియుతంగా మద్దతు తెలుపుతుంటే అరెస్టులకు పాల్పడటం దురదృష్టకరమని విమర్శించారు. కోహెడలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు, వారిని ఆదుకోవాల్సింది పోయి ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేయడం సరైన విధానం కాదన్నారు. రైతుల పక్షాన నిలబడిన వారిని భయభ్రాంతులకు గురిచేసి ఉద్యమాన్ని అణచివేయాలనే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. భూ బాధిత రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ప్రజాస్వామ్య హక్కుల కోసం వెనక్కి తగ్గబోమని కంబాలపల్లి ధనరాజ్, బండారు బాలప్ప హెచ్చరించారు.

Next Story