- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇన్‌స్పెక్టర్ తీరుతో ఇబ్బంది
‘నీ ముఖం చూస్తే.. ఆ శని ముఖం చూసినట్లే ఉంటుంది. అంతా దరిద్రం.. నువ్వు నాకు కనిపించకు.. నువ్వు వేస్ట్.. ఎందుకు పనికిరావు.. నీతోని ఏం కాదు..’ ఇలా అందరి ముందు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మేడ్చల్ జోన్ లోని ఓ కీలకమైన ఠాణాకు ఇన్ స్పెక్టర్ గా ఉన్న అధికారి మాట్లాడుతున్నాడు.

దిశ , సిటీక్రైం : ‘నీ ముఖం చూస్తే.. ఆ శని ముఖం చూసినట్లే ఉంటుంది. అంతా దరిద్రం.. నువ్వు నాకు కనిపించకు.. నువ్వు వేస్ట్.. ఎందుకు పనికిరావు.. నీతోని ఏం కాదు..’ ఇలా అందరి ముందు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మేడ్చల్ జోన్ లోని ఓ కీలకమైన ఠాణాకు ఇన్ స్పెక్టర్ గా ఉన్న అధికారి మాట్లాడుతున్నాడు. దీంతో పోలీస్ కానిస్టేబుళ్లు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. ఇలాంటి కించపర్చే మాటలు పడ్డ కొందరు మనసును గాయపర్చుకొని డిప్రెషన్ లోకి వెళ్లారని పోలీస్ వర్గాలు అంటున్నాయి. ఓ కానిస్టేబుల్ మాత్రం ఏకంగా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన చేసినట్లు తెలిసి మరో అధికారి అతనిని ఓదార్చి ధైర్యం చెప్పి సాధారణ స్థితి తీసుకొచ్చాడని తెలిసింది. ఇటు రాజీవ్ రహదారికి, అటు నిజామాబాద్ హైవేకు మధ్యలో ఉన్న ఈ ఠాణా ఇన్ స్పెక్టర్ ప్రవర్తనను ఇప్పుడు పోలీసు వర్గాల్లోనే వింతగా మాట్లాడుకుంటున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, రెండో తిరుపతిగా పేరొందిన బాలాజీ దేవాలయంతో పాటు చుట్టూ చిన్న చిన్న దేవాలయాల పరిసరాలతో ఉండే ఈ ఠాణాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ఠాణాకు ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన ఏ అధికారి కూడా ఇలా సిబ్బందిని మానసికంగా హింసించేలా వ్యవహరించలేదని పోలీసు వర్గాలు చెప్పుతున్నాయి.
ఉన్నతాధికారులను సైతం డోంట్ కేర్..
తనకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు మాజీ ప్రజా ప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, తనను ఎవరు టచ్ చేయలేరనే వాదనతో కింది స్థాయి సిబ్బందిని భయాందోళనకు గురి చేసేలా వారిని అసంత్రుప్తిలోకి నెట్టుతున్నాడని సిబ్బంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారని పోలీసు వర్గాల్లో ప్రచారం ఉంది. ఎవరికి ఫిర్యాదు చేస్తారో చేసుకోండి.. ఏ ఉన్నతాధికారైనా నన్ను ఏం అడగరంటూ గాంభీర్యం ప్రదర్శిస్తుండడంతో ఈ ఠాణా ఇన్ స్పెక్టర్ పై ఫిర్యాదు చేసినా హయ్యర్ ఆఫీసర్ లు పట్టించుకోరనే ఆందోళన కిందిస్థాయి సిబ్బందిలో నెలకొంది. పోలీసు కమిషనరేట్ లో ఠాణా ఇన్ స్పెక్టర్లపై నిఘా పెట్టే విభాగం ఉన్నతాధికారి బంధువుకు ఈ ఇన్ స్పెక్టర్ క్లాస్ మేట్ కావడంతో ఇతనిపై ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా, అందినా వాటిని పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటారని తెలిసింది. దీంతో తీవ్రమైన కలవర పరిస్థితిలో ఈ ఠాణాలోని కింది స్థాయి సిబ్బంది పని చేస్తున్నట్లు సమాచారం.
అవినీతి ఆరోపణలు కూడా ఎక్కువే..
ఈ ఠాణా ఇన్ స్పెక్టర్ పై సొంత సిబ్బందే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి కూడా ఎక్కువేనని చెబుతుంటారు. దీని కోసం తనకు నచ్చిన అధికారులను పెట్టుకొని తతంగాన్ని నడిపిస్తుంటాడని ఆ ఠాణాలో పని చేసే వారే విమర్శిస్తున్నారు. అతని అవినీతితో మాకు సంబంధం లేదు.. కానీ మమ్మల్ని కించపర్చేలా మాట్లాతుండడంతో తాము అవమానభారంగా ఫీల్ అవుతున్నట్లు కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేమూ ప్రజా సేవకే వచ్చాం..
పోలీస్ అవ్వాలని కలలు కని, కష్టపడి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఈ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాం. ప్రజలకు తమ వంతుగా పోలీసుగా సేవలు అందించేందుకు ఉత్సాహంగా ఉన్నా తమను ఇలా దిగజార్చేలా ఠాణా ఇన్ స్పెక్టర్ మాట్లాడడం తో తాము ఎందుకు ఈ ఉద్యోగంలోకివచ్చామని బాధపడుతున్నట్లు పోలీస్ తమ్ముళ్లు మదన పడుతున్నారు. ఈ వ్యవహారం ఇలానే కొనసాగితే తామే తెగించి పోలీస్ శాఖ క్రమశిక్షణను పక్కన పెట్టి నిరసనకు దిగుతామని కిందిస్థాయి అంటున్నారు.






