- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పర్మిషన్ ఐదు అంతస్తులు.. కట్టింది ఏడు! మణికొండలో బిల్డర్ దౌర్జన్యం!
నగర శివారు ప్రాంతంలోని అత్యంత విలువైన మణికొండలోని పంచవటి కాలనీలో జరుగుతున్న నిర్మాణం వివాదాస్పదంగా మారింది.

దిశ, గండిపేట : నగర శివారు ప్రాంతంలోని అత్యంత విలువైన మణికొండలోని పంచవటి కాలనీలో జరుగుతున్న నిర్మాణం వివాదాస్పదంగా మారింది. మణికొండ జాగీర్ సర్వేనెంబర్ 70 లో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ సినీ హీరోకు సంబంధించి సుమారు రెండు వేల గజాల స్థలాన్ని స్థానికంగా పేరు ప్రతిష్టలు ఉన్న ఓ బిల్డర్ డెవలప్మెంట్‌కు తీసుకున్నారు. అంతా నేను చూసుకుంటానులే అంటూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. బిల్డర్ స్టిల్ట్ ప్లస్ 5 అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతులు తీసుకున్నప్పటికీ, ప్రస్తుతం అదనంగా దర్జాగా మరో రెండు అంతస్తులు నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక నిర్మాణ స్థలానికి సమీపంలోనే బుల్కాపూర్ నాలా ఉంది. ల్యాండ్ యూసేజ్ సర్టిఫికెట్ సూచించిన విధంగా కాకుండా బిల్డర్ తన ఇష్టారాజ్యంగా నిర్మాణం చేపట్టారు. అంతేకాకుండా సెట్‌బ్యాక్స్ కూడా పాటించకుండా నిర్మాణం కొనసాగుతోందని చెబుతున్నారు. ఏమాత్రం సెట్ బ్యాక్స్ రూల్స్ పాటించకపోవడంతో భవిష్యత్తులో ఏమైనా అగ్ని ప్రమాదాలు జరిగితే నివాసితుల ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. ఈ అక్రమ నిర్మాణంపై ఇప్పటికే హైడ్రా, ఇరిగేషన్ శాఖతో పాటు పలు ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ నిర్మాణానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేయొద్దని మున్సిపల్ అధికారులు లేఖ రాసినట్లు తెలియజేశారు. అయినప్పటికీ బిల్డర్ మాత్రం అలాంటి ఆంక్షలను పట్టించుకోకుండా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని కాలనీ వాసులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మణికొండ పంచవటి కాలనీలో బిల్డర్ ఇష్టారాజ్యం నడుస్తోందని, అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులుగా నిర్మాణం జరుగుతున్నప్పటికీ అధికారులతో పాటు కొందరు నాయకులు అందిన కాడికి జేబులు నింపుకొని మౌన వ్రతం పాటిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సుమారు ఫ్లాట్ల నిర్మాణం..
స్టిల్ట్ ప్లస్ 5 అంతస్తుల నిర్మాణానికి పర్మిషన్ తీసుకున్న బిల్డర్ రెండు బ్లాకులుగా నిర్మాణం చేపట్టాడు. దర్జాగా ఎవరిని లెక్కచేయకుండా మరో రెండు అంతస్తులు అదనంగా నిర్మాణం చేపట్టడం గమనార్హం. ఈ నిర్మాణంలో మొత్తం 90 ఫ్లాట్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. మొదటి నుంచి కూడా బిల్డర్ తన పలుకుబడితో రాజకీయ అండదండలతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న అడిగే నాథుడు లేకుండా పోయారని అంటున్నారు. సుమారు ఏడాది రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ నిర్మాణం విషయం మణికొండ పూర్వపు మున్సిపల్ అధికారులకు, ప్రస్తుతం నార్సింగి సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగానికి అంతా తెలిసినా కూడా అన్ని రకాలుగా బిల్డర్ కు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. గత కొంత కాలం క్రితం ఇక్కడ పనిచేసిన టౌన్ ప్లానింగ్ అధికారి ఒకరు పూర్తిగా సపోర్ట్ చేసినట్లు విమర్శలు ఉన్నాయి. దీంతోపాటు బిల్డర్ తనకు ఎవరూ అడ్డు రావొద్దని కొందరు రాజకీయ నాయకులకు కూడా భారీగా ముడుపులు ముట్ట చెప్పినట్లు స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. అధికారులతో పాటు నేతలకు అమ్యామ్యాలు సమర్పించడంతో తాను ఏం చేసినా చెల్లుతుందని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా నిర్మాణంలో నిబంధనలకు నీళ్లు వదిలి నిర్మాణం చేపట్టడంతో అందులో నివాసముండే వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.
చర్యలు తీసుకోవాలని లేఖలు రాశాం - టౌన్ ప్లానింగ్ అధికారులు
నిబంధనలకు విరుద్ధంగా రెండు అదనపు అంతస్తులు నిర్మాణం చేపట్టిన బిల్డర్‌తో పాటు నిర్మాణంపై వెంటనే సత్వర చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులకు లేఖలు రాసినట్లు నార్సింగి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు తెలియజేశారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సబ్ రిజిస్టర్ కు లెటర్ రాసినట్లు వివరించారు. అక్రమ నిర్మాణం విషయంలో ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.






