ఒకే ఫోన్ నంబర్‌పై 700కు పైగా ఓటర్లు!

by Taduka Kalyani |

మణికొండ డివిజన్ ఓటరు జాబితాలో ఒకే మొబైల్ నంబర్‌కు 700కు పైగా ఓటర్లు నమోదైనట్లు గుర్తించామని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నార్సింగి సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.

ఒకే ఫోన్ నంబర్‌పై 700కు పైగా ఓటర్లు!
X

దిశ, గండిపేట: మణికొండ డివిజన్ ఓటరు జాబితాలో ఒకే మొబైల్ నంబర్‌కు 700కు పైగా ఓటర్లు నమోదైనట్లు గుర్తించామని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నార్సింగి సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. టీపీసీసీ స్టేట్ కో ఆర్డినేటర్ (మీడియా & కమ్యూనికేషన్స్) వాసిరెడ్డి నరేష్ ఈమేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎన్నికల జాబితా పరిశీలనలో ఒకే మొబైల్ నంబర్‌కు 700కు పైగా ఓటర్లు అనుసంధానమై ఉన్నట్లు తాము గుర్తించినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో ఆ మొబైల్ నంబర్ ఓ పార్టీకి చెందిన జిల్లా స్థాయి నాయకుడిదిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. సంబంధిత ఓటర్ల వివరాలు, WPK నంబర్లతో పాటు పూర్తి సమాచారాన్ని అధికారులకు అందజేసినట్లు వెల్లడించారు. ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంటనే స్పందించి, సంబంధిత అధికారులతో విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను వెలికి తీయాలని, ఎన్నికల జాబితా పారదర్శకతను కాపాడేందుకు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

స్పందించని డిప్యూటీ కమిషనర్

కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదు పై వివరణ కోరేందుకు డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డికి పలుమార్లు కాల్ చేయగా ఆయన ఎప్పటి మాదిరిగానే సమాధానం ఇవ్వలేదు. ప్రతిరోజు వందలాదిమంది పలు సమస్యలపై డిప్యూటీ కమిషనర్ కు ఫోన్ చేయగా ఆయన ఏమాత్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా డిసి లక్ష్మారెడ్డి తన తీరు మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు.

Next Story