ముక్కిపోయిన పట్టుబడ్డ రేషన్.. నెలలు గడుస్తున్నా వేలం వేయని అధికారులు

by Ajay Maddhiboyina |

పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడ్డుతున్నాయి. బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పలు చోట్ల పోలీసులకు పట్టుబడ్డాయి. స్వాధీనం చేసుకున్న ఆ బియ్యం ఏళ్లతరబడి గోదాంలోనే మక్కిపోయి పాడైపోతున్నాయి.

ముక్కిపోయిన పట్టుబడ్డ రేషన్.. నెలలు గడుస్తున్నా వేలం వేయని అధికారులు
X

దిశ, ఇబ్రహీంపట్నం : పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడ్డుతున్నాయి. బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పలు చోట్ల పోలీసులకు పట్టుబడ్డాయి. స్వాధీనం చేసుకున్న ఆ బియ్యం ఏళ్లతరబడి గోదాంలోనే మక్కిపోయి పాడైపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొందరు రేషన్ డీలర్లు అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పోలీసులు తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని గోదాంలో నిల్వ చేశారు. నిబంధనల ప్రకారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు వాటిని వెంటనే వేలం వేసి విక్రయించాలి. వచ్చిన సొమ్మును కోర్టులో డిపాజిట్ చేయాలి. కానీ అధికారులు వేలం ప్రక్రియ చేపట్టకపోవడంతో కొన్ని సంవత్సరాలుగా బియ్యం గోదాంలోనే ఉన్నాయి. బియ్యానికి సరైన రక్షణ లేకపోవడంతో ఎలుకలు కొట్టి తినడానికి పనికిరాకుండా బియ్యం పూర్తిగా మక్కిపోయి, పాడైపోయ్యాయి. దీంతో లక్షల విలువైన ప్రభుత్వ సొమ్ము వృథా అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు, స్వాధీనం చేసుకున్న సరుకును సకాలంలో వేలం వేయడంలోనూ అధికారులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే ప్రభుత్వ ఆశయం నెరవేరదని, పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారం రోజులలో వేలం ప్రక్రియ..

ఈ విషయంపై జిల్లా పౌరసరఫరాల అధికారిని వివరణ కోసం సంప్రదించగా.. పట్టుబడిన రేషన్ బియ్యంపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నందున వేలం ఆలస్యం అయింది. వారం రోజులలో వేలం ప్రక్రియ మొదలుపెడతాం అని తెలిపారు. అయితే నిబంధనల ప్రకారం కేసు తేలే వరకు ఆగాల్సిన అవసరం లేదని, వెంటనే వేలం వేయవచ్చని పౌరసరఫరాల శాఖ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.

గోదాంలోని రేషన్ బియ్యాన్ని వెంటనే వేలం వేయాలి..

- సోప్పరి కరుణాకర్, బీఆర్ఎస్ నాయకుడు

పేద ప్రజలకు చెందాల్సిన రేషన్ బియ్యం గోదాంలలో మక్కిపోయి, పాడైపోతున్నాయి. ఇటు పేదలకు చెండాకుండా, అటు ప్రభుత్వం సొమ్ము వృథా అవుతుంది. పేదవాడి నోటికాడి బువ్వను దొంగలు దోచుకుంటున్నారు. పట్టుకున్నా పట్టించుకోకపోతే ఎలా..? బియ్యం మక్కిపోతు, పాడైపోతుంటే చూడలేకపోతున్నాం. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గోదాంలో నిల్వ ఉన్న బియ్యాన్ని వేలం వేయాలి.

Next Story