నో ఎంట్రీకి.. నో చలాన్.. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న భారీ వాహనాలు

by Chintha Aamani |

గండిపేట మండల పరిధిలోని నార్సింగి, కోకాపేట, మై హోమ్ అవతార్ జంక్షన్, ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది.

నో ఎంట్రీకి.. నో చలాన్..  నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న భారీ వాహనాలు
X

దిశ, రాజేంద్రనగర్ : గండిపేట మండల పరిధిలోని నార్సింగి, కోకాపేట, మై హోమ్ అవతార్ జంక్షన్, ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. రోజురోజుకు భారీ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిరోజు పెద్ద స్థాయిలో సిమెంట్ ట్యాంకర్లు, మట్టి, కంకర, డస్ట్ తదితర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా సమయపాలన పాటించకుండా వాహనాలు అడ్డగోలుగా తిరుగుతున్నాయి. రూల్స్ ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు రోడ్లపైకి భారీ వాహనాలు రావద్దు. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తిరగవద్దు. మిగతా సమయాల్లో వాహనాలు రాకపోకలు సాగించవచ్చు. అయితే నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ వాహనాలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. కొన్ని టిప్పర్లు మట్టిని తరలిస్తూ వాటిపై కవర్లు కూడా వేయకుండా అడ్డగోలుగా నడుస్తున్నాయి. మరికొన్ని టిప్పర్లలో పరిమితికి మించి ఓవర్ లోడ్ తో రాళ్లు, మట్టి తరలిస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

అంతా అడ్డగోలుగా..

ట్రాఫిక్ ఉన్నతాధికారులు సూచించిన ప్రకారం వాహనదారులు నడుచుకోవాలి. ఇతర సమయాల్లో రహదారుల పైకి వస్తే ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత వాహనాల ఫోటోలు తీస్తూ వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ జరిమానాలు విధించాలి. అయితే నార్సింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలా జరగడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోంగార్డులు తీసిన ఫోటోలను పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది అప్లోడ్ చేయడం లేదని తెలుస్తోంది. తద్వారా పోలీసు శాఖకు భారీ మొత్తంలో గండిపడుతోంది. పోలీసు అధికారుల ఆదేశాల మేరకు అప్లోడ్ చేయవలసిన సిబ్బంది మిన్నకుండి పోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

భారీ నిర్మాణదారులతో దోస్తీ..??

ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయా ప్రాంతాల్లో నిర్మిస్తున్న భారీ కన్స్ట్రక్షన్ యజమానులతో ములాఖత్ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తద్వారా వారు భారీ మొత్తంలో స్వప్రయోజనం పొందుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాణదారులకు త్వర త్వరగా పనులు కావాలి. నిర్దేశిత సమయాల్లో కాకుండా వాహనాలను మిగతా సమయాల్లోనూ అనుమతించాలి. ఇందుకు అనుగుణంగా నిర్మాణదారులు ట్రాఫిక్ అధికారులతో దోస్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాహనాలు బగర్ టైం లో తిరుగుతున్న కూడా వాటికి జరిమానాలు విధించడం లేదని తెలుస్తుంది. తాము ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనాలకు సంబంధించి ప్రతిరోజు వందలాది ఫోటోలు తీసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అప్ప చెబుతున్నా సంబంధిత వాహనాలకు చలాన్లు వేయడం లేదని క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అడిగితే ఉన్నతాధికారులు తమపై చిర్రుబుర్రులాడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా ట్రాఫిక్ ఉన్నతాధికారులు మేల్కొని పోలీసు శాఖకు గండిపడకుండా.. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వాహనాలకు భారీ మొత్తంలో జరిమానాలు విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అలాంటిదేమీ లేదు..

సమయపాలన పాటించకుండా అడ్డగోలుగా తిరుగుతున్న వాహనాలకు చలాన్లు విధించడం లేదనే విషయమై నార్సింగి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డిని వివరణ కోరగా.. అలాంటిదేమీ లేదని తెలిపారు. తాము నిబంధనల ప్రకారం విధులు నిర్వహిస్తున్నామన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనాలకు విధిగా చలాన్లు విధిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Next Story