స్కూల్‌ గేటుకు ‘నో అడ్మిషన్‌’ బోర్డు

by velandi.Saikiran |   (  Updated:2026-06-11 23:00:40  IST  )

మంచాల మండలంలోని ఆరుట్ల ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవానికి ముందే విశేష ఆదరణను చూరగొంటున్నది.

స్కూల్‌ గేటుకు ‘నో అడ్మిషన్‌’ బోర్డు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో/మంచాల : తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌‌గా మార్చేందుకు రాష్ట్రంలోనే తొలి పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవానికి ముందే విశేష ఆదరణను చూరగొంటున్నది. సర్కారు స్కూళ్ల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఇక్కడి పాఠశాలలో అమలవుతున్న కార్యక్రమాలకు ఫిదా అవుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు అమితాసక్తిని చూపిస్తున్నారు. క్రీడా నైపుణ్యంతో పాటు విద్యా బోధనలో నాణ్యతను పెంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సదుపాయాలు, ఫర్నిచర్‌ తదితర వాటికి ఇప్పటి వరకు రూ.10 కోట్ల వరకు వెచ్చించారు. గతంలో ఇక్కడి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉండగా.. గత యేడాది కాలంగా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. పబ్లిక్‌ స్కూల్‌ గురించి ఇక్కడి ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం నిర్వహించడం కూడా కొంత కలిసొచ్చింది. స్కూల్‌‌లో 1600 మంది విద్యార్థులను చేర్పించుకునేందుకు అవకాశం ఉండగా.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్‌‌ను దృష్టిలో పెట్టుకుని 1700 మంది విద్యార్థులను చేర్చుకున్నారు. పాఠశాలలో ప్రవేశం కొరకు విద్యార్థులు పోటెత్తుతుండడంతో పాఠశాల బోర్డుకు ‘నో అడ్మిషన్‌’ బోర్డును ఏర్పాటు చేయక తప్పలేదని పాఠశాల హెచ్‌‌ఎం గిరిధర్‌ తెలిపారు.

ఇంటర్నేషనల్‌ స్కూళ్లకు తీసిపోని రీతిలో..

ఇంటర్నేషనల్‌ స్కూళ్లకు ధీటుగా ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్‌ పాఠశాల(టీపీఎస్)ను తీర్చిదిద్దారు. ఒకే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక, బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, మోడల్‌ స్కూల్‌ ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మితమవుతున్నాయి. నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు ఒకే ప్రాంగణంలో.. అదీ ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు. ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం బస్సులను సైతం నడుపుతున్నారు. ఆర్కిటెక్ట్‍ డిజైన్లు, స్కూల్‌ భవనాలు, సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఫుట్‌ బాల్‌, క్రికెట్‌ మైదానాలు, ఆట వస్తువులు ఇలా.. ఐదు ఎకరాల స్థలంలో అనేక పనులు పూర్తికావడంతో ఇది ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను తలపిస్తోంది. డిజిటల్‌ క్లాస్‌లను నిర్వహిస్తున్నారు. ప్రతి తరగతిని రెండు సెక్షన్లుగా విభజించి 61 మంది టీచర్లతో బోధనను సాగిస్తున్నారు. ఉదయం, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ను విద్యార్థులకు అందిస్తున్నారు. నిర్మాణాలు, ఫర్నీచర్‌ కోసం ఇప్పటి వరకు సుమారు రూ.10 కోట్ల నిధులను వెచ్చించారు. తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌‌పై పెరిగిన నమ్మకంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థుల తాకిడి పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ పిల్లలను తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌‌లోనే చదివిస్తున్నారు.

Next Story