శంకర్‌‌పల్లి మున్సిపల్‌ పరిధిలో కబ్జా కాండ

by velandi.Saikiran |   (  Updated:2026-06-11 23:30:14  IST  )

గొల్లవాగుకు సంబంధించిన బఫర్‌ జోన్‌‌లోనే అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని గతంలోనే అధికారులు నిర్ధారించారు.

శంకర్‌‌పల్లి మున్సిపల్‌ పరిధిలో కబ్జా కాండ
X

దిశ, రంగారెడ్డి బ్యూరో/శంకర్‌‌పల్లి : శంకర్‌‌పల్లి మున్సిపాలిటీలో కబ్జాల పర్వం సాగుతోంది. వాగులు, వంకలు.. ట్రిపుల్‌ వన్‌ జీవో.. ఇలా కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా కబ్జారాయుళ్లు ఏదీ వదలడం లేదు. ప్రస్తుతం గొల్లవాగు బఫర్‌ జోన్‌‌లో అధికార పార్టీ లీడర్‌ ఒకరు అక్రమ నిర్మాణాన్ని చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది. అక్రమమంటూ గతంలో పనులు నిలిపివేసిన అధికారులు నేడు.. అటు వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. పేదల ఆక్రమణలపై ఝులుం ప్రదర్శించే అధికారులు పెద్దల విషయానికొస్తే ద్వంద్వ వైఖరీని అవలంభిస్తున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి గొల్లవాగు ఆక్రమణలను అడ్డుకోవాలని స్థానిక ప్రజానీకం కోరుతోంది.

బఫర్‌ జోన్‌‌లోనే నిర్మాణం..

గొల్లవాగుకు సంబంధించిన బఫర్‌ జోన్‌‌లోనే అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని గతంలోనే అధికారులు నిర్ధారించారు. గతంలో ఇదే స్థలంలో బోరు వేస్తే.. ఆ స్థలం బఫర్‌ జోన్‌ పరిధికి వస్తుందని అధికారులు నిర్మాణాలను నిలిపివేశారు. అక్కడ బోర్డు సైతం ఏర్పాటు చేశారు. ఇరిగేషన్‌ శాఖ సైతం క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్మాణం బఫర్‌ జోన్‌‌లో ఉందని నిర్ధారించింది. తగు చర్యల నిమిత్తం రెవెన్యూ శాఖకు సిఫారసు చేస్తూ లేఖను సైతం ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ..అదే స్థలంలో చేపట్టిన అక్రమ కట్టడాలను అడ్డుకోకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడైనా చిన్నపాటి అక్రమ నిర్మాణం జరిగితే హడావుడి చేసే అధికార యంత్రాంగం.. గొల్లవాగు కబ్జా విషయంలో మాత్రం మౌనం వహిస్తుండడంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టింపులేని ధోరణిలో ఎందుకు ఉంటున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గొల్లవాగు ప్రాంతంలో గజం ధర రెండున్నర లక్షలు పలుకుతోంది. ఈ లెక్కన ప్రస్తుత ఆక్రమణ స్థలం రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆక్రమణలతో ఇప్పటికే గొల్లవాగు ఉనికిని కోల్పోతోంది. ఈ ఆక్రమణల పర్వం ఇంకా కొనసాగుతుండడంతో రానున్న రోజుల్లో వాగు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని స్థానికులు కోరుతున్నారు.

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి..

- వాసుదేవ్‌, స్థానికుడు

శంకర్పల్లి మున్సిపల్‌ పరిధిలోని గొల్లవాగు బఫర్‌ జోన్‌ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణాలపై సమగ్ర విచారణ జరపాలి. అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

Next Story