కొందుర్గులో ‘నెక్ట్స్‌ జెన్‌’ రియల్‌ సంస్థ బరి తెగింపు.. అనుమతులు లేకున్నా ఉన్నాయంటూ దబాయింపు

by Ajay Maddhiboyina |

ప్రభుత్వ అనుమతులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా సుమారు 100 ఎకరాల్లో భారీగా వెంచర్‌ పనులు సాగుతున్నాయి.

కొందుర్గులో ‘నెక్ట్స్‌ జెన్‌’ రియల్‌ సంస్థ బరి తెగింపు.. అనుమతులు లేకున్నా ఉన్నాయంటూ దబాయింపు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో/షాద్‌ నగర్‌ : ప్రభుత్వ అనుమతులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా సుమారు 100 ఎకరాల్లో భారీగా వెంచర్‌ పనులు సాగుతున్నాయి. అందమైన బ్రోచర్లు, హోర్డింగులతో ‘సంపద నెక్ట్స్‌‌జెన్‌’ అనే రియల్‌ సంస్థ దర్జాగా ప్రచారాన్ని మొదలుపెట్టి కస్టమర్లను మోసం చేస్తోంది. ఇదేమిటని అడిగిన వారిపై రియల్‌ సంస్థ యాజమాన్యం దౌర్జన్యానికి దిగుతున్నది. అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా తీసుకునేందుకు వారు నిరాకరిస్తున్నారు. దీంతో చేసేదేమి లేక అధికారులు పోలీసులను ఆశ్రయించారు. అక్రమ వెంచర్‌‌ను తొలగించేందుకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు ఇచ్చారు. ‘సంపద’తో వెంచర్‌ నిర్వాహకులు అక్రమంగా ఆర్జించే లాభాల మాటెలా ఉన్నా ..ఇందులో ప్లాట్లు కొనుగోలు చేస్తే మాత్రం కస్టమర్లు నిండా మునగడం ఖాయమన్న ప్రచారం స్థానికంగా జరుగుతోంది. షాద్‌‌నగర్‌ నియోజకవర్గంలోని కొందుర్గు మండల కేంద్రంలో ఈ నయా దందా జోరుగా సాగుతున్నది. ఈ తరహా అక్రమాలను అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధి ఒకరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వాపస్ తీసుకునేలా పైరవీలు చేయడం విస్మయం గొలుపుతోంది.

ఇదీ వెంచర్‌ కథ..

రంగారెడ్డి జిల్లా షాద్‌‌నగర్‌ నియోజకవర్గం కొందుర్గు మండలం కేంద్రంలోని లూర్డు నగర్‌ నుంచి ఉమ్మెత్యాల్‌ వెళ్లే రహదారిలో 23/ఎ4,247ఇ, 26/ఎ, 24ఎ3, 24ఎ సర్వే నెంబర్లలో ‘సంపద నెక్ట్స్‌ జెన్‌’ అనే సంస్థ భారీ వెంచర్‌‌ను చేపడుతోంది. హెచ్‌ఎండీఏ, రెరా, డీటీసీపీ, గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా 100 ఎకరాలలో యథేచ్ఛగా వెంచర్‌ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అక్రమంగా వెలిసిన వెంచర్‌ పనులను ఆపాలంటూ పలుమార్లు కొందుర్గు పంచాయతీ సెక్రెటరీ సురేఖకు ఫిర్యాదు చేయగా.. ఆమె ఆపేందుకు ప్రయత్నించినా సదరు రియల్‌ ఎస్టేట్‌ సంస్థ యజమాన్యం స్పందించలేదు. అంతటితో ఆగలేదు సరికదా.. సంపద నెక్ట్స్‌ జెన్‌ సంస్థ డైరెక్టర్‌‌ను అంటూ ప్రతాప్‌ రెడ్డి అనే వ్యక్తి కొందుర్గు మండల ఎంపీఓ విజయ్‌ కుమార్‌‌ను పరిచయం చేసుకుని హెచ్‌ఎండీఏ లే అవుట్‌ పర్మిషన్‌ ఉందంటూ ఓ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కూడా ఇచ్చారు. ప్రతాప్‌ రెడ్డి ఇచ్చిన నెంబర్‌ పరిశీలించగా తప్పుడు సమాచారం ఇచ్చారని గ్రహించిన పంచాయతీ కార్యదర్శి సురేఖ, ఎంపీఓ విజయ్‌ కుమార్‌‌లు సంపద నెక్ట్స్‌ జెన్‌ వెంచర్‌ యాజమాన్యంతో అనుమతుల విషయమై మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు స్పందించలేదు. నోటీసు ఇచ్చేందుకు పలుమార్లు వెంచర్‌ వద్దకు వెళ్లినప్పటికీ యాజమాన్యం తిరస్కరించింది. దీంతో అక్రమ వెంచర్‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాజ్‌ కమల్‌, రవితేజ సూరి, శశాంక్‌ కొనపర్తి అనే వ్యక్తులపై పంచాయతీ కార్యదర్శి సురేఖ మంగళవారం షాద్‌ నగర్‌ ఏసీపీ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశారు. వెంచర్‌ తొలగింపు సందర్భంగా తమకు రక్షణ కల్పించాలంటూ ఆ ఫిర్యాదులో పంచాయతీ కార్యదర్శి సురేఖ పోలీసులను కోరారు.

ఓ ప్రతినిధి నానా పాట్లు..

సంపద నెక్ట్స్‌‌జెన్‌ వెంచర్‌‌కు అనుమతులు లేవని పంచాయతీ కార్యదర్శి సురేఖ షాద్‌‌నగర్‌ ఏసీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ఓ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. సదరు వ్యక్తి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి. ఆ ఫిర్యాదును వాపస్ తీసుకోవాలని అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన నానా పాట్లు పడ్డారు. వెంచర్‌ నిర్వాహకులకు, అధికారులకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో అతనిపై స్థానికంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలను అడ్డుకోవాల్సిన వారే ఇలా అండదండలు కల్పించడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

సంపద నెక్ట్స్‌ జెన్‌ యజమాన్యం స్పందించడం లేదు

-పంచాయతీ కార్యదర్శి సురేఖ

కొందుర్గు మండల కేంద్రంలో డెవలప్మెంట్‌ చేస్తున్న సంపద నెక్ట్స్‌ జెన్‌ వెంచర్‌ అనుమతులకు సంబంధించిన పత్రాలను అడిగితే యజమాన్యం ఇవ్వలేదు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్‌‌లో జరుగుతున్న పనులను ఆపాలంటూ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లినా ఎవరు తీసుకోవడం లేదు. వెంచర్‌‌ను తొలగించేందుకు బందోబస్తు కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం.

అక్రమ వెంచర్‌‌ను తొలగిస్తాం

-ఎంపీఓ విజయ్‌ కుమార్‌

కొందుర్గు మండల కేంద్రంలో అభివృద్ధి చేస్తున్న సంపద నెక్ట్స్‌ జెన్‌ వెంచర్‌‌కు ఎలాంటి అనుమతులు లేవు. హెచ్‌ఎండీఏ లే అవుట్‌ పర్మిషన్‌ ఉందంటూ మాయమాటలు చెప్పి రియల్‌ సంస్థ యజమాన్యం మభ్యపెడుతున్నది. కొందుర్గు మండలం లూర్డు నగర్‌ గ్రామానికి చెందిన ప్రతాప్‌ రెడ్డి అనే వ్యక్తి సంస్థ డైరెక్టర్‌‌ను అంటూ హెచ్‌ఎండీఏ అనుమతికి సంబంధించి ఓ తప్పుడు అనుమతి నెంబర్‌‌ ఇచ్చారు. బందోబస్తుతో వెళ్లి రెండు రోజుల్లో వెంచర్‌‌లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం.

అనుమతులు లేకుంటే బందోబస్తు కల్పిస్తాం

-ఏసీపీ లక్ష్మీనారాయణ

సంపద నెక్ట్స్‌ జెన్‌ రియల్‌ ఎస్టేట్‌ యజమాన్యం ఎలాంటి అనుమతి పత్రాలు ఇవ్వకుండా అక్రమంగా వెంచర్‌‌ను డెవలప్‌ చేస్తున్నదని కొందుర్గు పంచాయతీ సెక్రెటరీ సురేఖ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నాం. వెంచర్‌ ఏర్పాటుకు అనుమతులు లేకుంటే నిర్మాణాలను తొలగించేందుకు పోలీసు బందోబస్తు కల్పిస్తాం.

Next Story