మున్సిప‌ల్ ఎన్నిక‌లలో కొత్త టెన్ష‌న్‌..ప్రధాన పార్టీలకు రెబెల్స్ ‍బెడద!

by velandi.Saikiran |   (  Updated:2026-02-03 21:00:59  IST  )

రంగారెడ్డి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో ప్రధాన ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉప సంహరణ తర్వాత 126 వార్డులకు జరుగుతున్న ఎన్నికల బరిలో 437 మంది అభ్యర్థులు నిలిచారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌లలో కొత్త టెన్ష‌న్‌..ప్రధాన పార్టీలకు రెబెల్స్ ‍బెడద!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో ప్రధాన ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉప సంహరణ తర్వాత 126 వార్డులకు జరుగుతున్న ఎన్నికల బరిలో 437 మంది అభ్యర్థులు నిలిచారు. కొన్ని చోట్ల అనుకున్న వారికి బీ-ఫామ్స్ ‍దక్కలేదు. మరికొన్ని చోట్ల బీ-ఫామ్స్ ‍ఇచ్చినట్లు ఇచ్చి చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చారు. దీంతో టికెట్‌ దక్కని వారి నుంచి అసంతృప్తి రాగాలు విన్పిస్తున్నాయి. కొందరు బరి నుంచి తప్పుకోకుండా స్వతంత్రులుగా పోటీ చేస్తుండడంతో కొన్ని చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబెల్స్ ‍అభ్యర్థులు పక్కలో బల్లెంలా మారనున్నారు. కాంగ్రెస్ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా.. బీఆర్‌ఎస్ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీకి దూరంగా ఉంది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో కొందరు అభ్యర్థులు మంగళవారం సాయంత్రం నుంచే ప్రచారాన్ని షురూ చేశారు. ఆమనగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫామ్ అందజేత సందర్భంగా టికెట్ దక్కని వారు ఆందోళనకు దిగడంతో రసాభాస చోటుచేసుకుంది.

రెబెల్స్ ‍భయం..

నామినేషన్ల స్క్రూట్నీ అనంతరం 453 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. బుజ్జగింపుల అనంతరం నామినేషన్ల ఉప సంహరణ సందర్భంగా 178 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్-78, బీఆర్‌ఎస్-45, బీజేపీ-19, సీపిఎం-5, ఎంఐఎం-3, సీపిఐ-1, జనసేన-1, గుర్తింపు పొందిన ఇతర పార్టీలు -4, స్వతంత్రులు 22 మంది నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. అక్కడక్కడా చివరి క్షణంలో అభ్యర్థులను మార్చారు. శంకర్‌‌పల్లి మున్సిపాలిటీలో 7వ వార్డు అభ్యర్థి మధుకు కాంగ్రెస్ పార్టీ బీ-ఫాం ఇచ్చింది. ఆ తర్వాత అదే పార్టీ నుంచి బండ్లగూడెం శ్రీనివాస్‌కు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో మధు స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేస్తున్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ 13వ వార్డు విషయంలో అభ్యర్థి ఖరారు విషయంలో చివరి నిమిషం వరకు సస్పెన్స్ ‍కొనసాగింది. అధికార పార్టీ నుంచి తొలుత రమేష్‌ గౌడ్‌‌కు బీ-ఫామ్‌ ఇవ్వగా అతను నామినేషన్‌ సైతం వేశారు. అయితే అనూహ్యంగా మంగళవారం రాము గౌడ్‌ అభ్యర్థిని ఖరారు చేసి బీ-ఫాం ఇవ్వడంతో మొదట బీ-ఫామ్‌ సమర్పించిన అభ్యర్థి తన నామినేషన్‌‌ను ఉపసంహరించుకున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 6వ వార్డులో అధికార పార్టీ బీ-ఫాం ఇస్తామని చెప్పి మోసం చేసిందని జెలమోని మాధవి రవీందర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. కొంతమంది పోటీ నుంచి తప్పుకోగా.. కొందరు స్వతంత్రులుగా బరిలో ఉండడంతో వీరంతా పక్కలో బల్లెంలా మారతారేమో! అన్న భయం బరిలో ఉన్న అభ్యర్థులను వెంటాడుతోంది.

అక్కడ బీఆర్‌ఎస్ ‘నో’ పోటీ..

ఆరు మున్సిపాలిటీల పరిధిలోని 126 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా.. కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ 122 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. బీజేపీ పార్టీ 109 స్థానాల్లో పోటీ చేస్తోంది. రెండు మున్సిపాలిటీల్లోని నాలుగు కౌన్సిలర్‌ స్థానాలకు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులు లేరు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 10 వార్డుకు బీఆర్‌ఎస్ నుంచి ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. శంకర్‌‌పల్లి మున్సిపాలిటీలో 1వ వార్డుకు కూడా నామినేషన్‌ వేయలేదు. ఇదే మున్సిపాలిటీలోని 8వ వార్డుకు దీపిక అనే అభ్యర్థి, 12వ వార్డుకు దండు సంతోష్‌ అనే అభ్యర్థి నామినేషన్లు వేసినప్పటికీ మంగళవారం వీరిద్దరూ అనూహ్యంగా తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. దీంతో మొత్తం నాలుగు స్థానాల్లో బీఆర్‌ఎస్ పార్టీ పోటీకి దూరంగా ఉంది.

రంగారెడ్డి జిల్లాలో పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు..

మున్సిపాలిటీ వార్డులు బీఎస్పీ బీజేపీ సీపీఎం కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్‌ఎస్ ఆల్‌‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌ సీపీఐ జనసేన ఇతర పార్టీలు స్వతంత్ర మొత్తం

ఆమన్‌‌గల్‌ 15 0 15 0 15 0 15 0 0 4 2 3 54

చేవెళ్ల 18 0 18 0 18 0 18 0 2 0 1 2 59

ఇబ్రహీంపట్నం 24 2 20 1 24 0 23 0 0 3 0 10 83

మొయినాబాద్‌ 26 0 23 0 26 0 26 1 0 0 0 16 92

షాద్‌‌నగర్‌ 28 1 19 1 28 1 28 1 0 0 0 13 92

శంకర్‌‌పల్లి 15 0 14 0 15 0 12 0 0 2 1 13 57

మొత్తం 126 3 109 2 126 1 122 2 2 9 4 57 437

Next Story