అభివృద్ధి పేరిట ప్రకృతి అందాలు కనుమరుగు.. యథేచ్ఛగా గుట్టలు ధ్వంసం!

by Kema Shiva Kumar |

అభివృద్ధి పనుల పేరుతో సహజసుందరమైన గుట్టలను అక్రమార్కులు తవ్వుకుంటూ పర్యావరణాన్ని కీడు తలపెడుతున్నారు.

అభివృద్ధి పేరిట ప్రకృతి అందాలు కనుమరుగు.. యథేచ్ఛగా గుట్టలు ధ్వంసం!
X

దిశ, బషీరాబాద్: అభివృద్ధి పనుల పేరుతో సహజసుందరమైన గుట్టలను అక్రమార్కులు తవ్వుకుంటూ పర్యావరణాన్ని కీడు తలపెడుతున్నారు. బషీరాబాద్ మండల పరిధిలోని మైల్వార్ గ్రామంలో సహజ సుందరమైన అడవి గుట్టల నుండి అక్రమంగా మొరం మట్టి తవ్వుకొని ప్రకృతి అందాలను భారీ యంత్రాలతో చరిపేస్తున్నారు. ఈ అక్రమాలన్నీ సంబంధిత అధికారులకు తెలిసినప్పటికీ, అధికారుల మౌనం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మొరం మట్టి తవ్వకాల వెనకాల ఓ పెద్ద నాయకుడి హస్తం ఉందని గ్రామస్తులు, విద్యావంతులు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు ఉన్నాయి.

మట్టి తవ్వకాలను అడ్డుకున్న వ్యక్తి..

రైతు పొలంలో నుండి వెళ్తున్న భారీ వాహనాల వల్ల తన పొలం పంట సాగుకు పనికిరాదని, తన అనుమతి లేకుండా భారీ వాహనాల రాకపోకలు ఎలా కొనసాగిస్తారని మైల్వార్ గ్రామానికి చెందిన గొల్ల శామప్ప ఆదివారం ఉదయం అడ్డుకోవడంతో మట్టితవ్వకాలు కొద్దిసేపు నిలిపివేశారు. చుట్టుపక్కల పొలాలు యజమానులు నచ్చజెప్పి అక్రమ మట్టి తవ్వకాలకు సహకరించారు. దీనిపై సంబంధిత కాంట్రాక్టర్ ను వివరణ కోరగా.. బషీరాబాద్ తహసీల్దార్ అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఈ విషయంపై తహసీల్దార్ షహిదా బేగంను వివరణ కోరగా.. తాను ఎవరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ఇదంతా మైనింగ్ అధికారులు చూసుకుంటారని సమాధానం ఇచ్చారు. తహసీల్దార్ సమాధానం మేరకు మైనింగ్ అధికారులను వివరాలు కోరగా.. రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ట్యాక్స్ లు చెల్లిస్తారని పొంతన లేని సమాధానాలతో ఫోన్ కట్ చేశారు.

Next Story