- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నార్సింగి మున్సిపాలిటీ చారెడు అనుమతులు.. బారెడు నిర్మాణాలు
అనుమతులు చారెడు.. కట్టింది బారెడు.. అన్న చందంగా నార్సింగి మున్సిపాలిటీ (ప్రస్తుతం జీహెచ్ఎంసీ సర్కిల్) పరిధిలో వ్యవహారం దర్జాగా సాగింది.

దిశ, గండిపేట: అనుమతులు చారెడు.. కట్టింది బారెడు.. అన్న చందంగా నార్సింగి మున్సిపాలిటీ (ప్రస్తుతం జీహెచ్ఎంసీ సర్కిల్) పరిధిలో వ్యవహారం దర్జాగా సాగింది. అనుమతులు కొంతమేరకు తీసుకున్న నిర్మాణదారులు దానికి రెట్టింపు స్థాయిలో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టారు. ఈ వ్యవహారం అంతా నార్సింగి మున్సిపాలిటీ ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే జరిగిందని చెప్పవచ్చు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట, నార్సింగి గ్రామం, గిరిగిరి గడ్డ, 250 గజాల ప్రాంతం.. ఇలా అన్ని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా దర్జాగా అదనపు అంతస్తులు భారీ స్థాయిలో వెలిశాయి.
ఇటీవల నార్సింగి మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో సర్కిల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే, అంతకుముందు మున్సిపాలిటీ ఉన్నతాధికారి, టౌన్ ప్లానింగ్ అధికారి, సిబ్బంది ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా సాగింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు అందిన కాడికి జేబుల్లో డబ్బులు నింపుకొని అక్రమ నిర్మాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. చాలా రోజులుగా ఈ తంతు జరిగింది.
కమిషనర్ నిద్రపోయారా..!
కొన్ని సంవత్సరాలుగా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాల జాతర కొనసాగింది. తమకు అడిగినంత డబ్బులు ఇస్తే చాలు.. మేము ఏమీ పట్టించుకోం అన్న చందంగా మున్సిపాలిటీ అధికారులు వ్యవహరించడం గమనార్హం. మున్సిపల్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో కొందరు అక్రమార్కులు గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు నాలుగు, ఐదు అంతస్తుల అనుమతులు తీసుకొని దర్జాగా ఏడు, ఎనిమిది.. తొమ్మిది అంతస్తులు నిర్మించారు. ఇక సెట్ బ్యాక్‌ల విషయానికి వస్తే అవేంటో మాకు తెలియదు అన్నట్లుగా మున్సిపాలిటీ అధికారులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, నిర్మాణదారులు వ్యవహరించడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎవరేమీ అనుకుంటే మాకేంటి అన్నట్లుగా.. తమ జేబులు నిండితే చాలు అన్న చందంగా మున్సిపల్ అధికారులు వ్యవహరించడం గమనార్హం.
సమీక్షలకే స్పెషల్ ఆఫీసర్..?
నార్సింగి మున్సిపల్ పరిధిలో జరిగిన అక్రమ నిర్మాణాల జాతర వ్యవహారం అంతా సీడీఎంఏ అధికారులతో పాటు ఇటీవల కొన్ని రోజుల క్రితం వరకు పనిచేసిన ప్రత్యేక అధికారికి పూర్తిగా తెలిసినా ఏమీ పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక అధికారి కేవలం సమీక్షలు, శంకుస్థాపనలకే పరిమితమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకానీ క్షేత్రస్థాయిలో అక్రమాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. అవేమీ ఆయన పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఇక మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి అక్రమ నిర్మాణాలను, అక్రమాలను చూస్తూ ఊరుకున్నారని పలు రాజకీయ పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల జాతర అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






