ఎమ్మెల్యేలకు ‘మున్సిపల్‌’ పరీక్ష!

by Ajay Maddhiboyina |

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో మున్సిపల్‌ ఎన్నికలు స్థానిక ఎమ్మెల్యేలకు పరీక్షగా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ గుర్తుతో జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికార పార్టీ మున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది.

ఎమ్మెల్యేలకు ‘మున్సిపల్‌’ పరీక్ష!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో మున్సిపల్‌ ఎన్నికలు స్థానిక ఎమ్మెల్యేలకు పరీక్షగా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ గుర్తుతో జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికార పార్టీ మున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఈ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనుండడంతో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రభుత్వంపై పట్టణ ప్రాంతాల్లో ప్రజానుకూలతను తెలియజేసేందుకు ఈ ఎన్నికలు అధికార పార్టీకి రెఫరెండంగా మారాయి. ఈ పరిస్థితుల్లో స్వయంగా ఎమ్మెల్యేలే రంగంలోకి దిగి అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు.

గ్రూపు రాజకీయాలతో చేటు..

ముఖ్య నేతల మధ్య విభేదాలు, క్యాడర్‌ లో గ్రూపు రాజకీయాలు ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయి. గతంలో అవకాశాలు రాని వాళ్లు, రిజర్వేషన్లు కలిసొచ్చిన నాయకులు, పార్టీ మారిన నాయకులు, సీనియర్లు, పాత కొత్త నాయకులు పోటీ చేసే విషయంలో చాలాచోట్ల విభేదాలు వస్తున్నాయి. ఒక్కోచోట ఇద్దరి కంటే ఎక్కువ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఎంపిక విషయంలో తర్జన భర్జన పడాల్సి వస్తోంది. ప్రజాబలంతో పాటు ఆర్థిక బలం వంటి అంశాలతోపాటు ప్రత్యర్థులతో పోలిస్తే కాంగ్రెస్ టికెట్‌ ఇచ్చే అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలను ఆరా తీసి బరిలో దింపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపికలో జాప్యం నెలకొంటున్నది. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో చేవెళ్ల, శంకర్‌ పల్లి, మొయినాబాద్‌ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా.. స్థానిక ఎమ్మెల్యేకు, నియోజకవర్గ ఇంచార్జికి మధ్య వైరం నడుస్తున్నది. దీంతో మాజీ ఎంపీ రంజిత్‌ రెడ్డి ఇద్దరు నేతలను సమన్వయ పర్చి టికెట్ల కేటాయింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ నెల 28 నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ అధికార పార్టీ ఇప్పటివరకు ఎవరికీ బీ-ఫామ్‌ లను ఇవ్వలేదు. ముందుగా నామినేషన్లు అయితే వేయమని ఆశావహులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. విత్‌ డ్రా లోపుగా అభ్యర్థులకు నచ్చజెప్పి ఒక్కరే పోటీలో ఉండేలా చూద్దామన్న భావనలో ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తున్నది.

ఊపందుకున్న చేరికలు..

గడచిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ల మధ్య పోటీ నువ్వా?నేనా! అన్నట్లుగా సాగింది. అధిక పంచాయతీ స్థానాలు అధికార పార్టీకే దక్కినప్పటికీ.. బీఆర్‌ఎస్ పార్టీ సైతం మంచి ఫలితాలనే రాబట్టుకుంది. అక్కడక్కడా అధికార పార్టీ ఎమ్మెల్యేలున్న చోట కూడా బీఆర్‌ఎస్ విజయ బావుటా ఎగుర వేసి పంచాయతీల్లో బలాన్ని నిరూపించుకుంది. ఇదే ఊపులో మున్సిపాలిటీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ సన్నద్ధమవుతున్నది. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న అన్ని చోట్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో అధికార పార్టీ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేలకు ఏర్పడింది. గత పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మున్సిపల్‌ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూసుకుంటేనే కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రెబల్స్​‍ బెడద, అసంతృప్తులకు మొదట్లోనే చెక్‌ పెట్టాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా పలువురు సూచిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తప్పవన్న టాక్‌ అధికార పార్టీ నేతల నుంచే విన్పిస్తున్నది.

Next Story