నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవాలి.. అర్హతలు ఇవే!

by Jakkula.Mamatha |

కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి, సంపాదిస్తున్న వ్యక్తిని కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది.

నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవాలి.. అర్హతలు ఇవే!
X

దిశ,కొడంగల్: కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి, సంపాదిస్తున్న వ్యక్తిని కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం(NSAP)లో భాగంగా అమలవుతున్న నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం(NFBS) ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు దౌల్తాబాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి(MPDO) ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలో ఉన్న అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి అవగాహన కల్పించాలని సూచించారు.

​అర్హతలు ఇవే.. దారిద్య్ర రేఖకు దిగువన (BPL) ఉండి, కుటుంబానికి ప్రధాన ఆధారమైన వ్యక్తి మరణించిన పక్షంలో ఆ కుటుంబం ఈ పథకానికి అర్హులు. మరణించిన వ్యక్తి వయస్సు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి. అటువంటి కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

దరఖాస్తు ప్రక్రియ.. అర్హత కలిగిన వారు ముందుగా తమ సమీపంలోని మీసేవ (MeeSeva) కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత, ఆ కాపీతో పాటు అవసరమైన ధృవీకరణ పత్రాలను జతచేసి దౌల్తాబాద్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో నేరుగా అందజేయాల్సి ఉంటుంది.

​శనివారమే చివరి గడువు.. మీసేవలో దరఖాస్తు చేసుకున్న హార్డ్ కాపీలను ఈ శనివారం సాయంత్రం (EOD) లోపు కార్యాలయంలో సమర్పించాలని ఎంపీడీవో స్పష్టం చేశారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోమని, కావున అర్హులు త్వరగా స్పందించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు.

Next Story