కూరగాయల డంపు.. కుళ్లిన కంపు

by Naga Rani Yarlagadda |

లింగంపల్లి కూరగాయల మార్కెట్ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. పరిసరాలు కుళ్లిన కూరగాయల వ్యర్థాలతో కంపుకొడుతున్నాయి.

కూరగాయల డంపు.. కుళ్లిన కంపు
X

దిశ, శేరిలింగంపల్లి: లింగంపల్లి కూరగాయల మార్కెట్ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. పరిసరాలు కుళ్లిన కూరగాయల వ్యర్థాలతో కంపుకొడుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ కూరగాయలు వ్యర్థాలు పారబోస్తూ ఉండడంతో అవి కుళ్లి దుర్వాసన వ్యాపిస్తుంది. లింగంపల్లి ప్రాంతంలో అతి పెద్ద మార్కెట్ ఇదే. ఇక్కడకు శంకరపల్లి, మోమిన్ పేట్, సంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి వందల మంది రైతులు వచ్చి కూరగాయలు విక్రయిస్తుంటారు. హోల్ సేల్ వ్యాపారాలు ఉండడంతో తక్కువ ధరకే కూరగాయలు లభ్యమవుతాయనే ఆశతో వందల మంది వినియోగదారులు ఇక్కడికి వస్తుంటారు. కొనుగోలుదారులు, అమ్మకం ధరలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పారిశుధ్యం అధ్వాన్నంగా తయారైంది. వ్యర్థాలు తొలగించేందుకు రాంకీ సంస్థకు బాధ్యతలు అప్పగించగా.. వాటిని తరలించడంలో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.

మార్కె్ట్‌లోని షెడ్లు చెత్తతో నిండిపోయాయి. మొత్తం 190 షాపులు ఉండగా.. కొంత మంది వినియోగించడం లేదు. ఒక్కో దుకాణానికి 254, 260, 290 రూపాయల చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు. కొంతమంది బినామీలకు అద్దెకు ఇవ్వగా.. మరికొంత మంది 3, 4 దుకాణాలు సొంతానికి ఉపయోగించుకొని వ్యాపారం చేస్తున్నారు. మటన్, చికెన్ వ్యాపారుల కోసం నిర్మించిన 17 దుకాణాలు నిరుపయోగంగా ఉన్నాయి. తాజాగా సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు లక్షలు వెచ్చించి అదనంగా దుకాణాలు నిర్మిస్తున్నారు. శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా ఉన్న దుకాణాల మరమ్మతులు చేయకుండా కొత్తగా నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం అవుతుంది.

దుకాణాల కేటాయింపులో లోపించిన పారదర్శకత

కొత్తగా నిర్మించిన మార్కెట్ సముదాయంలో ఇష్టానుసారంగా కేటాయింపులు చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పండ్ల విక్రయదారుల కోసం నిర్మించిన వ్యాపార సముదాయంలో డ్రా పద్ధతిలో కేటాయించడం, బహిరంగ వేలం ద్వారా కేటాయింపులు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అడ్డుకుంటామని వ్యాపారులు చెబుతున్నారు. దుకాణాలు ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారనే విషయాన్ని బహిర్గతం చేయాలన్నారు. సీఎంసీకి ఎంత ఆదాయం వస్తుందో అంతుచిక్కడం లేదు. చాలా దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. కొంతమంది బినామీలు కేటాయిస్తూ నెలనెలా అద్దెలు వసూలు చేసుకుంటున్నారని, మరి కొంతమంది గోదాముల కింద వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఎవరెవరికి దుకాణాలు కేటాయించారో సరైన రికార్డులు అందుబాటులో లేవని, సినిమా షూటింగ్ ల ద్వారా వచ్చే ఆదాయం ఏమయ్యాయో అంతుచిక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థాల నుంచి ఎరువులు తయారుచేసే కేంద్రం ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఏర్పాటు చేసిన గిట్టుబాటు కావడం లేదని ఎత్తేశారు. పార్కింగ్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం

అన్ని రకాల దుకాణాలు ఉండాలనే లక్ష్యంతో మటన్ దుకాణాలు నిర్మించాం. అక్కడకు వచ్చేందుకు వ్యాపారులు సుముఖంగా లేరు. దుకాణాల ద్వారా వచ్చే ఆదాయం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. సీఎం సీఎస్టేట్ విభాగం పర్యవేక్షణలో దుకాణాల కేటాయింపు జరుగుతుంది. ఎప్పటికప్పుడు చెత్త తరలించే బాధ్యత రాంకీ యాజమాన్యం చూసుకోవాలి. చెత్త నిల్వ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం.

- మార్కెట్ కమిటీ చైర్మన్ వీరేశం గౌడ్

Next Story