- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘విల్లా’లకు ‘సర్కారీ’ దారి?
విల్లాలను విక్రయించేందుకు ‘లెగసీ ఏఎమ్మార్’ సంస్థ సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నది. హెచ్ఎండీఏ, రెరా అనుమతుల కోసం చూపించిన దారిని చూసి.. విల్లాలను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఏకంగా ప్రభుత్వ భూమిలోనే రహదారిని నిర్మించింది.

దిశ, రంగారెడ్డి బ్యూరో/అబ్దుల్లాపూర్ మెట్: విల్లాలను విక్రయించేందుకు ‘లెగసీ ఏఎమ్మార్’ సంస్థ సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నది. హెచ్ఎండీఏ, రెరా అనుమతుల కోసం చూపించిన దారిని చూసి.. విల్లాలను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఏకంగా ప్రభుత్వ భూమిలోనే రహదారిని నిర్మించింది. ఫిర్యాదులు రావడంతో ఆ రహదారిని మూసివేసినా.. దాని పక్కనే ఉన్న మరో దారిని చూపిస్తున్నది. ‘ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి అతిదగ్గరలో’ అని కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నది. దీనిపై మళ్లీ ఫిర్యాదులు వచ్చినా.. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం విస్తుగొలుపుతున్నది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం గౌరెల్లిలో ఉన్న ఈ విల్లాలు కొన్న వారికి భవిష్యత్తులో రహదారి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
వాస్తవాలను దాచిపెట్టి..
విల్లాలకు వెళ్లే దారి విషయంలో ‘లెగసీ ఏఎమ్మార్’ సంస్థ వాస్తవాలను దాచి పెడుతూ కస్టమర్లను మోసం చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా గౌరెల్లి-కుత్బుల్లాపూర్- నాగోల్ రోడ్డు నుంచి విల్లాలకు దారి చూపించి హెచ్‌ఎండీఏ, రెరా అనుమతులు తీసుకున్నారు. అయితే ఈ దారి విల్లాలకు వెనుక వైపు నుంచి ఉన్నది. దీంతో మొత్తం తిరిగి రావాల్సి ఉంటుందని వాటిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో రియల్ ఎస్టేట్ సంస్థ కొత్త ఎత్తుగడ వేసింది. సర్వే నంబర్ 238లోని ప్రభుత్వ భూమిలో నుంచి రోడ్డు వేసి.. విల్లాలకు ఇదే దారి అంటూ ప్రచారం చేసింది. ఈ దారి ఓఆర్‌ఆర్ ఎగ్జిట్-10 నుంచి కేవలం కిలోమీటరున్నర దూరం మాత్రమే ఉన్నది. దీంతో వాస్తవాలు తెలియని చాలా మంది విల్లాల కొనుగోలుకు ఆసక్తి చూపించారు. అయితే సర్వే నంబర్ 238లో రోడ్డును నిర్మించిన భూమిని ప్రభుత్వం గతంలో ఓ రైతుకు అసైన్ చేసింది. ఆ తర్వాత వివిధ కారణాలతో పీవోటీ కింద ఆ భూమిని తిరిగి తీసుకున్నది. ఇప్పుడు అందులో నుంచే వెంచర్ నిర్వాహకులు రోడ్డును నిర్మించారు. అయితే ఇది వివాదాస్పదం కావడం, ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు ఆ రోడ్డును మూసివేయించారు. నిబంధనల ప్రకారం విల్లాలకు 60 ఫీట్ల రోడ్లు ఉండాలి. కానీ బ్రోచర్ లోని లే అవుట్ ప్రపోజల్ లో 30 ఫీట్ల రోడ్లను చూపిస్తుండగా.. వెంచర్ కు అనుమతులు ఎలా ఇచ్చారన్నది చర్చనీయాంశంగా మారింది.
పక్కనే ఉన్న మరో దారిని చూపించి..
ప్రభుత్వ భూమిలో రోడ్డును నిర్మించి ఒకసారి భంగపాటుకు గురైన లెగసీ ఏఎమ్మార్ యాజమాన్యం.. మళ్లీ అడ్డదారినే ఎంచుకున్నది. రెవెన్యూ అధికారులు మూసి వేసిన రోడ్డుకు పక్కనే ఉన్న మరో రోడ్డును ప్రచారానికి వాడుకుంటున్నది. బ్రోచర్ లోనూ వంద ఫీట్ల రోడ్డుగా చూపెట్టడంతోపాటు.. ఇదే మార్గాన్ని వెంచర్ కు దారి అని కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నది. అయితే ఈ రోడ్డు సైతం ప్రభుత్వ భూమిలో నిర్మించినదే. ‘స్వ భూమి’ అనే రియల్ సంస్థ ఈ రోడ్డును గతంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించి ఓపెన్ ప్లాట్లను అమ్ముకున్నది. అయితే ప్రస్తుతం ‘లెగసీ ఏఎమ్మార్’ సంస్థ సైతం ఇదే రోడ్డును తమ విల్లాలకు దారిగా చూపెడుతున్నది.
రియల్ సంస్థకు అధికారుల వత్తాసు
‘లెగసీ ఏఎమ్మార్’ రియల్ సంస్థ నిర్వాకం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. అధికారులు మౌనంగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. చర్యల మాటేమోగానీ.. రియల్ సంస్థకే రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదులు వస్తే.. ‘మొదటి రోడ్డును మూయించాం కదా? ఇక రెండో రోడ్డు సంగతి ఎందుకు?’ అంటూ ఫిర్యాదుదారులపైనే రెవెన్యూ అధికారులు కసురుకుంటున్నారు. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే.. అనాథాశ్రమాన్ని బూచీగా చూపిస్తున్నారు. రోడ్డు విషయమై ‘దిశ’ ప్రతినిధి తహసీల్దార్ సుదర్శన్ రెడ్డితో మాట్లాడినప్పుడు.. ‘అనాథాశ్రమానికి వెళ్లేవారు ఈ దారి గుండానే రాకపోకలు సాగిస్తున్నారు. అందుకే రోడ్డును మూసివేసే విషయంలో ఆలోచించాల్సి వస్తున్నది’ అని చెప్పారు. అయినా ఆ రోడ్డు వెంచర్ వాళ్లు వేసుకున్నది కాదు.. ఆర్ అండ్ బీ శాఖ వేసిన లింక్ రోడ్డు అని మరోసారి చెప్పారు. అయితే అనాథాశ్రమానికి వెళ్లేందుకు వంద ఫీట్ల దారి ఎందుకు? అన్నది అందరి మదిలో తొలుస్తున్న ప్రశ్న. నిజంగా ఆశ్రమానికే అనుకుంటే.. ఆశ్రమం చివరి వరకు కూడా వంద ఫీట్ల రోడ్డు ఉండాలి కదా? నేరుగా వెంచర్ లోకి ఎందుకు నిర్మించినట్లు! అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి ఎవరు పరిశీలించినా ఇది స్పష్టంగా తెలుస్తుంది. విల్లాలకు దారి అంటూ ‘లెగసీ ఏఎమ్మార్’ సైతం బోర్డు ఏర్పాటు చేసుకున్నది. మరి అధికారులకు ఇంతకంటే ఇంకేమి సాక్ష్యం ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. రియల్ సంస్థ అనుమతులకు సంబంధించి తమవద్ద ఎటువంటి వివరాలు లేవని పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ అధికారులు చేతులెత్తేయడం కూడా చర్చనీయాంశంగా మారింది.






