జీహెచ్ఎమ్‌సీ విస్తరణతో నేతల ఆశలపై నీళ్లు

by Malleboina Mahesh |

మహా విస్తరణ కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం అన్నట్లుగా మారింది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి.

జీహెచ్ఎమ్‌సీ విస్తరణతో నేతల ఆశలపై నీళ్లు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: మహా విస్తరణ కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం అన్నట్లుగా మారింది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పాత జీహెచ్‌ఎంసీలో డివిజన్ల సంఖ్య పెరగడంతో అక్కడి వారిలో సంతోషం కన్పిస్తోంది. కానీ.. విలీనమైన శివారు మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో మాత్రం ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లైం ది. రంగారెడ్డి జిల్లాలో 3 కార్పొరేషన్లు, 8 మున్సిపాలిటీలు గ్రేటర్‌‌లో విలీనమయ్యా యి. ఇప్పటివరకు వీటిల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉండేవారు. అయితే గ్రేటర్‌‌లోని వార్డుల పునర్విభజనతో విలీనమైన మున్సిపాలిటీలు రెండు, మూడు డివిజన్లుగా ఏర్పడ్డాయి. ఆయా డివిజన్ల రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయో! అన్న ఊహాగానాల నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై నా నేతల్లో ఒకింత ఆందోళన నెలకొంది.

నేతల అంచనాలు తలకిందులు

జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం అనంతరం ప్రభుత్వం వార్డుల సంఖ్యను 300లకు ఖరారు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది. డీలిమిటేషన్‌‌పై ప్రజల నుంచి అభ్యంతరాలను బుధవారం నుంచి స్వీకరిస్తున్నారు. వీటిపై ఈనెల 18న జరగనున్న స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. డీలిమిటేషన్‌ డ్రాఫ్ట్‌కు కౌన్సిల్‌ ఆమోదం తీసుకుని అభ్యంతరాలను డిస్పోజ్‌ చేసిన అనంతరం ఫైనల్‌ నోటిఫికేషన్‌‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. అయితే రంగారెడ్డి జిల్లాలోని విలీన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 266 వార్డులు ఉండగా కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా చాలా మందికి అవకాశం కలిగింది.

నేతల్లో రిజర్వేషన్ల టెన్షన్

మున్సిపాలిటీల పాలన ముగిసి ప్రత్యేక అధికారుల పాలన సాగుతుండగా.. వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్న భావనలో చాలామంది నేతలు ఉన్నారు. ఈ క్రమంలోనే విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా.. ఆపత్కాలంలో ఆర్థిక సాయం అందజేస్తూ వస్తున్నారు. అనూహ్యంగా విలీన ప్రక్రియ తెరమీదకు రావడం గతంలో ఉన్న 266 వార్డులు పునర్విభజనలో 27 వార్డులుగా రూపాంతరం చెందడంతో అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి ఆశా భంగం కలిగింది. ఒక్కో మున్సిపాలిటీ, కార్పొరేషన్ల బరిలో రెండు, మూడు కార్పొరేటర్లు మాత్రమే ఉండటంతో పోటీ తీవ్రంగా ఉండడమే కాకుండా ఆర్థిక బలం ఉన్న వారికే పోటీ చేసే ఛాన్స్ దక్కనుంది. ఆర్థికంగా ఉన్నప్పటికీ.. ఆ రెండు, మూడు కార్పొరేషన్ల రిజర్వేషన్లు తమకు అనుకూలంగా ఉంటాయో! లేదో! అన్న ఆందోళన కూడా చాలా మందిలో నెలకొంది.

విలీనం తర్వాత వార్డులు ఇలా..

మున్సిపాలిటీ - గతంలో - ప్రస్తుతం

ఆదిభట్ల - 15 - 02

తుర్కయంజాల్‌- 24 - 02

పెద్ద అంబర్‌‌పేట్‌- 24 - 02

బడంగ్‌‌పేట్‌ - 32 - 03

మీర్‌‌పేట్‌- 46 - 03

జల్‌‌పల్లి - 28 - 03

తుక్కుగూడ - 15 - 02

శంషాబాద్‌ - 22 - 02

బండ్లగూడ జాగీర్‌- 22 - 03

నార్సింగి - 18 - 03

మణికొండ - 20 - 02

జిల్లాలో డివిజన్లు ఇవే..

సర్కిల్‌ - - డివిజన్లు

ఆదిభట్ల - ఆదిభట్ల, కొంగర కలాన్‌

తుర్కయంజాల్‌- తుర్కయంజాల్‌, తొరూర్‌

పెద్ద అంబర్‌‌పేట్‌- పెద్ద అంబర్‌‌పేట్‌, కుంట్లూర్‌

బడంగ్‌‌పేట్‌ - బడంగ్‌‌పేట్‌, నాదర్‌‌గుల్‌, బాలాపూర్‌

మీర్‌‌పేట్‌ - మీర్‌‌పేట్‌, జిల్లెల గూడ, ప్రశాంతి హిల్స్

జల్‌‌పల్లి - జల్‌‌పల్లి, షాహిన్‌ నగర్‌, పహాడీ షరీఫ్‌

తుక్కుగూడ - తుక్కు గూడ, ఇమామ్‌ గూడ

శంషాబాద్‌ - శంషాబాద్‌, కొత్వాల్‌ గూడ

బండ్లగూడ జాగీర్‌- బండ్లగూడ, కిస్మత్‌‌పూర్‌, హైదర్‌ షాకోట్‌

నార్సింగి - నార్సింగి, గండిపేట, కోకాపేట

మణికొండ - మణికొండ, నెక్నంపూర్‌ -

Next Story