- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడంగల్‌కు ‘తిరుమల’ వైభవం.. రూ.110 కోట్లతో కృష్ణశిల క్షేత్రం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఆధ్యాత్మిక విప్లవానికి శ్రీకారం చుట్టారు.

దిశ,కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఆధ్యాత్మిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని చారిత్రాత్మక శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సుమారు రూ. 110 కోట్ల భారీ వ్యయంతో పునర్నిర్మించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 8న ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనున్న భూమి పూజ కార్యక్రమం కోసం కొడంగల్ ముస్తాబవుతోంది.
అగ్రశ్రేణి అధికారుల పహారా.. !
ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అధికారుల పర్యవేక్షణే నిదర్శనం. సోమవారం ఏకంగా సీఎం ప్రత్యేక కార్యదర్శి శ్రీనివాసరాజు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆలయ పరిసరాల్లో గంటల తరబడి పర్యటించారు. హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ వరకు ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాధారణంగా స్థానిక అధికారులు చూసుకునే పనులను, స్వయంగా సిఎంవో స్థాయి అధికారులు పర్యవేక్షించడం ఈ ప్రాజెక్టుకు ప్రధాన బలంగా నిలుస్తోంది.
ఆగమశాస్త్రం ప్రకారం కృష్ణ శిలల కట్టడం.. భవిష్యత్తు ‘ఆధ్యాత్మిక హబ్’!
తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే, ఈ ఆలయాన్ని అద్భుతమైన కృష్ణ శిలలతో (నల్ల రాతి కట్టడం) నిర్మించనున్నారు. వైఖానస ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం గర్భగుడి, ముఖ మండపం, ప్రాకారాలను తీర్చిదిద్దనున్నారు. కేవలం రెండేళ్ల కాలపరిమితిలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి, కొడంగల్‌ను దక్షిణ తెలంగాణలోనే ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా (Spiritual Tourism Hub) తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు!
ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం మే 6వ తేదీ నుంచే ఆలయంలో పండుగ వాతావరణం నెలకొననుంది. మే 6, 7, 8 తేదీల్లో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, జపాలు నిర్వహించనున్నారు. 8వ తేదీన భూమి పూజ అనంతరం సుమారు 10 వేల మంది భక్తులతో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. భక్తుల కోసం అధునాతన క్యూలైన్లు, విశ్రాంతి షెల్టర్లు, తాగునీరు మరియు పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తున్నారు.






