- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధిక హెచ్‌ఆర్‌ఏ కోసం కొందరు ఉపాధ్యాయుల కక్కుర్తి.. అర్హులకు అన్యాయం
అడిగేవారు లేకపోతే అంతా వారిష్టమే అన్నట్టుంది రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ తీరు.

దిశ, రంగారెడ్డి బ్యూరో : అడిగేవారు లేకపోతే అంతా వారిష్టమే అన్నట్టుంది రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ తీరు. ఎంతో పారదర్శకంగా ఉపాధ్యాయుల స్పౌజ్ బదిలీలు చేపట్టామని అధికారులు చెబుతున్నప్పటికీ.. తప్పులు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అవకతవకలపై ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదులు చేసినప్పటికీ సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. నీతి నిజాయితీ వంటి అంశాల బోధనతో ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కుతుండగా.. ఇందుకు ఉన్నతాధికారులు ప్రోత్సాహం అందిస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల తీరుతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా.. ప్రభుత్వానికి సైతం చెడ్డ పేరును తీసుకొస్తున్నారన్న అపవాదును సైతం మూటగట్టుకుంటున్నారు. ఉన్నతాధికారులైన స్పందించి స్పౌజ్ బదిలీలలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి.
నిబంధనలను విస్మరించి..
స్పౌజ్ బదిలీల కోసం గత ఏడాది ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. రంగారెడ్డి జిల్లాలో ఆసాంతం అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు విన్పిస్తున్నాయి. బదిలీల సందర్భంగా 10 పాయింట్లను వాడుకోవడం మొదలు.. ఆప్షన్లు పెట్టుకోవడం వరకు అన్నీ అక్రమాలే జరిగాయి. స్పౌజ్ బదిలీల్లో భార్యా భర్తలు ఒకే మండలంలో పోస్టింగ్‌కు దరఖాస్తు చేయాల్సి ఉండగా.. కొందురు హెచ్‌ఆర్‌ఏకు ఆశపడి తమకు నచ్చిన స్కూళ్లకు ఆప్షన్ పెట్టుకున్నారు. స్పౌజ్ పాయింట్ల రేడియస్ లోనే బదిలీకి అధికారులు అవకాశం కల్పించాలి. కోరుకున్న చోట ఖాళీ లేకపోతే.. పక్క మండలంలోని స్కూల్‌కు బదిలీ చేయాలి. అక్కడా లేకుంటే ఆ పక్కన ఉండే మండలానికి బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే కొంత మంది ఉపాధ్యాయులు తమకు ఇష్టం ఉన్న ప్రాంతాలకు ఆప్షన్ పెట్టుకోగా.. అధికారులు అవేమీ పరిశీలించకుండానే గుడ్డిగా ఆర్డర్లు ఇచ్చారు. ఆయా సబ్జెక్టు టీచర్లకు సంబంధించిన పోస్టులు లేనప్పటికీ కొందరిని పైరవీలతో బదిలీ చేయడం విస్మయం గొలుపుతోంది. స్పౌజ్ బదిలీ పాయింట్ల వినియోగానికి సంబంధమే లేకుండా పైరవీలకు పెద్దపీట వేసి ఉపాధ్యాయులకు నచ్చిన పాఠశాలకు పోస్టింగ్ లు ఇచ్చారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయన్న ప్రచారం జరుగుతోంది. హెచ్‌ఆర్‌ఏ కోసం దొడ్డిదారిన పోస్టింగ్ లు పొందుతుండడం వల్ల ప్రభుత్వ ఖజానాపై సైతం ఆర్థిక భారం పడుతోంది. నిబంధనలకు విరుద్దంగా బదిలీలు జరగడంపై పలు ఉపాధ్యాయ సంఘాలు జిల్లా కలెక్టర్‌కు, డీఈవోకు అనేక మార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అక్రమ స్పౌజ్ బదిలీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇక్కడ తప్పును సరిదిద్దుకుని..
జీవో 317 రిలొకేషన్ స్పౌజ్ కేటాయింపులలో భాగంగా పోస్టులు కూడా లేని పాఠశాలలకు సైతం జిల్లా విద్యాశాఖ కేటాయింపులు జరిపింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం తొర్రూర్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేనప్పటికీ ఉపాధ్యాయులను ఇక్కడకు బదిలీ చేస్తూ పోస్టింగ్‌లు ఇచ్చారు. అలాగే శేరిగూడ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ పోస్టు ఖాళీ లేనప్పటికీ ఒక ఉపాధ్యాయుడిని ఇక్కడకు బదిలీ చేశారు. వీరంతా మూడు నెలల పాటు పోస్టులు లేని పాఠశాలల్లోనే కొనసాగారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న మళ్లీ కౌన్సిలింగ్ జరిపి ఇతర పాఠశాలలకు కేటాయింపులు జరిపారు. పోస్టులు లేని పాఠశాలల్లో పనిచేసిన సందర్భంగా వీరికి సంబంధించిన పది రోజుల వేతనాన్ని సైతం ఆయా ఉపాధ్యాయులు పొందారు. అయితే ఎస్టీవో అధికారులు ఈ విషయాన్ని గుర్తించి తిరిగి చలాన్ కట్టించుకోవడం ద్వారా వారి నుంచి ఆ వేతనాన్ని రికవరీ చేశారు.
ఇక్కడ బేఖాతరు..
నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలిని సరూర్ నగర్ మండలానికి స్పౌజ్ కేటాయింపులో భాగంగా బదిలీ చేయడంపై నేటికీ వివాదం నడుస్తోంది. ఈ అక్రమానికి కొమ్ముకాసేలా జిల్లా విద్యాశాఖ అడుగడుగునా తప్పులు చేయడం సైతం విస్మయం గొలుపుతోంది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని పడకల్ జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడి భార్య నాగర్ కర్నూల్ జిల్లాలో టీచర్ (ఇంగ్లీష్) గా పనిచేస్తోంది. స్పౌజ్ కోటాలో ఆమె రంగారెడ్డి జిల్లాకు ఆప్షన్ పెట్టుకోగా.. తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అధికారులు కేటాయించారు. కానీ ఆమె విధుల్లో చేరలేదు. దీంతో 23 రోజుల తర్వాత ఆమెను నిబంధనలకు విరుద్దంగా పట్టణ ప్రాంతమైన సరూర్ నగర్ మండలంలోని రాజీవ్ గాంధీ నగర్ పాఠశాలకు బదిలీ చేస్తూ మాడిఫికేషన్ ఉత్తర్వులను జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించి 70 కి.మీ.ల దూరంలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆ 23 రోజులకు గాను డీఈవో కార్యాలయంలో విధులు నిర్వర్తించినట్లు ఆన్ డ్యూటీ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. రాజీవ్ గాంధీ నగర్ పాఠశాలలో చేరిన సందర్భంగా మాత్రం 23 రోజుల కాలాన్ని సెలవుగా చూపెట్టడం గమనార్హం. అంతేకాదు.. ఎలిజిబుల్ లీవ్ సాంక్షన్ చేయాలంటూ డీఈవో కార్యాలయం నుంచే ఆదేశాలు వెలువడడం మరీ విడ్డూరం. ఓ వైపు ఆన్ డ్యూటీగా చెబుతూనే..మరోవైపు మెడికల్ లీవ్ ఇవ్వడం వెనుక జిల్లా అధికారుల మతలబు ఏమిటో? వారికే తెలియాలి. 23 రోజులకు సంబంధించి జీత భత్యాల చెల్లింపులు సైతం జరిగాయి. జిల్లా విద్యాశాఖ చేసిన తప్పుల వల్ల 23 రోజులకు సంబంధించి సుమారు రూ.90 వేల వేతనంతో పాటు, అధిక మొత్తంలో అందుకుంటున్న హెచ్‌ఆర్‌ఏ కారణంగా ఇప్పటి వరకు రూ.2 లక్షలకు పైగా భారం ప్రభుత్వ ఖజానాపై పడినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. రూరల్ ప్రాంతం నుంచి అర్బన్ ప్రాంతానికి బదిలీ చేసిన సందర్భంలో ప్రభుత్వ ఉన్నత స్థాయిలో ఫైనాన్స్ సెక్రటరీ నుంచి తప్పనిసరిగా ఆమోదం తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. కానీ జిల్లా విద్యాశాఖ ఇవేమీ పాటించలేదు. ఈ అక్రమాలపై సేవ్ టీచర్స్ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు అనేకమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఉన్నతాధికారులైనా.. స్పందించి చర్యలు తీసుకుంటారో? లేదో! వేచి చూడాలి.






