అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

by Taduka Kalyani |

అంతర్రాష్ట్ర స్థాయిలో గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఆదిబట్ల పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్న ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
X

దిశ, ఇబ్రహీంపట్నం : అంతర్రాష్ట్ర స్థాయిలో గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఆదిబట్ల పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్న ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని బెర్హంపూర్ ప్రాంతం నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రలో అధిక ధరకు విక్రయిస్తూ అధిక లాభాలు పొందుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా గంజాయిని ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు పోలీసులకు అందిన పక్కా సమాచారంతో శంషాబాద్ టాస్క్‌ఫోర్స్ బృందం - అదిబట్ల పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు. దీనిలో భాగంగా బొంగులూరు ఔటర్ రింగ్ రోడ్డు గేట్ జంక్షన్ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన టాటా హారియర్, మారుతి ఎర్టిగా కార్లను ఆపి తనిఖీ చేయగా భారీ మొత్తంలో గంజాయి బయటపడింది. దింతో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 110 కిలోల గంజాయితో పాటు రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ సుమారు రూ.56 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులంతా మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన ప్రశాంత్ గణేష్ పసల్కర్ అలియాస్ నానా (31), రాజేష్ హనుమంత్ లోంధే (31), షాహాజీ గోరక్ చంగన్ అలియాస్ పప్పు (25), ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన శ్రీహరి లిమా (26)గా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన స్మగ్లర్ మహారాష్ట్రకు చెందిన ప్రణవ్ సింగ్, గంజాయి సరఫరాదారు ఒడిశా బెర్హంపూర్‌కు చెందిన ప్రభిత్ర ప్రధాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులు సుమారు 10–12 రోజుల క్రితం బెర్హంపూర్ చేరుకుని సరఫరాదారు ప్రభిత్ర ప్రధాన్ నుంచి గంజాయిని సేకరించినట్లు తెలిపారు. గంజాయి తరలింపులో టాటా హారియర్ కారును పైలట్ వాహనంగా వినియోగించి, మార్గమధ్యంలో పోలీసుల తనిఖీల సమాచారాన్ని ఎర్టిగా కారులోని సభ్యులకు చేరవేసేవారు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు సాధారణ ఫోన్ కాల్స్‌కు బదులుగా ఇంటర్నెట్ కాలింగ్ వినియోగించడంతో పాటు, టోల్ ప్లాజాల వద్ద గుర్తించకుండా ఉండేందుకు ఎర్టిగా కారుకు నకిలీ మహారాష్ట్ర నంబర్ ప్లేట్ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి దర్యాప్తు కోసం ఆదిబట్ల పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

డ్రగ్స్ నిర్మూలనకు యువత సహకరించాలి

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని హైదరాబాద్ నగర పోలీసులు సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేసి మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని పోలీసులు కోరారు.

Next Story