ఎల్లమ్మ కుంటపై కబ్జాల దందా.. బఫర్ జోన్‌లో దర్జాగా నిర్మాణాలు

by Naga Rani Yarlagadda |

ప్రజల దాహార్తిని తీర్చే జలవనరులు కబ్జాదారుల చేతిలో చిక్కుకుంటున్నా అధికారులు మౌనం వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

ఎల్లమ్మ కుంటపై కబ్జాల దందా.. బఫర్ జోన్‌లో దర్జాగా నిర్మాణాలు
X

దిశ, మొయినాబాద్ : ప్రజల దాహార్తిని తీర్చే జలవనరులు కబ్జాదారుల చేతిలో చిక్కుకుంటున్నా అధికారులు మౌనం వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం సర్వే నంబర్ 312లో ఉన్న ఎల్లమ్మ కుంటలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇరిగేషన్ శాఖ హెచ్చరికలు, పోలీసు ఫిర్యాదులు ఉన్నప్పటికీ నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగడం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇప్పటివరకు మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, సంబంధిత అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. ఇరిగేషన్ శాఖ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేయడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదే విషయమై మున్సిపల్ అధికారులకు నివేదికలు అందించినప్పటికీ ఎల్లమ్మ కుంట బఫర్ జోన్‌లో నిర్మాణాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అధికారుల తీరుపై అనేక సందేహాలు..

‘92 ప్రీమియర్ వెంచర్’ పేరుతో ఎల్లమ్మ కుంట పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంతో అధికారుల తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు మౌనం వహించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేదా ఇతర ప్రయోజనాలు ఉన్నాయా? అనే చర్చ సాగుతోంది. మరోవైపు మొయినాబాద్ మున్సిపల్ పరిధిలో చెరువులు, కుంటలు, కాల్వలు, నాలాలు బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నా నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల భవిష్యత్ అవసరాలకు కీలకమైన జలవనరులు కబ్జాలకు గురవుతుండగా సంబంధిత శాఖలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఎల్లమ్మ కుంటను ఆక్రమణల నుంచి కాపాడడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story