అక్రమ మైనింగ్‌పై హైడ్రా ఉక్కుపాదం.. ఒకేరోజు 6 ప్రాంతాల్లో భారీ ఆపరేషన్!

by Jakkula.Mamatha |

అనుమతులు లేకుండా సాగుతున్న అక్రమ మైనింగ్, స్టోన్ క్రషింగ్, రెడీమిక్స్ కాంక్రీట్(RMC) యూనిట్లపై హైడ్రా మంగళవారం భారీ స్థాయిలో ఉక్కుపాదం మోపింది.

అక్రమ మైనింగ్‌పై హైడ్రా ఉక్కుపాదం.. ఒకేరోజు 6 ప్రాంతాల్లో భారీ ఆపరేషన్!
X

దిశ, శంషాబాద్, గండిపేట: అనుమతులు లేకుండా సాగుతున్న అక్రమ మైనింగ్, స్టోన్ క్రషింగ్, రెడీమిక్స్ కాంక్రీట్(RMC) యూనిట్లపై హైడ్రా మంగళవారం భారీ స్థాయిలో ఉక్కుపాదం మోపింది. పీసీబీ, మైనింగ్, రెవెన్యూ శాఖల ఫిర్యాదుల మేరకు ఒకేసారి ఆరు ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి 6 స్టోన్ క్రషింగ్ యూనిట్లు, 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను తొలగించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి మండలం గౌలిదొడ్డి, శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడ ప్రాంతాల్లో ఈ కూల్చివేతలు చేపట్టారు. కోర్ అర్బన్ రీజినల్ ఎకానమీ (CURE) పరిధిలో సాగుతున్న ఈ అక్రమ యూనిట్లు ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆదాయ నష్టాన్ని కలిగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

కాలుష్యం, అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు..

ఇష్టారాజ్యంగా క్వారీలు తవ్వడం, రాళ్ల పేలుళ్లతో పరిసర ప్రాంతాల్లోని నివాసాలకు ముప్పు కలిగించడం, స్టోన్ క్రషింగ్ ద్వారా విపరీతమైన దుమ్ముతో కాలుష్యాన్ని పెంచడం వంటి అంశాలపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెచ్చరికలను పట్టించుకోకుండా యథేచ్ఛగా కొనసాగుతున్న యూనిట్లను ఈసారి శాశ్వతంగా నిలిపివేసేలా యంత్ర సామగ్రిని తొలగించింది.

బడా సంస్థల అక్రమాలు బట్టబయలు..

గౌలిదొడ్డిలో గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, వట్టినాగులపల్లిలో పరమేష్ సింగ్ స్టోన్ క్రషర్/శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్, పృథ్వి స్టోన్ క్రషర్, కొత్వాల్‌గూడలో రాఘవ స్టోన్ క్రషర్ సంస్థలతో పాటు మక్తా భగత్ సింగ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ కొనసాగింది. అవసరమైన మైనింగ్, పీసీబీ అనుమతులు లేకుండానే యూనిట్లు నడపడం, కోట్ల రూపాయల కరెంట్ బిల్లులు బకాయిలు ఉండటం, విద్యుత్ నిలిపివేస్తే డీజిల్‌తో యంత్రాలు నడపడం వంటి అంశాలు బయటపడ్డాయి.

కలెక్టర్ లేఖతో కదిలిన యంత్రాంగం..

ఈ అక్రమ యూనిట్లను వెంటనే తొలగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైడ్రాకు లేఖ రాయడంతో చర్యలు వేగవంతమయ్యాయి. సంబంధిత శాఖల సమన్వయంతో మంగళవారం ఉదయం నుంచే సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు.

ఊపిరి పీల్చుకున్న స్థానికులు..

కాలుష్యం, రాళ్ల పేలుళ్లు, అక్రమ తవ్వకాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిసర గ్రామాల ప్రజలు హైడ్రా చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ మాఫియాపై ఇదే తరహా చర్యలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Next Story