ఆశ.. నిరాశ !

by Thanuru Gopichand |

ఎన్నో తర్జన భర్జనలు, ప్రజల అభ్యంతరాల నడుమ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి తుదిరూపు ఇచ్చింది.

ఆశ.. నిరాశ !
X

దిశ, రంగారెడ్డి బ్యూరో / గండిపేట : ఎన్నో తర్జన భర్జనలు, ప్రజల అభ్యంతరాల నడుమ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి తుదిరూపు ఇచ్చింది. అయితే కొత్త జోన్ల ఏర్పాటు కొందరికి మోదంగా.. మరికొందరికి ఖేదంగా మారింది. కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా.. మరికొందరు జోన్ల ఏర్పాటు పారదర్శకంగా లేదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాజేంద్ర‌నగర్‌ నియోజకవర్గంలోనే కొత్తగా రెండు జోన్లు ఏర్పాటు కావడం.. శంషాబాద్‌‌ను జోన్‌గా ఏర్పాటు చేయడంపై వివిధ వర్గాలు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అధికార వికేంద్రీకరణ, పరిపాలనా సౌలభ్యం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని జోన్లను ఏర్పాటు చేస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునః పరిశీలన చేయాలన్న డిమాండ్‌ సైతం తెరపైకి వస్తోంది.

విలీన మున్సిపాలిటీల కొత్త రూపు..

పాత జీహెచ్‌ఎంసీలో ఆరు జోన్లు ఉండగా.. విస్తరణ నేపథ్యంలో జోన్లు 12కు పెరిగాయి. గతంలో 30 సర్కిళ్లు ఉండగా.. ప్రస్తుతం సర్కిళ్ల సంఖ్య 60కి పెరిగాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలో విలీనమైన రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల, తుర్కయంజాల్‌, పెద్ద అంబర్‌ పేట్‌, బడంగ్‌‌పేట్‌, మీర్‌‌పేట్‌, జల్‌‌పల్లి, తుక్కుగూడ, శంషాబాద్‌, బండ్లగూడ జాగీర్‌, నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు ప్రస్తుతం కొత్త రూపును సంతరించుకున్నాయి. కొత్తగా శంషాబాద్‌ జోన్‌‌గా ఏర్పాటు కాగా.. మిగతావి సర్కిల్‌ కార్యాలయాలుగా, వార్డులుగా రూపాంతరం చెందాయి.

ఎల్బీనగర్‌ జోన్‌...

నాగోల్‌ సర్కిల్‌ : కుంట్లూరు, పెద్ద అంబర్‌‌పేట్‌, నాగోల్‌, మన్సూరాబాద్‌, జీఎస్ఐ, లెక్చరర్స్​ కాలనీ

శంషాబాద్‌ జోన్‌..

ఆదిభట్ల సర్కిల్‌ : తొర్రూరు, కొంగర కలాన్‌, ఆదిభట్ల, తుర్కయంజాల్‌

బడంగ్‌‌పేట్‌ సర్కిల్‌ : మీర్‌‌పేట్‌, బడంగ్‌‌పేట్‌, జిల్లెల గూడ, నాదర్‌ గుల్‌, ప్రశాంతి హిల్స్​, బాలాపూర్‌

జల్‌‌పల్లి సర్కిల్‌ : షాహీన్‌ నగర్‌, పహాడీ షరీఫ్‌, జల్‌‌పల్లి

శంషాబాద్‌ సర్కిల్‌ : తుక్కుగూడ, మంఖాల్‌, శంషాబాద్‌, కొత్వాల్‌ గూడ

రాజేంద్ర నగర్‌ జోన్..

రాజేంద్ర‌నగర్‌ సర్కిల్‌ : రాజేంద్ర‌నగర్‌, బండ్లగూడ జాగీర్‌, కిస్మత్‌‌పూర్‌, హైదర్‌ షా కోట్‌

శేరిలింగంపల్లి జోన్‌..

నార్సింగ్‌ సర్కిల్‌ : నార్సింగి, కోకాపేట్‌, గండి‌పేట్‌, మణికొండ, నెక్నంపూర్‌

‘బడంగ్‌ పేట్‌’ పై నీరుగారిన ఆశలు...

జీహెచ్‌ఎంసీ విస్తరణ నిర్ణయం తర్వాత తుక్కుగూడ మున్సిపాలిటీని చార్మినార్‌ జోన్‌‌లో చేర్చవద్దని రాజకీయాలకు అతీతంగా స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇదే క్రమంలో బడంగ్‌‌పేట్‌‌ను ప్రత్యేక జోన్‌‌గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ సైతం తెరపైకి వచ్చింది. శంషాబాద్‌ జోన్‌ ఏర్పాటు పై కూడా చర్చ జరిగింది. అయితే శంషాబాద్‌ ప్రాంతంలో 111 జీవో అభివృద్దికి ప్రతిబంధకంగా ఉంటూ వస్తోంది. అదే బడంగ్‌ పేట్‌ కార్పొరేషన్ జిల్లాలోనే అతి పెద్ద కార్పొరేషన్‌గా ఉండడం.. అన్ని ప్రాంతాలకు కేంద్ర బిందువుగా కావడం వల్ల జోన్‌ ఏర్పాటుకు అన్ని అనుకూలతలు ఉన్నట్టేనని, ఇక జోన్‌‌గా బడంగ్‌ పేట్‌ ఖాయమని అంతా భావించారు. అన్ని హంగులతో నిర్మాణమైన బడంగ్‌‌పేట్‌ కార్పొరేషన్ కార్యాలయం సైతం అందుబాటులో ఉంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా బడంగ్‌‌పేట్‌ ను సర్కిల్‌ కార్యాలయానికే పరిమితం చేయడంతో ఈ ప్రాంత ప్రజానీకంలో తీవ్ర నిరాశ నెలకొన్నది.

అస్తిత్వం కోల్పోయిన బండ్లగూడ..

మొన్నటి వరకు కార్పొరేషన్‌గా విరాజిల్లిన బండ్లగూడ జాగిర్ ప్రస్తుతం అస్తిత్వం కోల్పోయింది. ప్రభుత్వం బండ్లగూడను జోన్‌గా ఏర్పాటు చేస్తుందని ఇక్కడి ప్రజలు, నాయకులు భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బండ్లగూడ జాగీర్ ను రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో విలీనం చేశారు. సర్కారు నిర్ణయం పై ఇక్కడ ప్రజలు ఎంతో గుర్రుగా ఉన్నారు. జోన్‌గా ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ఎన్నో మౌలిక వసతులు అణువుగా ఉన్నాయి. బండ్లగూడ లోని కిస్మత్పూర్ లో కార్పొరేట్ స్థాయిలో భారీ భవనాన్ని అందుబాటులో ఉంది. శంషాబాద్, నార్సింగి మున్సిపాలిటీలను బండ్లగూడ జాగిర్లో కలిపి నూతనంగా జోన్ ఏర్పాటు చేస్తారని భావించిన ఇక్కడి ప్రజలకు నిరాశే మిగిలిందని చెప్పవచ్చు. బండ్లగూడ జాగర్ ను కనీసం సర్కిల్ కూడా ఏర్పాటు చేయలేదు. బండ్లగూడ జాగీర్ లోని బండ్లగూడ ను ఇటీవల బండ్లగూడ, కిస్మత్పూర్, హైదర్ షాకోట్ డివిజన్ లుగా ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

నెరవేరిన శంషాబాద్ వాసుల డిమాండ్..

మొన్నటివరకు శంషాబాద్ కేవలం మున్సిపాలిటీ మాత్రమే. అయితే శంషాబాద్ ను తప్పనిసరిగా జోనుగా ఏర్పాటు చేయాల్సిందేనని అక్కడ అఖిలపక్ష నాయకులు జేఏసీగా ఏర్పడి భారీ స్థాయిలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఒకరోజు సంపూర్ణ బంద్ కూడా పాటించారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం శంషాబాద్ ను జోన్ గా ఏర్పాటు చేసింది. శుక్రవారం మధ్యాహ్నం చంద్రకళ జోనల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story