మెప్మాలో గోల్ మాల్.. అడిట్‌లో అడ్డంగా దొరికిపోయిన వైనం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-08 01:38:14  IST  )

మహిళల ఆర్థిక స్వలంభన, స్వయం ఉపాధి ద్వారా రాణించాలన్న సంకల్పంతో రాష్ట్ర సర్కారు పనిచేస్తోంది.

మెప్మాలో గోల్ మాల్.. అడిట్‌లో అడ్డంగా దొరికిపోయిన వైనం
X

దిశ, మేడ్చల్ బ్యూరో : మహిళల ఆర్థిక స్వలంభన, స్వయం ఉపాధి ద్వారా రాణించాలన్న సంకల్పంతో రాష్ట్ర సర్కారు పనిచేస్తోంది. ప్రభుత్వాలు మహిళా సంఘాలకు వడ్డిలేని రుణాలు అందించి వారి అభ్యున్నతికి పాటుపడుతుంటే.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అడ్డగోలు దోపిడీ, అక్రమ వ్యవహరాలు నిత్యకృత్యమయ్యాయి. ఇటివల నిర్వహించిన అడిట్‌లో అవకతవకలకు పాల్పడినట్లు రుజువు కావడంతో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మితో పాటు, జిల్లా మిషన్ సమన్వకర్త అనిల్‌లపై సస్పెన్షన్ వేటు పడింది.

నా ఖాతా సెటిల్ చేయాల్సిందే..

జిల్లా పట్టణ పేదరిక నిర్మూళన సంస్థలో 8 ఏళ్లుగా అనిల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయినా అనిల్ జిల్లా మిషన్ కో అర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటు ఆర్పీలను, సీవోలను మధ్యవర్తులుగా ఉంచి అవినీతి బాగోతం నడుపుతున్నట్లు ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. డ్వాక్రా మహిళలకు బ్యాంక్ రుణాలు ఖాతాల్లో జమ చేయాలంటే, అనిల్ ముందు తన ఖాతా సెటిల్ చేయాలంటాడని మహిళా సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. అదేవిధంగా రెవెన్యూ శాఖ నుంచి మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మి సైతం అవినీతికి అండగా నిలిచినట్లు ఫిర్యాదులు వచ్చాయి. మెప్మాతో మహిళల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ఇద్దరు కీలక అధికారులు అడ్డదారులు తొక్కుతూ అవినితీకి పాల్పడినట్లు అడిట్ నివేదికలో బయటపడినట్లు జిల్లా అధికారులు తెలియజేస్తున్నారు. దోచుకున్న సొమ్ముకు లెక్కాపత్రం లేకపోవడంతో అడిట్‌లో ఆ ఇద్దరు అధికారులపై వేటు వేసినట్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా అడిట్ అధికారులను ప్రలోభపెట్టెందుకు ప్రయత్నించి సదరు అధికారులు విఫలమైనట్లు తెలిసింది.

ప్రతి పనికో రేటు..

డ్వాక్రా సంఘాలకు సంబంధించిన లావాదేవీలు, తీర్మానాలు, సమావేశాలన్నీ ఆర్పీలు, సీవోలు చూస్తుంటారు. వీరు తీర్మానాలు రాసినందుకు ఒక రేటు.. బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించినందుకు మరో రేటు పెట్టి మహిళల వద్ద దండుకుంటున్నారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న మహిళలు వాటిని ప్రతి నెల వాయిదాల రూపంలో చెల్లిస్తారు. దీనికిగాను తీర్మానాలు రాసేందుకు కూడా లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర సర్కారు అసరా, వడ్డిలేని రుణాల పథకాలను ప్రతి ఏటా అమలు చేస్తోంది. ఈ పథకాలు వస్తే చాలు మెప్మా అధికారులు పండుగ చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి గ్రూపు నుంచి సుమారు రూ.10వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Next Story