అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా

by Naveena |   (  Updated:2025-03-13 16:21:52  IST  )

జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ హెచ్చరించారు.

అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా
X

దిశ, శంషాబాద్ : జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని మైలార్దేవుపల్లి, అత్తాపూర్ డివిజన్లో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో సర్కిల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో.. టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ బృందంతో వెళ్లారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య జెసిబిల సహాయంతో మైలార్దేవుపల్లి డివిజన్ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలో అక్రమంగా నిర్మించిన 8 అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లడంతో అక్రమ నిర్మాణాదారులు జీహెచ్ఎంసీ అధికారులను అడ్డుకున్నారు.

దీంతో పరిస్థితి ఉదృతంగా మారడంతో అక్రమ నిర్మాణా దారులను పోలీసులు అదుపులోకి తీసుకొని 8 అక్రమ నిర్మాణాలు పూర్తిగా నిలమట్టం చేశారు. అత్తాపూర్ డివిజన్లోని అంబియన్స్ పోర్ట్ లో అనుమతులకు మించి భవనాలపై నిర్మించిన రెండు పెంట్ హౌస్ లను అక్రమంగా నిర్మించారని గుర్తించి జీహెచ్ఎంసీ కార్మికులతో గోడలను పూర్తిగా కూల్చివేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరైనా అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలను చేపడితే కూల్చివేతలు తప్పవు అన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకొని నిర్మించాలని సూచించారు. ఒకవేళ అనుమతి లేకుండా స్థానిక నాయకుల అండదండలతో నిర్మించాలని చూస్తే కూల్చి వేయడం జరుగుతుందని హెచ్చరించారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టి నష్టపోవద్దన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఎవరు అక్రమ నిర్మాణాలు చేపట్టిన జిహెచ్ఎంసి కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Next Story