గ్యాస్ కొరత.. హోటళ్లలో టిఫిన్‌ ధరలకు రెక్కలు

by velandi.Saikiran |   (  Updated:2026-03-13 21:46:08  IST  )

వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో.. ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. గ్యాస్ కొరత కారణంగా హోటళ్లను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు కొందరు ప్రకటించారు.

గ్యాస్ కొరత.. హోటళ్లలో టిఫిన్‌ ధరలకు రెక్కలు
X

గ్యాస్ బండ..బ్లాక్ దందా?

సిలిండర్ ఇవ్వకుండానే డెలివరీ మెస్సేజ్‌లు..

హెచ్‌పీ, భారత్, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీల నిర్వాకంపై ఆరోపణలు

కమర్షియల్ అవసరాలకు గృహ సిలిండర్లు మళ్లిస్తున్నారన్న అనుమానాలు

గ్యాస్ కొరతతో హోటళ్లలో అల్పాహారం ధరలకు రెక్కలు

దిశ, చేవెళ్ల : ఇరాన్ లో యుద్ధం సంక్షోభ ప్రభావం అన్ని నగరాలపై, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై పడింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో.. ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. గ్యాస్ కొరత కారణంగా హోటళ్లను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు కొందరు ప్రకటించారు.

కస్టమర్లకు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్ కు..

ఎక్కడో జరుగుతున్న యుద్ధం వల్ల మనం ఇబ్బంది పడుతున్నామని.. పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సమస్య హోటల్ కు పరిమితం కాలేదు. గృహ అవసరాలపై కూడా ప్రభావం చూపనుంది. గత రాత్రి నుంచి గ్యాస్ బుకింగ్ ఏజెన్సీ లకు కాల్స్ చేస్తే నంబర్ కలవకపోవడం, బ్లింకింగ్ సౌండ్ వచ్చి నంబర్ తొలగిపోతుంది. కాగా, ఈ ఉదయం గ్యాస్ బుకింగ్స్ కోసం కాల్స్ చేస్తే.. మీకు గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిందని ఫోన్ కు మెస్సేజ్ వస్తుందని పలువురు చెబుతున్నారు. ఈ నెల 11న డిలివరీ అయింది.. వచ్చే నెల 26 వరకు గ్యాస్ ఇవ్వరాదని ఆ మెస్సేజ్ సారాంశం. గ్యాస్ ఏజెన్సీ లు సిలిండర్ ఇవ్వకుండానే ఇచ్చినట్లు మెస్సేజ్ లు రావడం ఏంటని మండిపడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ లే కస్టమర్లకు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల బదులు గృహ వినియోగం సిలిండర్లను హోటళ్లకు సరఫరా చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

అల్పాహారం ధరలకు రెక్కలు..

కొంత మంది అష్టకష్టాలు పడి ఉన్న సిలిండర్లతో హోటళ్లు నడుపుతున్నారు. బ్లాక్ మార్కెట్ లోనూ దొరక్కపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నారు. అందుబాటులో ఉన్న బండలు వినియోగిస్తూ.. అల్పాహారం ధరలు పెంచేశారు. గతంలో ప్లేట్ రూ.40 ఉంటే.. ఇప్పుడు రూ.60కి చేరింది. హోటళ్ల వైపు కన్నెత్తి చూడాలంటే భయ పడే పరిస్థితులు వచ్చాయి.

ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్..

గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని ఆయిల్ కంపెనీలు సూచించాయి. కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన తర్వాత సుమారు రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. డెలివరీ ఆలస్యం అయితే.. ఇండేన్ గ్యాస్ వినియోగదారులు : 1800-2333-555 లేదా 7718955555 కు, భారత్ గ్యాస్ కస్టమర్లు : 1800-22-4344 లేదా 7715012345 కు, హెచ్ పీ గ్యాస్ వినియోగదారులు : 1800-2333-555 లేదా 9493602222కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు.

భారీగా పెరిగిన సిలిండర్ల బుకింగ్స్..

దేశంలో గ్యాస్ కొరత లేదని కేంద్రం చెబుతున్నా బుకింగ్ ఆగడం లేదు. ఇరాన్-యూఎస్, ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు సగటున 50 లక్షల సిలిండర్ల బుకింగ్స్ జరిగేవి. కానీ నిన్న ఒక్కరోజే 75.7 లక్షలు దాటినట్లు కేంద్రం చెప్పింది. అంటే ఏకంగా 50 శాతం బుకింగ్స్ పెరిగాయి. ఈ నెల 2న 71 లక్షలు, 10న 69 లక్షలు నమోదయ్యాయి. ఎక్కడా డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ కొరత లేదని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు.

సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్..

రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల రవాణా సురక్షితంగా, సకాలంలో జరిగేలా చూసేందుకు అవసరమైన చోట పోలీస్ ఎస్కార్ట్ కల్పించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. అవి చమురు సంస్థలతో సమన్వయం చేసుకోనున్నాయి. గోదాములు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద శాంతి భద్రతల పర్యవేక్షణకు అధికారులను నియమించారు. కృత్రిమ కొరతను అరికట్టి కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా చూడడమే ఈ చర్యల వెనుక ఉద్దేశంగా కనిపిస్తున్నది.

Next Story