మంచాల తహసీల్దార్ కార్యాలయంపై రైతులు దాడికి యత్నం

by Bhoopathi Nagaiah |

మంచాల తహసీల్దార్ కార్యాలయంలో తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

మంచాల తహసీల్దార్ కార్యాలయంపై రైతులు దాడికి యత్నం
X

దిశ మంచాల: మంచాల తహసీల్దార్ కార్యాలయంలో తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.ఓ భూమి పట్టా విషయంలో మండలం పరిధిలోని బండలేమురు గ్రామస్థులు ఏకంగా ఎమ్మార్వో కార్యాలయం పై దాడికి దిగారు. రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

బండలేమురు గ్రామం ఆరుట్ల రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 880,883లో బండలేము గ్రామానికి చెందిన సరియ నాయక్ 3.17 గుంటల భూమి 40 సంవత్సరాల క్రితం సాదా బైనమా ద్వారా సమీప రైతులకు అమ్ముకున్నాడు. అదే గ్రామానికి చెందిన జట్టియా నాయక్ 3.16 గుంటల భూమి మీద ఇప్పటి వరకు కబ్జాలో ఉన్నారు. జట్టియా నాయక్ కబ్జాలో ఉన్నా ఆయన పేరు ఆన్లైన్ లో ఎక్కలేదు. దీంతో సరియ నాయక్, జట్టియా నాయక్ కుమారులు 2025 నవంబర్ 18న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సరియ నాయక్ కుమారులు పక్క రైతుల పహనీల ఆధారంతో కోర్టులో పిటీషన్ వేశారు. ఆ రైతులు కోర్టుకు హాజరు కాకపోవడంతో 24 మంది రైతుల నుండి భూమి స్వీకరించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. దీంతో 24 మంది రైతులకు చెందిన భూమి నుంచి కొంచెం కొంచెం తీసి సరియ నాయక్ జట్టియ నాయక్ పై పేరు మార్పిడి జరిగింది. దీంతో వివాదానికి దారి తీసింది. తమ భూమిని వారికి ఎలా పట్టా చేస్తారని రైతులు తహసీల్దార్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న ఆర్డీవో అనంత రెడ్డి రైతులతో మాట్లాడారు. కోర్టు ఆర్డర్ ప్రకారం పేరు మార్పిడి జరిగిందని, మూడు నాలుగు రోజులు గడువు ఇస్తే పూర్తి వివరాలు తెలుసుకొని చట్టపరంగా న్యాయం చేస్తానని నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

కాగా, రైతులు మూకుమ్మడిగా తహసీల్దార్ కార్యాలయంపై దాడికి యత్నించారు. ఓ రైతు పెట్రోల్ బాటిల్‌తో ఆందోళనకు దిగడంతో అధికారులు భయాందోళనకు గురయ్యారు. తహసీల్దార్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కార్యాలయ సిబ్బంది ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు ఎనక్కు తగ్గలేదు. పైగా పెట్రోల్‌తో రావడంతో గతంలో అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వోపై జరిగిన ఉదాంతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో మంచాల సీఐ మధు సంఘటన స్థలానికి చేరుకుని రైతులను అదుపు చేశారు. కాగా, ఈ ఘటనపైప్రభుత్వ అధికారులు గానీ రైతుల నుండి కానీ ఎవరు ఫిర్యాదు చేయలేదని సీఐ మధు తెలిపారు

Next Story