- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పందెన్ వాగు పరాధీనం.. బఫర్ జోన్‌కు మంగళం
మురుగు, దోమల బెడదకు మణికొండలో చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా మురుగునీరు పారుతున్న పందెన్ వాగు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించింది.

దిశ, గండిపేట: మురుగు, దోమల బెడదకు మణికొండలో చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా మురుగునీరు పారుతున్న పందెన్ వాగు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించింది. మణికొండ మున్సిపాలిటీ అధికారులు ఇటీవల కొన్ని రోజుల క్రితం సుమారు రూ.100 కోట్లు మంజూరు చేయడంతో ఇక్కడి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు సెప్టెంబర్ 19న పందెన్ వాగు అభివృద్ధి పనులకు ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. వాగు మొత్తం మురుగు పారడంతో మణికొండ ప్రజలు తీవ్ర దోమల బాధతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు అభివృద్ధి ప్రాజెక్టుపై అందరి నుంచి హర్షం వ్యక్తం అవుతున్నది. పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అయితే, ఇదంతా బాగానే ఉన్నా పందెన్ వాగు చాలా ప్రాంతాల్లో పరాధీనం పాలైంది. వాగుకు ఆనుకొని వివిధ ప్రాంతాల్లో నిర్మాణాలు వెలిశాయి. ఏమాత్రం బఫర్ జోన్ వదలకుండా చాలామంది ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
అంతా 'మామూలు' గానే..
పందెన్ వాగు మణికొండ పరిధిలో సుమారు మూడు కిలోమీటర్ల పొడవు ఉంది. కాగా, వాగు కబ్జాపై నివారణ విషయంలో ఆయా శాఖల అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆక్రమణల విషయంలో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉక్కుపాదం మోపాల్సిన మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పందెన్ వాగుకు ఇరువైపులా చాలా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో వాగుకు ఆనుకొని మట్టి కూడా పోశారు. ఈ వ్యవహారంలో ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు పాత్ర అధికంగా ఉందని చెప్పవచ్చు. వాగు బఫర్ జోన్ లో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టినా ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం మత్తులో ఉన్నారని చెప్పవచ్చు. మణికొండ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మణికొండలోని జన చైతన్య కాలనీలో కొందరు బిల్డర్లు అడ్డగోలుగా పందెన్ వాగును ఆనుకొని, బఫర్ జోన్ లో భారీగా నిర్మాణాలు చేపట్టినా ఏ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కేవలం వర్షపునీరు వెళ్లేందుకు ఏళ్ల క్రితం తవ్విన పందెన్ వాగులో మురుగు నీరు కలుస్తుండటంతో పూర్తిగా దుర్గంధభరితంగా మారిపోయింది.
ల్యాంకోహిల్స్ నుంచి ప్రారంభమై నెక్నంపూర్ పెద్ద చెరువు వరకు ఓపెన్ నాలాగా ఉన్న పందెన్ వాగులో కొన్నేళ్లుగా మురుగునీరు కలుస్తోంది. వాగు అభివృద్ధిలో భాగంగా రెండువైపులా పెద్ద సైజులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపు లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మురుగు నీరు వాగు కలవకుండా పైపులైను ఏర్పాటు చేసి నేరుగా నెక్నం పూర్ చెరువు వరకు వెళ్లనుంది. దీనితో ఇరువైపులా రిటర్నింగ్ వాల్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రస్తుతం నాలాపై మొత్తం 8 కల్వర్టులు ఉన్నాయి. ఇందులో కొన్ని పూర్తిగా ఇరుకుగా మారిపోయాయని స్థానికులు చెబుతున్నారు.
అత్యాధునికంగా అభివృద్ధి..
సుమారు రూ.100 కోట్లతో పందెన్ వాగును అత్యాధునికంగా అభివృద్ధి చేయనున్నారు. కొన్ని చోట్ల పార్కులు కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు నాలాకు రెండువైపులా ఆహ్లాదకరమైన వాతావరణం పెంపొందించనున్నారు. కొన్నిరోజుల క్రితం ఏరియల్ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. వాగుకు రెండు వైపులా ఉన్న కబ్జాలు తొలగించి అభివృద్ధి చేస్తేనే సర్కార్, ఇక్కడి ప్రజలు ఆశిస్తున్న ప్రయోజనం దక్కుతుంది.






