అబ్దుల్లాపూర్‌‌మెట్‌‌లో రూ.15 కోట్ల ప్రభుత్వ భూమిపై కన్ను

by Malleboina Mahesh |

అబ్దుల్లాపూర్‌మెట్‌లో రూ. 15 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా.. రెడ్డి భవనం పేరుతో సీనియర్ నేత డ్రామా.. చర్యలు తీసుకోకుండా బోర్డు పాతేసిన రెవెన్యూ అధికారులు!

అబ్దుల్లాపూర్‌‌మెట్‌‌లో రూ.15 కోట్ల ప్రభుత్వ భూమిపై కన్ను
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : ‘ఔటర్‌ రింగు రోడ్డును ఆనుకుని ఉన్న గ్రామమది. ఇక్కడ భూములు రూ.కోట్లు విలువ చేస్తుండడంతో కొందరి కన్ను అక్కడి ప్రభుత్వ భూములపై పడింది. రెడ్డి సంఘం భవనానికి కేటాయింపులు జరిపారంటూ కొందరు ప్రచారం చేసుకుని.. సుమారు అర ఎకరాన్ని ఆక్రమించుకుని చుట్టూ కడీలు పాతారు. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కదిలిన రెవెన్యూ అధికారులు రెండు రోజుల క్రితం ఒక బోర్డు పాతి ‘మమ’ అనిపించారు. కబ్జాచేసిన స్థలంలో పాతిన రాళ్ల కడీలను కనీసం టచ్‌ కూడా చేయలేదు. ఎంతలేదన్నా సదరు స్థలం విలువ రూ.15 కోట్ల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అంతటి విలువైన స్థలాన్ని పరిరక్షించడంలో రెవెన్యూ అధికారులు ప్రదర్శించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ స్థలానికి సమీపంలోనే రాజకీయ నేత ఒకరు రిసార్ట్‌ను కడుతుండగా.. దాని పార్కింగ్‌ కోసమే రెడ్డి భవనం పేరుతో డ్రామా నడిపించారన్న టాక్‌ స్థానికంగా వినిపిస్తోంది.

2,700 గజాల భూమికి ఎసరు..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌మెట్‌ మండలం పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 386/1లో సుమారు 60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఫ్రీడం ఫైటర్స్‌కు సుమారు 30 ఎకరాలు, పేదలకు 20 ఎకరాలను అసైన్డ్ చేసి ప్లాట్ల రూపంలో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఇంకా మిగిలిన కొంత భూమిలో 1995లో పేదలకు ప్లాట్లు కేటాయించింది. అలా.. పంపిణీ చేయగా ఇంకా సుమారు 6 ఎకరాల వరకు భూమి మిగిలి ఉంది. కళానగర్‌లో ప్రభుత్వ హాస్టల్‌ ఇరువైపుల ఉన్న సుమారు ఎకరంనరకు పైగా ప్రభుత్వ భూమి కూడా ఇందులోనే ఉంది. ఫ్రీడం ఫైటర్స్ సర్వేనంబర్‌ ఓవర్‌ లాప్స్ ‍సమస్య కారణంగా ప్లాట్లు కోల్పోయిన సుమారు 16 మందికి అప్పటి తహశీల్దార్‌ కళానగర్‌లో ప్లాట్లు కేటాయించారు. ఆ ప్లాట్లను కొందరు వేరే వాళ్లకు అమ్ముకోగా.. మరికొందరు రెండేళ్ల కిందట బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇల్లు నిర్మించుకున్నారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. ఇది ప్రభుత్వ భూమి ఇల్లు కట్టుకో వద్దంటూ.. కట్టిన ఇళ్లను కూడా కూల్చివేశారు. అప్పటి నుంచి సదరు భూమి పై కన్నేసిన కొందరు ఆ స్థలాన్ని కబ్జా చేసి ప్రీకాస్ట్ వాల్స్‌‍, కాంపౌండ్‌ వాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత మరికొందరు కలిసి రెడ్డి సామాజిక భవనానికి కేటాయించారని 2,700 గజాల భూమిలో ప్లాట్లను చదును చేసి కడీలు పాతారు. ఇదేమిటని అందులో ప్లాట్లు ఉన్న బాధితులు ప్రశ్నిస్తే.. వారిని నయానో.. భయానో బెదిరించినట్లు తెలిసింది. సైలెంట్‌గా ఉంటే మీకు వేరే చోట ప్లాట్లు ఇప్పిస్తా.. అంటూ సదరు నేత హామీ ఇవ్వడంతో చేసేదేమిలేక మిన్నకుండిపోయినట్లు తెలిసింది.

వచ్చారు.. బోర్డు పాతి వెళ్లిపోయారు..

కబ్జా స్థలంపై గత కొంతకాలంగా స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లడంతో అధికారులు వచ్చి ‘ఇది ప్రభుత్వ స్థలం’ అంటూ బోర్డు పెట్టి వెళ్లిపోయారు. కబ్జాకు పాల్పడిన వ్యక్తులపై పోలీసులకు సైతం ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. సరికదా.. కబ్జాకు పాల్పడిన వ్యక్తులు పాతిన కడీలను సైతం తొలగించకుండానే వెళ్లిపోయారు. అధికారులపై వచ్చిన వత్తిళ్ల మేరకే బోర్డు పెట్టి ‘మమ’ అనిపించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రిసార్ట్ నిర్మిస్తున్న ఓ నేత కనుసన్నల్లోనే ఈ తతంగమంతా నడుస్తోందని, అందుకే అధికారులు ప్రభుత్వ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న టాక్‌ సైతం స్థానికంగా వినిస్తోంది. గతంలో కూడా ఇక్కడ బోర్డు పాతగా.. కబ్జారాయుళ్లు తొలగించారని, అధికారుల ద్వంద్వ వైఖరి వల్ల రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాదారుల పరమవుతుందేమోనన్న ఆందోళన గ్రామస్తుల్లో వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. అధికారులు బోర్డు పాతిన స్థలంలో గతంలో పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ప్లాట్లు ఉన్నాయని, తిరిగి వాటిని తమకు కేటాయించాలన్న డిమాండ్‌ బాధితుల నుంచి వినిపిస్తోంది.

Next Story