వరుస సెలవులు కావడంతో... హైదరాబాద్ నగరం సగం ఖాళీ

by Geesa Chandu |

ఉదయం సాయంత్రం వేళల్లో నగరంలోని బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి.

వరుస సెలవులు కావడంతో... హైదరాబాద్ నగరం సగం ఖాళీ
X

దిశ, శేరిలింగంపల్లి : ఉదయం సాయంత్రం వేళల్లో నగరంలోని బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సంక్రాంతి, దసరా పండుగలకు మాదిరిగా ఎంజాయి చేసేందుకు ఊర్లకు వెళుతున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు చాలా వరకు సొంత ఊర్ల బాటపడితే..ఇంకొందరు ఫెండ్స్‌తో లేదా ఫ్యామిలీతో కలిసి టూర్లకు వెళుతున్నారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాప్‌లు, రైల్వేస్టేషన్‌లు జనాలతో సందడిగా కనిపిస్తున్నాయి.

వరుస సెలవులు..

ఈ సంవత్సరం మొదటిసారిగా 5 రోజుల పాటు వరుస సెలవులు వచ్చాయి. స్కూల్స్, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలకు సెలవులు కావడంతో జనాలు పక్కా ప్లాన్డ్‌గా ఊర్లకు, టూర్లకు వెళ్లిపోతున్నారు. 15న స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్ట్ 16న వరలక్ష్మి వ్రతం, 17న శనివారం, 18న ఆదివారం, 19న రాఖీ పౌర్ణమి ఉండడం ఉద్యోగులకు, విద్యార్థులకు లాంగ్ హాలిడేస్ దొరికినట్టు అయ్యింది. దీంతో సిటీలో ఉద్యోగాలు చేస్తున్న పబ్లిక్ సొంతూళ్ల బాటపట్టారు. స్కూల్స్, కాలేజీలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రావడంతో నగరం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకే కాక ఆయా ప్రాంతాలకు టూర్లు వెళుతున్నారు. దీంతో జిల్లాలకు వెళ్లే బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. దాదాపు అన్ని రైల్వే స్టేషన్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.

మాకు చెప్పి వెళ్లండి..

వరుస సెలవులు వచ్చిన కారణంగా ఊర్లకు వెళ్లే నగరవాసులు దగ్గరలోని పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇచ్చి వెళ్లాలని పోలీసులు కోరుతున్నారు. డబ్బు, బంగారు నగలు సహా విలువైన వస్తువులను ఇండ్లలో పెట్టకూడదని హెచ్చరిస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని గేటెడ్‌ కమ్యూనిటీలు, కాలనీల్లో ఆటోలతో పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఊర్లకు వెళ్లే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో, కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు తిరిగితే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. డబ్బు, బంగారం, వెండి బ్యాంక్ లాకర్స్‌‌లో భద్రపరచాలని, ఇంటి లోపల, బయట సీసీ కెమెరాలను ఆన్‌‌లోనే ఉంచాలని మాదాపూర్ డీసీపీ వినీత్ ప్రజలకు సూచించారు. ఊర్లకు వెళ్లే సమయంలో ఇంట్లో, బయట లైట్లు ఆన్‌‌లో ఉంచాలన్నారు. సొంతూరికి వెళ్తున్నట్లు ఎట్టిపరిస్థితుల్లోనూ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేయొద్దని హెచ్చరించారు.

చాలా రోజుల తర్వాత సెలవులు..

- తన్నీరు మధుసూదన్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

ఈ సంవత్సరం ఇవే లాంగెస్ట్ హాలిడేస్..వరుస సెలవులు రావడంతో ఫ్యామిలీతో కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాం. పిల్లలకు కూడా హాలిడేస్ రావడం, మాకూ సెలవులు దొరకడం ఎప్పుడో కానీ రాదు.

ఈసారి లాంగ్ టూర్‌లో బాగా ఎంజాయ్ చేస్తాం

- విజయ్ మేరీ..సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

5 రోజుల పాటు హాలిడేస్ దొరకడం సంతోషంగా ఉంది. ఫ్యామిలీ అందరం కలిసి మా అమ్మవాళ్ల ఇంటికి వెళుతున్నాం. చాలా రోజుల తర్వాత అందరితో కలిసి సరదాగా కలిసి గడిపే అవకాశం లభించింది.

ఉద్యోగ ఒత్తిడిలో ఇదో పెద్ద రిలీఫ్..

- కేశవ్ శ్రీరాం..సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

అనునిత్యం ఉద్యోగాలతో ఒత్తిడికి గురయ్యే మాకు ఈ సెలవులు పెద్ద రిలీఫ్. పనిఒత్తిడికి దూరంగా, ఫ్యామిలీతో గడిపే అవకాశం లభించింది. పిల్లలకు కొత్త ప్రదేశాలు చూపించేందుకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని వెళ్తున్నాం.

Next Story