కాంగ్రెస్‌లో అంతర్మథనం.. మెజార్టీ స్థానాల్లో గెలిచినా నేతల్లో అసంతృప్తి

by Ajay Maddhiboyina |

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. పల్లె ప్రజల ఆదరణ కోసం అన్ని రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నాయి.

కాంగ్రెస్‌లో అంతర్మథనం.. మెజార్టీ స్థానాల్లో గెలిచినా నేతల్లో అసంతృప్తి
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. పల్లె ప్రజల ఆదరణ కోసం అన్ని రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో వార్‌ వన్‌‌సైడే అన్న ధీమాలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఉండగా.. ప్రభుత్వ వ్యతిరేకతతో తమకు అనుకూల ఫలితాలు వస్తాయని బీఆర్‌ఎస్ పార్టీ గట్టిగా నమ్మింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుని సత్తా చాటినప్పటికీ ఆ పార్టీ నేతల్లో ఒకింత అసంతృప్తి నెలకొందనే టాక్ అంతటా వినిపిస్తుంది. బీఆర్‌ఎస్ పనైపోయిందని.. పల్లెల్లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతేనని భావించిన కాంగ్రెస్ నేతల అంచనాలు పంచాయతీ ఎన్నికల్లో తారుమారాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు విడతల్లోనూ కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్‌ పార్టీ హోరాహోరీగా పోరాడింది. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకుంది. అక్కడక్కడా ఒక్కటి, రెండు ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఓటమిని చవిచూశారు. ప్రస్తుత ఫలితాలు పార్టీకి బూస్టింగ్‌ అని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.

పట్టును నిలబెట్టుకున్నప్పటికీ..

రంగారెడ్డి జిల్లాలో 525 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 246 స్థానాల్లో, బీఆర్‌ఎస్ 181 స్థానాల్లో, బీజేపీ 47 స్థానాల్లో, ఇతరులు 51 స్థానాల్లో గెలుపొందారు. మూడు విడతల్లోనూ కాంగ్రెస్ హవానే కొనసాగగా.. పల్లెల్లో ఆ పార్టీ పట్టును పెంచుకుంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో గులాబీ సైతం గుబాళించడమే కాంగ్రెస్ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మహేశ్వరం మినహా అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకే అన్నట్లుగా అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో బీఆర్‌ఎస్ సైతం సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. మొదటి విడత నుంచి మూడవ విడత వరకు కూడా ఇదే ఒరవడి సాగింది. షాద్‌‌నగర్‌ ఎమ్మెల్యే సొంత మండలంతో పాటు సొంతూరులోనూ బీఆర్‌ఎస్ పార్టీ తమ మద్దతు దారులను గెలిపించుకుని కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకుంది. అలాగే.. కాంగ్రెస్ పెద్ద లీడర్లు ఉన్న ఊర్లలోనూ బీఆర్‌ఎస్ సత్తా చాటింది. రెబల్స్‌‍, వర్గ విభేధాలు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్‌లోనూ ఉన్నప్పటికీ నష్టం మాత్రం ఎక్కువగా కాంగ్రెస్‌కే జరిగిందనే టాక్ వినబడుతుంది. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా ఈ ఎన్నికలను తేలికగా తీసుకోవడంతో కాంగ్రెస్ మద్దతుదారుల విజయానికి కళ్లెం పడిందనే వాదనలు ఉన్నాయి. వెన్నుపోటు రాజకీయాలే కాంగ్రెస్ మద్దతుదారుల కొంప ముంచాయని తాండూరు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుండడంతో ఆ దిశగా కూడా పార్టీలో అంతర్మథనం జరుగుతోంది. కాంగ్రెస్ పెద్దల నుంచి డబ్బుల సహకారం సైతం కొరవడడంతో ఎన్నికల ఖర్చులను సైతం చాలా వరకు అభ్యర్థులే భరించాల్సి వచ్చిందని తెలిసింది. సమన్వయంతో పనిచేసి మరింత వ్యూహాత్మకంగా వెళ్తే మరింత మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవన్న చర్చ కాంగ్రెస్ పార్టీ నేతల్లో జరుగుతోంది. త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనుండడంతో గత తప్పిదాలను సరిదిద్దుకునే పనిలో పార్టీ నేతలు నిమగ్నమయ్యారు.

బీఆర్‌ఎస్‌లో నూతనోత్తేజం..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన తర్వాత జరిగిన పలు ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి పాలవుతూ వస్తోంది. దీంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతామని బయటకు చెప్పినప్పటికీ విజయావకాశాలపై ఆ పార్టీ నేతల్లో అంతర్గతంగా ఒకింత భయం నెలకొనే ఉందని వినికిడి. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలిస్తాయని పదేపదే ఆ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే మొదటి విడతలో ఆశించిన స్థాయిలో సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఇదే ఉత్సాహంతో పార్టీ నేతలు, శ్రేణులు శ్రమించి మూడు విడతల్లోనూ చెప్పుకోదగ్గ రీతిలో సర్పంచులను గెలిపించుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను ఢీకొట్టి సరిసమాన స్థాయిలో సర్పంచ్ స్థానాలను బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. నిరాశలో ఉన్న పార్టీ శ్రేణుల్లో పంచాయతీ ఫలితాలు జోష్‌‌ను నింపాయని, వచ్చే ఎన్నికల్లోనూ ఇదే జోరు సాగుతుందన్న ధీమాను బీఆర్‌ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

పల్లెల్లో కాషాయం రెపరెపలు..

పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బీజేపీ పార్టీ పల్లె పోరులో ప్రభావాన్ని చూపించింది. పార్టీ బలంగా ఉన్న మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు, మహేశ్వరం మండలాల్లో మెరుగైన స్థానాలను ఆ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. కందుకూరు మండలంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కంటే అత్యధిక స్థానాలను దక్కించుకోవడం గమనార్హం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపడతామని చెబుతున్న బీజేపీ పార్టీకి పంచాయతీ ఎన్నికలు కొంత ఊరటను ఇచ్చాయనే టాక్ వినబడుతుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఒకప్పుడు కంచుకోటగా ఉన్న సీపీఎం పార్టీ సైతం మంచాల మండలంలో మూడు సర్పంచ్ స్థానలను గెలిపించుకుని తన ఉనికి చాటుకుంది.

Next Story