కాండ్యూడ్ లీకేజీ! మణికొండ పరిధిలో నీటి వృథా

by Thanuru Gopichand |

గండిపేట జలాశయం నుంచి హైదరాబాద్ మహానగరానికి నీటి సరఫరా జరుగుతుంది. సుమారు 14 కిలోమీటర్ల మేర కండ్యూడ్ ద్వారా గ్రావిటీ పద్ధతిలో రిజర్వాయర్ నుంచి నీరు వెళ్తుంది.

కాండ్యూడ్ లీకేజీ! మణికొండ పరిధిలో నీటి వృథా
X

దిశ, గండిపేట: గండిపేట జలాశయం నుంచి హైదరాబాద్ మహానగరానికి నీటి సరఫరా జరుగుతుంది. సుమారు 14 కిలోమీటర్ల మేర కండ్యూడ్ ద్వారా గ్రావిటీ పద్ధతిలో రిజర్వాయర్ నుంచి నీరు వెళ్తుంది. నాటి గొప్ప ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ కండ్యూడ్ నిర్మాణానికి రూపకల్పన చేశారు. అయితే ప్రస్తుతం మణికొండ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కాండ్యూడ్ నుంచి నీరు భారీగా వృథాగా పోతుంది. విలువైన నీరు వృధాగా పోవడంతో స్థానికులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాటర్ లీకేజీ ఎక్కడంటే..

మణికొండ సర్కిల్ పరిధిలోని కేపీఆర్ కాలనీ, సెక్రటేరియట్ కాలనీ మధ్య కాండ్యూడ్ ద్వారా నీటి లీకేజీ జరుగుతుంది. సుమారు మూడు రోజుల క్రితం మధ్యాహ్నం సమయంలో భారీగా నీటి లీకేజీ కావడంతో సమాచారం అందుకున్న జలమండలి అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. అనంతరం అదే రోజు సాయంత్రం నుంచి తిరిగి నీటి లీకేజీ జరిగింది. మరుసటి రోజు అధికారులు ఉదయం వచ్చి తిరిగి మరమ్మతులు చేపట్టినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. తరచూ లీకేజీలు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. మణికొండ పరిధిలోని జెమ్ మోటార్స్, నాగులమ్మ ఆలయం సమీపంలో కూడా నీటి లీకేజీ జరిగింది. సంబంధిత శాఖ అధికారులు మరమ్మతులు చేపడుతూనే ఉన్నా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో కాండ్యూడ్ ద్వారా భారీగా నీటి వృథా జరుగుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూడు, నాలుగు రోజులు బంద్ చేయాలి..

గండిపేట జలాశయం నుంచి హైదరాబాద్ మహా నగరానికి నీటి సరఫరా చేపట్టేందుకు కాండ్యూడ్ నిర్మాణం చేపట్టి వంద సంవత్సరాలు పూర్తి కావడంతో భారీగా మరమ్మతులు వస్తున్నాయి. అయినా జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలంటే గండిపేట జలాశయం నుంచి నీటి సరఫరాను మూడు, నాలుగు రోజులు నిలిపివేసి కాండ్యూడ్ లోపలి భాగం నుంచి మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుందని జలమండలి అధికారులు అభిప్రాయపడ్డారు. గతంలో ఎండాకాలంలో మరమ్మతులు చేపట్టేందుకు పూనుకోగా.. నీటి సరఫరాతో హైదరాబాద్ నగరంలో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో అప్పట్లో పనులు చేపట్టలేదు. కాండ్యూడ్ వాహనం కోసం, మరమ్మతుల నిర్మూలనకు ఇటీవల టెండర్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. త్వరలో పనులు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాండ్యూడ్ నుంచి వృథా అయ్యే నీటిని అరికట్టేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎక్కడైనా లీకేజీలు దొరికితే తమకు సమాచారం అందించాలని, వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. కాన్ డ్యూడ్ నిర్మించి వందేళ్లు పూర్తి కావడంతో మరమ్మతులు ఎక్కువ వస్తున్నాయని చెప్పారు.

వారసత్వ సంపదగా గుర్తించాలి..

మణికొండ పరిధిలోని కాండ్యూడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ సంపదగా గుర్తించి దానిని పరిరక్షించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మణికొండకు చెందిన మర్యాల అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కొన్ని రోజుల క్రితం మణికొండ మున్సిపల్ అధికారులు కాం డ్యూడ్ దగ్గర లైటింగ్ ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వంతోపాటు ఆయా శాఖల అధికారులు సత్వరమే స్పందించి కాండ్యూడ్‌ను పూర్తిస్థాయిలో పరిరక్షించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాడు ఎంతో ఖ్యాతి గడించిన ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన నిర్మాణాన్ని మనం భావితరాలకు అందజేయాల్సిన అవసరం చాలా ఉంది.

Next Story