కమిషనర్ సంతకం ఫోర్జరీ.. నలుగురి అరెస్టు

by Taduka Kalyani |   (  Updated:2025-07-03 16:00:36  IST  )

నార్సింగి మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్లాటు రిలీజ్ డీడ్ కు యత్నించిన కేసులో నార్సింగి పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు

కమిషనర్ సంతకం ఫోర్జరీ.. నలుగురి అరెస్టు
X

దిశ, రాజేంద్రనగర్ : నార్సింగి మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్లాటు రిలీజ్ డీడ్ కు యత్నించిన కేసులో నార్సింగి పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. కేసు వివరాలను గురువారం ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి వెల్లడించారు. నార్సింగి లోని గండిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి గత నెల 17న మధ్యాహ్నం నార్సింగి గ్రామంలోని ప్లాట్ నెం.146 కు సంబంధించి ఓ విడుదల పత్రం (రిలీజ్ డీడ్) నమోదు చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఇతడు తన పేరు సంతోష్ అని చెప్పి, నార్సింగి మున్సిపాలిటీ నుంచి జారీ చేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, అధికార పత్రం (అథరైజేషన్ లెటర్) సమర్పించాడు. అందులో మున్సిపల్ కమిషనర్ సంతకాలు ఉన్నట్లు చూపించాడు.

అయితే గండిపేట్ సబ్ రిజిస్ట్రార్ కి అనుమానం రావడంతో, ఆయా డాక్యుమెంట్లను తనిఖీ చేసినప్పుడు మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. దీంతో నార్సింగి మున్సిపాలిటీ నుంచి అధికార ప్రతినిధిని పిలవగా సంతోష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదిలా ఉండగా అప్పటికే సదరు ప్లాట్ నెం.146 యజమానురాలు నీరజా ఆ స్థలాన్ని జనవరి 2025లో అరవింద్ అనే వ్యక్తికి విక్రయించింది. మళ్లీ అదే ప్లాట్ పై నకిలీ డాక్యుమెంట్లను ఉపయోగించి మోసానికి ప్రయత్నించారు. ఈ విషయమై గండిపేట్ సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో మోసానికి పాల్పడింది ఏ 1 గులాం మహమ్మద్ ఖాన్, ఏ -2. వెంకట్ సత్యనారాయణ, ఏ -3. జహీర్ అహ్మ,ద్ S/o బషీర్ మియా, ఏ -4. చీడెళ్ల శివ నాగేశ్వరరావుగా గుర్తించారు. ఈ నలుగురు కలిసి మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని నకిలీ చేసి, ఫేక్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, అధికార పత్రాలు తయారు చేశారు. అలాగే సంతోష్, వీరబాబు, శివాని కలిసి నకిలీ మున్సిపల్ ఉద్యోగులుగా వ్యవహరించారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆధారాల మేరకు జహీర్, శివ నాగేశ్వరరావు, సత్యనారాయణ, గులాం మహ్మద్ ఖాన్ ను అరెస్టు చేసి గురువారం రిమాండ్ కు తరలించారు.

Next Story