అడ్డగోలుగా ఎస్ఆర్ అకాడమీ.. మణికొండలో పర్మిషన్ లేకుండానే కాలేజీ నిర్వహణ

by Ajay Maddhiboyina |

అనుమతులా.. అవేంటి..? అన్నట్లుగా ఉంది ఎస్సార్ అకాడమీ నిర్వాహకుల వ్యవహారం. 'మా సార్‌కు పెద్ద పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది.

అడ్డగోలుగా ఎస్ఆర్ అకాడమీ.. మణికొండలో పర్మిషన్ లేకుండానే కాలేజీ నిర్వహణ
X

దిశ, గండిపేట : అనుమతులా.. అవేంటి..? అన్నట్లుగా ఉంది ఎస్సార్ అకాడమీ నిర్వాహకుల వ్యవహారం. 'మా సార్‌కు పెద్ద పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆయన మాజీ ఎంపీ వియ్యంకుడు. విద్యాశాఖ అధికారులు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. పర్మిషన్ లేకపోయినా మమ్మల్ని అడిగేది లేదు. అనుమతులు లేకుండా చాలా కాలేజీలు నడుస్తున్నాయి కదా.. ఈ మాటలు అన్నది స్వయానా మణికొండలోని ఎస్‌ఆర్ అకాడమీ జోనల్ ఇన్‌చార్జి పద్మనాభ రెడ్డి.

బడా కార్పొరేట్ కళాశాల..

ఎస్సార్ కళాశాల యాజమాన్యం ఓ బడా కార్పొరేట్ సంస్థ. హైదరాబాద్ మహానగరంలో మొత్తం 32 కళాశాలలను నడిపిస్తుంది. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సకాలంలో ఫీజులు చెల్లించాలని విద్యార్థులను తీవ్రంగా వేధిస్తున్నట్లు సమాచారం. గండిపేట మండలం మణికొండ సర్కిల్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా ఎస్ఆర్ అకాడమీ పేరుతో కళాశాల నిర్వహిస్తున్నారని తెలిసింది. సుమారు 300 మందికిపైగా విద్యార్థులు ఆ కళాశాలలో చదువుకుంటున్నారని తెలిసింది. వివిధ రకాల కోచింగులు ఇస్తామంటూ ఒక్కో విద్యార్థి నుంచి సుమారు రూ.2 లక్షలకు పైగానే వసూలు చేస్తున్నట్లు తెలిసింది.

అనుమతులు లేకుండా కళాశాల నిర్వహణ..

నార్సింగి నుంచి మణికొండ వెళ్లే మార్గంలో గీతాంజలి పాఠశాల సమీపంలో ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా కొన్ని సంవత్సరాలుగా ఎస్‌ఆర్ కళాశాల నిర్వహిస్తున్నారని తెలిసింది. ఈ కళాశాల యజమాని ఓ మాజీ ఎంపీ వియ్యంకుడని, రాజకీయ నేపథ్యం ఉండటంతో ఎస్ఆర్ కళాశాల యాజమాన్యం అడ్డగోలుగా వ్యవహరిస్తోందనె విమర్శలు వినిపిస్తున్నాయి. రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో కళాశాల నిర్వహించడం, పార్కింగ్ స్థలం లేకపోవడం, విద్యార్థులకు ఆట స్థలం కూడా లేవని పలువురు ఆరోపిస్తున్నారు. కళాశాల యాజమాన్యం నిబంధనలు తుంగలో తొక్కి కళాశాల నిర్వహిస్తున్నారని, దీనికి విద్యాశాఖ అధికారులు సహకరిస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్ఆర్ అకాడమీలో అర్హత లేని అధ్యాపకులు బోధన చేస్తున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్న జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు కనీసం నోటీసులు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇలా అన్ని విధాలుగా మణికొండలోని ఎస్సార్ అకాడమీకి విద్యాశాఖ అధికారులు వంతపాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు మొద్దు నిద్ర వీడి కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- స్పందించని డీఐఓ వెంక్యా నాయక్..

మణికొండలోని ఎస్సార్ అకాడమీ పేరుతో నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించడంపై వివరణ కోరెందుకు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి వెంక్యా నాయక్‌కు పలుమార్లు ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు.

Next Story