బీజేపీలో ఆగని వర్గ పోరు.. రచ్చకెక్కుతున్న అంతర్గత విబేధాలు

by Dishanational2 |
బీజేపీలో ఆగని వర్గ పోరు.. రచ్చకెక్కుతున్న అంతర్గత విబేధాలు
X

అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఓడిస్తాం, తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకులు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. అందుకు ప్రణాళికలు సైతం రచిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో నాయకులను సమాయత్తం చేస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంటే శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు మాత్రం అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేధాలు, పాత, కొత్తల పంచాయతీతో తమలోని అనైక్యతను బహిరంగంగానే బజారుకీడుస్తున్నారు. అధిష్టానం పిలుపు ఇచ్చిన కార్యక్రమాలను సైతం కలిసి కట్టుగా చేయకుండా ఎవరి వర్గాలతో వారు, ఎవరికి అనుకూలంగా ఉన్నచోట వారు చేస్తూ క్యాడర్ లో అయోమయం సృష్టిస్తున్నారు. ఒక్క అంశంపైనే భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తూ తమ వింత వైఖరిని చాటుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఎవరికి వస్తుందన్న విషయాన్ని పక్కన పెడితే, ఇప్పటి నుండే నాకంటే నాకంటూ లీడర్లు అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. దీంతో మొదటి నుండి పార్టీ కోసం పనిచేస్తున్న కమలనాథులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. పార్టీ బలోపేతం అవుతుంది అనుకుంటే ఈ కొత్త పంచాయతీ ఏంటని తలలు పట్టుకుంటున్నారు. శేరిలింగంపల్లిలో కమల నాథుల కయ్యాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

దిశ, శేరిలింగంపల్లి : రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయం. కారు స్పీడ్‌కు బ్రేకులు వేస్తాం. అధికారాన్ని చేజిక్కించుకుంటాం అంటూ సమరశంఖం పూరిస్తున్నారు బీజేపీ, కేంద్ర, రాష్ట్ర నాయకులు. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తూ రాష్ట్రంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో ముందుకు వెళుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో బలపడుతూ తమ ఉనికి చాటుతున్నారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్ ఇలా వరుస విజయాలతో జోరుమీదున్నారు బీజేపీ నాయకులు. కానీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేని పరిస్థితి. అధికార బీఆర్‌ఎస్ పార్టీ విధానాలను ఖండించడం, అభివృద్ధి విషయాలపై ప్రశ్నించడం పక్కన పెడితే.. అంతర్గత కుమ్ములాటలతో ఒకరిద్దరు నాయకులు పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని, సొంత అజెండాతో ప్రజల్లోకి వెళుతూ కార్యకర్తల్లో పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టిస్తున్నారన్నా ఆందోళన ఆపార్టీ సీనియర్లతో వ్యక్తం అవుతుంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే బీజేపీ బలపడుతుందని, కానీ ఆధిపత్యపోరు, అంతర్గత విబేధాలు కమల వికాసానికి కష్టాలను తెచ్చిపెడుతున్నాయని, తద్వారా భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, దాని అనుబంధ సంఘాలు అన్నీ క్రమశిక్షణతో వ్యవహరిస్తూ పార్టీ ఆదేశాలను శిరసావహిస్తుంటాయని, కానీ ఇక్కడ మాత్రం నాయకులు ఆవిషయాన్నే మర్చిపోయారన్నా అసహనం వ్యక్తం చేస్తున్నారు పార్టీ సీనియర్లు.

ఎవరికి వారే..

రాష్ట్ర పార్టీ ఏ పిలుపునిచ్చినా శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు మాత్రం కలిసికట్టుగా కాకుండా ఎవరికి వారే విడివిడిగా చేస్తుంటారు. ఇలా ఏదో ఒక సందర్భంలో కాదు ప్రతీ విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే నియోజకవర్గంలో ఒకే కార్యక్రమాన్ని ఒకరు ఒకచోట నిర్వహిస్తే, మరొకరు మరోచోట ఏర్పాటు చేస్తున్నారు. ఇలా నలుగురు నాయకులు నాలుగుచోట్ల నిర్వహిస్తున్న తీరుతో పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. ఎటు వెళ్లాలో తెలియని అయోమయం నెలకొంటుందని, ఎవరు ఎక్కడ చేస్తున్నారో తెలియడం లేదని, చాలా కార్యక్రమాలు తమకు కనీసం సమాచారం కూడా లేకుండా పోతోందని పార్టీ క్యాడర్ అంటోంది. పార్టీ కార్యక్రమాలను కూడా ఒకే వేదిక మీద నిర్వహించలేనంత శేరిలింగంపల్లి నేతల మధ్య గ్యాప్ నెలకొంది. మొన్నటికి మొన్న కేంద్ర బడ్జెట్ అనంతరం ఆత్మ నిర్భర్‌లో భాగంగా ప్రధాని మోదీ ప్రసంగాన్ని కలిసి కూర్చుని వినేంత ఓపిక కూడా లేకుండా పోయిందనే టాక్ ఉంది. మన్ కీ బాత్ 100వ ఏపీసోడ్ విషయంలోనూ ఇదే జరిగింది. ఓ వర్గం నాయకులు అంతా ఒకే వేదికను పంచుకోగా.. ఇంకొందరు మాత్రం ప్రధాని ప్రసంగాన్ని కూడా పక్కన పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ నాయకత్వం ఇస్తున్న పిలుపులను కూడా వర్గాల వారిగా విడిపోయి కార్యక్రమాలను చేయడం వారి విభేదాలను బహిర్గతం చేసింది.

నేతల పాదయాత్రల దారెటు

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఒకరిద్దరు నాయకులు పాదయాత్రల పేరుతో పలు డివిజన్లలో పర్యటిస్తున్నారు. ఒకరు తమ వర్గంతో కలిసి ఓ డివిజన్ లో పాదయాత్ర చేస్తే.. మరో నాయకుడు ఆపక్క కాలనీలోనే పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇలా ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు పోటాపోటీగా ఒకే డివిజన్ లో బస్తీబాటలో పాల్గొనడం కమలంపార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను బట్టబయలు చేసింది. వీరిద్దరే కాదు మిగతా సీనియర్లు కూడా తలోబాట పడుతున్నారు. ఒక్క ప్రజా సమస్యపై కూడా బీజేపీ నాయకులంతా కలిసి గళమెత్తిన ఘటన ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఇక కొన్ని డివిజన్ల అధ్యక్షులు అయితే జిల్లా ఇంఛార్జీలు, రాష్ట్ర నాయకుల సాక్షిగా బాహాబాహికి దిగుతున్నారు. కుస్తీలకు దిగడం శేరిలింగంపల్లి బీజేపీ నాయకులకు పరిపాటిగా మారింది. గతంలో గచ్చిబౌలిలో పార్టీ సీనియర్ల మధ్య జరిగిన గొడవ క్రమశిక్షణ సంఘం దృష్టికి వరకు వెళ్లి కమిటీలు వేసే వరకు వెళ్ళింది. ఆఘటన నుండి పాఠాలు నేర్వని బీజేపీ నేతలు తాజాగా సోమవారం శేరిలింగంపల్లిలో మరోసారి రచ్చకెక్కారు. తమకు సమాచారం లేకుండా మా డివిజన్ లో ఎలా పర్యటిస్తారు అంటూ పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఈ పంచాయతీ పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. ఈ విధంగానాయకులు వ్యవహరిస్తున్న తీరుతో కమలం పార్టీకి ఉన్న పరువును రోడ్డుకు ఈడుస్తున్నారని పార్టీ శ్రేణులు, అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed