రంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహం

by Muthe.Rajitha |

రంగారెడ్డి(Rangareddy) జిల్లా నందిగామ మండల కేంద్రంలో జరిగిన ఒక బాల్య వివాహ(Child Marriage) ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

రంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహం
X

దిశ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి(Rangareddy) జిల్లా నందిగామ మండల కేంద్రంలో జరిగిన ఒక బాల్య వివాహ(Child Marriage) ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గత మే 28న 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికకు చేవెళ్ల మండలం కందివాడకు చెందిన 40 ఏళ్ల శ్రీనివాస్ గౌడ్‌తో తల్లిదండ్రులు బలవంతంగా వివాహం జరిపించారు. అబ్బాయికి ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయని బాలికకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ వివాహం జరిపించారు. అయితే ఆషాడ మాసం అనంతరం బాలికను తమ ఇంటికి తీసుకు వెళ్ళడానికి అబ్బాయి రావడంతో తాను వెళ్ళేది లేదని తేల్చి చెప్పింది. అంతటితో ఆగకుండా తన స్కూల్ టీచర్లకు విషయం తెలియజేస్తూ.. తనకు బాగా చదువుకోవాలని ఉందని, ఈ పెళ్లి బలవంతంగా జరిపించారని, తనను ఎలాగైనా కాపాడమని కోరింది.

బాలిక ఇచ్చిన సమాచారంతో ఉపాధ్యాయులు వెంటనే నందిగామ తహసీల్దార్ రాజేశ్వర్, ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌లకు ఇన్ఫర్మేషన్ అందించారు. పోలీసులు, మండలాధికారులు వెంటనే రంగంలోకి దిగి.. బాలిక తల్లి స్రవంతి, వరుడు శ్రీనివాస్ గౌడ్, వివాహం జరిపిన పురోహితుడు ఆంజనేయులు, సంబంధం చూసిన మధ్యవర్తి పెంటయ్యలపై బాల్య వివాహ నియంత్రణ చట్టం (ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, 2006) కింద కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను సురక్షితంగా సఖి సెంటర్‌కు తరలించి, అవసరమైన సంరక్షణ ఏర్పాట్లు చేశారు.

Next Story