కాలికామాత దేవాలయాన్ని ఢీకొట్టిన కారు గుర్తింపు

by Taduka Kalyani |

రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల కేంద్రంలో శ్రీ కాళికామాత ఆలయాన్ని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టి పరారైన ఘటనను పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు.

కాలికామాత దేవాలయాన్ని ఢీకొట్టిన కారు గుర్తింపు
X

దిశ, తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల కేంద్రంలో శ్రీ కాళికామాత ఆలయాన్ని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టి పరారైన ఘటనను పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారాలను క్షుణ్ణంగా విశ్లేషించిన పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు, డ్రైవర్‌ను గుర్తించి కేసును వేగంగా పరిష్కరించారు. పోలీసుల చాకచక్యంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆమనగల్–షాద్‌నగర్ ప్రధాన రహదారిపై దేవకి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న శ్రీ కాళికామాత దేవాలయాన్ని మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ షిఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం ఆలయ నిర్వాహకులు, స్థానికులు నష్టం గుర్తించి తలకొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే ఎస్‌హెచ్‌ఓ వి. జానకిరామ్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల విశ్లేషణలో నైపుణ్యం కలిగిన కానిస్టేబుల్ జాషువా ఆధ్వర్యంలో పరిసర ప్రాంతాల్లోని ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో కడ్తాల్ మండలంలోని సీసీ కెమెరాల్లో లభించిన దృశ్యాల ఆధారంగా ప్రమాదానికి కారణమైన షిఫ్ట్ డిజైర్ కారును గుర్తించారు. దర్యాప్తులో మిడ్జిల్ మండలం వేముల గ్రామానికి చెందిన కేంగురి రాఘవేందర్ ప్రమాద సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తుండగా, అధిక వేగం కారణంగా వాహనం అదుపు తప్పి ఆలయాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన వాహనంతో పాటు నిందితుడిని 48 గంటల్లోనే గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. కేసు ఛేదనలో కానిస్టేబుల్ జాషువా చూపిన అప్రమత్తత, సాంకేతిక నైపుణ్యాన్ని ఎస్‌హెచ్‌ఓ ప్రత్యేకంగా అభినందించారు. ఆలయానికి జరిగిన నష్టం అంచనా వేస్తున్నామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Next Story